వ్య‌వసాయ క‌నెక్ష‌న్ల‌కు, ఉచిత విద్యుత్ కు రూ.12,400 కోట్ల వ్య‌యం

-ప‌గ‌టి పూటే రైతులకు 9 గంట‌ల ఉచిత విద్యుత్ సరఫరా
-కూట‌మి ప్రభుత్వం ఏర్ప‌డిన అన‌తి కాలంలోనే రైతులకు 22,709 క‌నెక్ష‌న్ల ఏర్పాటు
-ఇప్ప‌టి వ‌ర‌కు 69,975 వ్య‌వ‌సాయ క‌నెక్ష‌న్ల మంజూరు
-ఇప్పటికే ల‌క్ష పీఎం కుసుమ్ కనెక్షన్లు, కేంద్ర సహకారంతో త్వరలో 2 ల‌క్ష‌లు
-విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంద‌న్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా… అన్న‌దాత‌ల‌కు ఎటువంటి ఇబ్బందీ లేకుండా వ్య‌వ‌సాయ ఉచిత‌ విద్యుత్ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ పేర్కొన్నారు. శాస‌న‌స‌భ‌లో విద్యుత్ శాఖ‌కు సంబంధించి స‌భ్యులు బ‌త్తుల బ‌ల‌రామ‌కృష్ణ‌, ఉగ్ర న‌ర‌సింహారెడ్డి, బండారు సత్యానందరావులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి గొట్టిపాటి సోమ‌వారం సభలో స‌మాధాన‌మిచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… కూట‌మి ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయ విద్యుత్ క‌నెక్ష‌న్ల‌కు, ఉచిత విద్యుత్ కు ఏడాదికి రూ.12,400 కోట్ల‌కు పైగా వ్య‌యం చేస్తుంద‌ని వివ‌రించారు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన అతి త‌క్కువ కాలంలోనే 22,709 వ్య‌వ‌సాయ విద్యుత్ క‌నెక్ష‌న్లు ఇచ్చామ‌ని తెలిపిన మంత్రి గొట్టిపాటి… మొత్తం 69,975 క‌నెక్ష‌న్ల‌ను మంజూరు చేశామ‌ని స్ప‌ష్టం చేశారు. ఒక్కో వ్య‌వ‌సాయ‌ విద్యుత్ క‌నెక్ష‌న్ కోసం కూటమి ప్రభుత్వం రూ.2.60 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు మంత్రి ఈ సంద‌ర్భంగా వివరించారు. డిస్కంల్లో విద్యుత్ ఉపకరణాల ధరలు తేడా ఉండడంపై గౌరవ సభ్యులు మాట్లాడిన విషయంపై మంత్రి గొట్టిపాటి స్పందించారు. వైసీపీ ప్ర‌భుత్వం విద్యుత్ రంగాన్ని స‌ర్వ‌నాశ‌నం చేసింద‌ని మంత్రి విమ‌ర్శించారు. స్థంబాలు, ట్రాన్స్ మిష‌న్ లైన్లను అత్య‌ధిక ధ‌ర‌ల‌కు కొనుగోలు చేయ‌డంతో మూడు డిస్కంల ప‌రిధిలోని ధ‌ర‌ల్లో వ్య‌త్యాసం ఏర్ప‌డింద‌ని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఉపకరణాల కొనుగోలు ధరల్లో మార్పులు లేకుండా స్థిరీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ప‌గ‌టి పూటే రైతులకు 9 గంట‌ల నిరంతర ఉచిత విద్యుత్ స‌ర‌ఫ‌రా…
పీఎం కుసుమ్ ప‌థ‌కాన్ని వైసీపీ ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం చేయ‌డంతో… రైతుల‌కు ప‌గ‌టి పూట పూర్తి స్థాయి విద్యుత్ స‌ర‌ఫ‌రాలో కొన్ని ఆటంకాలు ఏర్పడిన విషయాన్ని మంత్రి గొట్టిపాటి సభలో ప్రస్తావించారు. కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కారంతో… ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆదేశాల ప్ర‌కారం పీఎం కుసుమ్ ప‌థ‌కం ద్వారా అతి త్వ‌ర‌లోనే రైతుల‌కు 9 గంట‌ల నాణ్య‌మైన ఉచిత విద్యుత్ ను నిరంతరాయంగా అందించే దిశగా అడుగులు వేస్తున్నట్లు వెల్ల‌డించారు. రాష్ట్రంలో సుమారు 4.50 ల‌క్ష‌ల వ్య‌వ‌సాయ విద్యుత్ క‌నెక్ష‌న్లు అవ‌స‌రం అని అంచ‌నా వేసిన మంత్రి… ఇప్ప‌టికే ల‌క్ష పీఎం కుసుమ్ క‌నెక్ష‌న్ల‌కు మంజూర‌య్యాయ‌ని తెలిపారు. మ‌రో రెండు ల‌క్ష‌ల క‌నెక్ష‌న్లకు సంబంధించి కేంద్రం సానుకూలంగా స్పందించింద‌న్నారు. వీటికి సంబంధించి త్వ‌ర‌లోనే టెండ‌ర్ల ప్ర‌క్రియ మొద‌లు పెడుతున్నామ‌ని ఆయ‌న‌ తెలిపారు.

అల్యూమినియం ట్రాన్స్ ఫార్మ‌ర్ల‌తో దొంగ‌త‌నాల‌కు అడ్డుక‌ట్ట‌…
రైతులు ఎదుర్కొంటున్న అన్ని స‌మ‌స్య‌ల‌నూ పూర్తి స్థాయిలో ప‌రిష్క‌రించేందుకు కూట‌మి ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ప‌ని చేస్తుంద‌ని మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ పేర్కొన్నారు. లో ఓల్టేజ్ తో పాటు అధిక లోడ్ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు మూడు డిస్కంల ప‌రిధిలో త్వ‌ర‌లోనే 70 స‌బ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. అదే విధంగా ప‌ల్నాడు, ప్ర‌కాశం, బాప‌ట్ల ప్రాంతాల్లో జ‌రుగుతున్న ట్రాన్స్ ఫార్మ‌ర్ల దొంగ‌త‌నాలను నిలువ‌రించ‌డానికి ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు చెప్పారు. ట్రాన్స్ ఫార్మ‌ర్ల‌లో ఉండే రాగి వైరు కోసమే దొంగ‌త‌నాలు జ‌రుగుతున్నాయ‌న్నారు. ఇక‌పై అల్యూమినియం ట్రాన్స్ ఫార్మ‌ర్లను వినియోగించే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వివ‌రించారు. అదే విధంగా ట్రాన్స్ ఫార్మ‌ర్ల దొంగ‌త‌నాల విష‌యంలో వెంట‌నే కేసులు న‌మోదు అయ్యేలా చూడాల‌ని పోలీస్ సిబ్బందికి సూచించామ‌ని మంత్రి గొట్టిపాటి సభకు వివరించారు. రాబోయే వ్య‌వ‌సాయ సీజ‌న్ స‌మ‌యానికి రైతుల‌కు విద్యుత్ శాఖ ప‌రంగా ఎటువంటి ఇబ్బందీ లేకుండా ప‌గ‌డ్బందీగా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు మంత్రి గొట్టిపాటి వివ‌రించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *