Breaking News

రైతులు, నిరుద్యోగ యువతకు విరివిగా రుణాలు మంజూరు చేయాలి… : ఎంపీ వల్లభనేని బాలశౌరి

-ఎంపీ అధ్యక్షతన జరిగిన దిశ కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్, జడ్పీ చైర్ పర్సన్ ఇతర ప్రజాప్రతినిధులు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులు, నిరుద్యోగ యువతకు విరివిగా రుణాలు అందించి వారి సంక్షేమాభివృద్ధికి కృషి చేయాలని మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి బ్యాంకు అధికారులను కోరారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్ర గనులు భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, పెడన, అవనిగడ్డ, పామర్రు నియోజకవర్గాల శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్, మండలి బుద్ధ ప్రసాద్, వర్ల కుమార్ రాజా తదితర ప్రజాప్రతినిధులతో కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాల వినియోగంపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, బ్యాంకర్లతో సమీక్షించారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, దివ్యాంగుల సంక్షేమం, గ్రామీణ నీటిపారుదల విభాగం, గృహ నిర్మాణం, వ్యవసాయం, ఇరిగేషన్, వైద్య ఆరోగ్యం, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమం, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, రహదారులు భవనాలు, జాతీయ రహదారులు, పరిశ్రమలు, భూ రికార్డులు సర్వే, విద్యుత్, పౌరసరఫరాలు, పంచాయతీరాజ్, సమగ్ర శిక్ష, చేనేత, మత్స్య, మున్సిపాలిటీలు, నైపుణ్య అభివృద్ధి తదితర శాఖలకు చెందిన కేంద్ర ప్రభుత్వ పథకాల సద్వినియోగం, వాటి అమలులోని సమస్యలపై ఎంపి చర్చించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆయా శాఖల జిల్లా అధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రత్యేక దృష్టి సారించి సక్రమంగా సద్వినియోగం చేసుకునే విధంగా కృషి చేయాలన్నారు. అర్హత కలిగిన లబ్ధిదారులను గుర్తించి వారి అభ్యున్నతికి కృషి చేయాలని సూచించారు. పథకాల అమలులోని సమస్యలను గుర్తించి వాటిని జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వానికి నివేదించడానికి అవకాశం ఉందన్నారు. మత్స్యకారుల కోసం వలలు, ఐస్ బాక్సులు, మోటార్ సైకిళ్లు, తదితర అవసరాల కోసం ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి నివేదించాలని, మిగిలిన శాఖలు సైతం వారి పరిధిలోని పథకాల అమలులో అవసరమైన నిధుల కోసం ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామాలలో డొంక రోడ్లను నిర్మించడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, నిర్మాణంలో నిలిచిపోయిన పాఠశాలల భవనాలను తక్షణమే పూర్తి చేయడానికి కృషి చేయాలన్నారు.

మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ నియోజకవర్గాలలోని తీర ప్రాంత గ్రామాలలో తాగునీటి సమస్య అధికంగా ఉందన్నారు. రాబోయే వేసవి నిమిత్తం రూ.2 కోట్ల వరకు నిధులను మంజూరు చేస్తామని, ఎక్కడ కూడా నీటి సమస్య తలెత్తకుండా చూడాలని, అవసరమైన చోట్ల ట్యాంకర్ల ద్వారా తాగు నీటిని అందించాలన్నారు. నిత్యం అధికారులు గ్రామాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి నీటి నాణ్యతను పరిశీలించాలని సూచించారు.

కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితి పెంచిందని, ఈ నేపథ్యంలో జిల్లాలో ఎంతమంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇప్పించారని ఎంపీ వ్యవసాయ అధికారులను ప్రశ్నించారు. కౌలు రైతులకు సైతం రుణాలు సరిగా మంజూరు చేయడం లేదని తన దృష్టికి వచ్చిందని, దీనిలో సమస్య ఏంటని వ్యవసాయ అధికారులను అడగగా, భూయజమాని ఇదివరకే పంట రుణం తీసుకోవడం వల్ల కౌలుకు తీసుకున్న అదే భూమిపై రెండోసారి రుణాన్ని మంజూరు చేయడానికి బ్యాంకులు నిరాకరిస్తున్నాయని తెలిపారు. దీనిపై ఎంపీ స్పందిస్తూ ఈ సమస్యకు పరిష్కారంగా ఏం చేయవచ్చో సలహాలు, సూచనలు ఇవ్వాలని, దీనికోసం ఆయా శాఖల అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించాలని బ్యాంకు అధికారులకు సూచించారు.

