– మార్చి 1 నుంచి గాలికుంటు వ్యాధి , బ్రుసెల్లోసిస్ టీకాల కార్యక్రమం
– అవగాహన పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశువులకు అవసరమైన టీకాలను సకాలంలో అందించి, పూర్తిస్థాయిలో వ్యాధులను అరికట్టేందుకు కృషిచేయాలని, జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం ద్వారా పశు సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ లక్ష్మీశ.. పశుసంవర్థక శాఖ అధికారులతో కలిసి గాలికుంటు వ్యాధి, బ్రూసెల్లోసిస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ పశు సంపదను పెంచడంతో పాటు వాటి ఆరోగ్య పరిరక్షణకు పశు వైద్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ రైతులకు సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు. మార్చి 1 శనివారం నుంచి 30వ తేదీ వరకు పశువులకు గాలి కుంటువ్యాధి, బ్రుసెల్లోసిస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని నిర్దేశించిన గడువులోగా పూర్తిచేసేందుకు చొరవచూపాలన్నారు. నాలుగు నెలల వయసు దాటిన పశువులకు గాలికుంటువ్యాధి నిరోధక టీకాలు, 4-8 నెలల వయసున్నపెయ్యదూడలకు బ్రుసెల్లోసిస్ నిరోధక టీకాలు పశుసంవర్ధక శాఖ సిబ్బంది ఉచితంగా రైతు వద్దనే వేయాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం 2.27 లక్షల గాలికుంటువ్యాధి నిరోధక టీకాలు, దాదాపు పదివేల బ్రుసెల్లోసిస్ వ్యాధి నిరోధకటీకాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో ఈ టీకాలు వేసేందుకు 52 బృందాలను ఏర్పాటుచేయడం జరిగిందని.. ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డా. ఎం.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News