– పారిశ్రామిక యూనిట్లను చేయిపట్టి నడిపించేందుకే సర్వే
– మార్చి 15లోగా సచివాలయ సిబ్బందికి వివరాలు ఇవ్వండి
– నిస్సంకోచంగా యూనిట్ల యజమానులు సమాచారమివ్వొచ్చు
– అధికారులూ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి అవగాహన కల్పించండి
– ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక యూనిట్ల (ఎంఎస్ఎంఈ) ప్రస్తుత పరిస్థితిని క్షుణ్నంగా తెలుసుకొని.. అవి ప్రగతి పథంలో వడివడిగా ముందుకు పయనించేందుకు చేయిపట్టి నడిపించేందుకే ప్రభుత్వం ప్రత్యేక సర్వే చేస్తోందని.. చిరువ్యాపారులు, పరిశ్రమలు సత్వరం తమ వివరాలను మార్చి 15లోగా అందించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు. కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం కలెక్టరేట్‌లో ఎంఎస్ఎంఈ సర్వే పురోగతిపై పరిశ్రమల శాఖతో పాటు వివిధ సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక యూనిట్ల సమాచారాన్ని సేకరించి, ఎంఎస్ఎంఈ (ఉద్యమ్) యాప్‌లో పొందుపరిచి, ఆపై విశ్లేషించి అవసరమైన సహాయసహకారాలు అందించేందుకు సర్వే చేయడం జరుగుతోందని, యూనిట్ల యజమానులు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి నిస్సంకోచంగా సమాచారం ఇవ్వొచ్చన్నారు. జిల్లావ్యాప్తంగా ఎంఎస్ఎంఈ సర్వేను విస్తృత స్థాయిలో చేపట్టడం జరుగుతోందని, పారిశ్రామిక యూనిట్‌కు ఏదైనా రుణ సహాయం అవసరమా? నైపుణ్యాభివృద్ధితో పాటు మార్కెటింగ్ అవసరాలు ఏమైనా ఉన్నాయా? ఇలా ఆయా యూనిట్లకు అవసరమైన చేయూతనందించేందుకు సర్వేను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తు అభివృద్ధికి అవసరమైన సాంకేతికత సహాయంతో పాటు వ్యాపార నిర్వహణ నైపుణ్యాల్లో లోపాలను గుర్తించి, సరిదిద్దేందుకు కూడా సర్వే ఫలితాలు దోహదం చేస్తాయన్నారు.
అధికారులూ క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించండి:
ఎంఎస్ఎంఈ సర్వే ప్రయోజనాలను పారిశ్రామిక యూనిట్ల యజమానులకు వివరించి సమాచారాన్ని అందించేలా ప్రోత్సహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటివరకు 39,491 యూనిట్ల సర్వే పూర్తయిందని.. మిగిలిన దాదాపు 56 వేల యూనిట్ల సర్వేను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేందుకు కృషిచేయాలన్నారు. ఓ మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ లక్ష్మీశ హెచ్చరించారు. రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకొని ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు ప్రత్యేక ప్రణాళిక, కార్యాచరణతో సర్వేను విజయవంతంగా పూర్తిచేసేందుకు చొరవచూపాలని స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News