అదేవిధంగా దేశంలోని బ్యాంకులన్నీ దాదాపు అధిక లాభాల్లోనే ఉన్నాయని, కానీ వ్యాపార నిమిత్తం బ్యాంకులు ఎక్కువగా పట్టణ ప్రాంతాలలో ఉన్న వారికి మాత్రమే రుణాలను మంజూరు చేయడంలో ప్రాధాన్యతనిస్తున్నాయని, గ్రామీణ ప్రాంతాలలోని రైతులు, నిరుద్యోగ యువతను విస్మరిస్తున్నాయని ఎంపీ పేర్కొన్నారు. మంచి వివరణాత్మక ప్రాజెక్టు నివేదికతో (డిపిఆర్) ముందుకు వచ్చే యువతకు రుణ మంజూరులో అవకాశాలను కల్పించాలన్నారు. త్వరలో మచిలీపట్నం పోర్టు నిర్మాణం మొదటి దశ పూర్తికానున్నదని, ఈ నేపథ్యంలో పోర్టు ఆధార పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే యువతకు రుణాలను అందించాలన్నారు. అదేవిధంగా రైతులు, మత్స్యకారులను సహృదయంతో పరిశీలనలోకి తీసుకుని రుణాలను మంజూరు చేయాలని సూచించారు.

జిల్లాలో త్వరలో రుణమేళాను నిర్వహించనున్నామని, ముద్ర, ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) కింద రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల రుణాలను అందించేలా ప్రణాళికలు రూపొందించామని, ఇందుకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు.

కృత్తివెన్ను మండలంలోని చినగొల్లపాలెం గ్రామంలో ఆసుపత్రి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా మండల కేంద్రాలలోని ఆసుపత్రుల్లో అవసరమైన వైద్య పరికరాలను గుర్తించి నివేదిక సమర్పించాలని, అందుబాటులోని నిధుల నుంచి వాటిని సమకూరుస్తామన్నారు.

అవనిగడ్డ నియోజకవర్గంలోని బరింకల గ్రామం వద్ద సముద్రపు పోటు నీరు పొలాల్లోకి చేరి చౌడు భూములుగా మారుతున్నాయని, ఈ సమస్యను పరిష్కరించేందుకు నాబార్డు బ్యాంకు వద్ద ఉన్న క్లైమేట్ చేంజ్ నిధులను వినియోగించుకునేందుకు అవకాశం ఉందని, వ్యవసాయ శాస్త్రవేత్తలు, బ్యాంక్ అధికారులు సమన్వయంతో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే నిధులను సక్రమంగా సద్వినియోగం చేసేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, జల జీవన్ మిషన్ పథకం ద్వారా వచ్చే నిధుల సద్వినియోగంపై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో గోల్డ్ కవరింగ్, కలంకారి, ఆటోనగర్, మత్స్య సంపద ఆధారంగా పరిశ్రమలు అభివృద్ధి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో 300 ఎకరాల్లో ఎంఎస్ఎమ్ఈ పార్కు నిర్మాణం, 6వేల ఎకరాల్లో ప్రధాన పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, దీనికి బ్యాంకులు సహకారం అందించాలని మంత్రి కోరారు.

కార్యక్రమ ప్రారంభంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు ఏ విధంగా జరుగుతుంది, పథకాల అమలులో లోటుపాట్లను సరి సరిచేసుకుని పరిష్కరించుకోవడం, సక్రమమైన నిర్ణయాలతో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసే ఉద్దేశంతో ప్రభుత్వం బందరు పార్లమెంట్ సభ్యుల ఆధ్వర్యంలో దిశ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్ఆర్ఈజీఎస్, సామాజిక భద్రతా పథకాలు, జల్జీవన్ మిషన్, గృహ నిర్మాణం తదితర పథకాల పురోగతిపై చర్చించి అవసరమైన చర్యలు తీసుకోవడం ఈ సమావేశంలోని ముఖ్య ఉద్దేశం అన్నారు.

కార్యక్రమంలో తొలుత జెడ్పి సీఈవో కన్నామనాయుడు దిశ కమిటీలోని నామినేటెడ్ సభ్యులను ప్రకటించారు. తోట్లవల్లూరు మండలం నుంచి పిరటి సుజాత, మోపిదేవి మండలం అరజ సంధ్యారాణి, నందివాడ మండలం సింగాల రాధాకృష్ణ, పెనమలూరు మండలం లింగాల భాస్కరరావు, బాపులపాడు మండలం కసుకుర్తి రంగమణి, మచిలీపట్నం మండలం (శారదా నగర్) ఉడుముల బుజ్జి, నాగాయలంక మండలం నక్క విజయబాబు, మచిలీపట్నం మండలం (ఈడేపల్లి) మహమ్మద్ షాహీన, కృత్తివెన్ను మండలం నుంచి తిరుమణి బలరాం సభ్యులను ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో గుడివాడ మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వర్ రావు, ఇండియన్ బ్యాంక్ సీజీఎం సుజయ్ మల్లిక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జిఎం శైలేష్ కుమార్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ జిఎం దీపక్ కుమార్ శ్రీవాస్తవ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం సీతారామారావు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ డీజీఎం అమిత్ కుమార్ శుక్ల, యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ డీజీఎం శ్రీకాంత్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం పి సతీష్, నాబార్డ్ బ్యాంక్ జిఎం డాక్టర్ కె వి ఎస్ ప్రసాద్, కూటమి నాయకులు బండి రామకృష్ణ, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, పలువురు జడ్పిటిసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *