-గృహ, పారిశ్రామిక, వ్యాపారులకు ఇబ్బంది లేకుండా చర్యలు
-ప్రత్యామ్నాయంగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి
-ఆర్డీఎస్ఎస్ పనులు వేగవంతం చేయాలి
-డిస్కంల సీఎండీలతో మంత్రి గొట్టిపాటి సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వేసవికాలంలో అధిక వినియోగానికి తగినట్లు విద్యుత్ ఉత్పత్తి ఉండేలా శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆదేశించారు. వేసవి లో విద్యుత్ వినియోగం, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, ఆర్డీఎస్ఎస్ పనుల పురోగతిపై డిస్కంల సీఎండీలతో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సచివాలయంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న వేసవి కాలంలో కూడా రైతులకు 9 గంటల నిరంతరాయ ఉచిత విద్యుత్ ను సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. గృహ, వ్యాపార, పారిశ్రామిక వినియోగ అవసరాలకు ఇబ్బంది లేకుండా అందరికీ 24 గంటల విద్యుత్ అందించాలని స్పష్టం చేశారు. విద్యుత్ గరిష్ట డిమాండ్ సుమారు 13,700 మెగావాట్లకు చేరుకోవచ్చని, ఈ వేసవి కాలంలో రోజువారీ విద్యుత్ వినియోగం 260 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుందని అంచనాలున్న నేపథ్యంలో… ముందస్తు ప్రణాళికలతో విద్యుత్ సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని విద్యుత్ సంస్థలకు ఆయన సూచించారు. పెరుగుతున్నవిద్యుత్ వినియోగ డిమాండ్‌ను తీర్చడానికి ప్రత్యామ్నాయంగా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని, ముఖ్యంగా సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి కోరారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల పై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ… ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 22,709 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చిందన్నారు. డిమాండ్ మేరకు రైతులకు అవసరమైనన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడానికి అధికారులు సిద్దంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. వేసవి కాలంలో ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేలా కనెక్షన్ల ప్రాసెసింగ్ వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆర్డీఎస్‌ఎస్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి గొట్టిపాటి…. విద్యుత్ పంపిణీ సామర్థ్యాలను పెంచుకోవడం, నష్టాలను తగ్గించడం, సబ్ స్టేషన్లు, ట్రాన్స్ మిషన్ నెట్వర్కలను ఆధునీకరించడంపై అధికారులు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. సమీక్షలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, డిస్కంమ్‌ల సిఎండిలు పృథ్వీ తేజ్, భాస్కర్, సంతోష్ రావు, నెడ్ క్యాప్ వీసీఎండీ ఎం. కమలాకర్ బాబు, ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శి కుమార్ రెడ్డి, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News