-మంత్రి ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పోలవరం ప్రభుత్వాసుపత్రిలో గర్భిణి తామ శిరీష (25) మృతిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి, తగు చర్యలు తీసుకోవాలని వైద్య,ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఎ.సిరిని ఆదేశించారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది, జరిగిన సంఘటనపై ఆరా తీసిన సెకండరీ హెల్త్ డైరెక్టర్ ఏలూరు డిసిహెచ్‌యస్‌తో మాట్లాడారు. పోలవరం సామాజికి ఆరోగ్య కేంద్రం (సిహెచ్‌సి)లో బుధవారం తెల్లవారు జామున గర్భిణి మృతి విషయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ మరియు ప్రసూతి వైద్య నిపుణులు సకాలంలో స్పందించి వైద్యం అందించలేదని ప్రాథమిక విచారణలో తేలిందని ఏలూరు జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయాధికారి(డిసిహెచ్‌యస్) ఉన్నతాధికారులకు తెలిపారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించామని, వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలితే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రాథమిక నివేదికను ఏలూరు జిల్లా కలెక్టర్ మరియు సెకండరీ హెల్త్ డైరెక్టర్ కు పంపామని నేడొక ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News