-యోగా ఔన్నత్యాన్ని చాటిచెప్పేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి
-అధికారులతో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనుందని.. నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు.
యోగాంధ్రపై కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే యోగా ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో యోగా సంబంధిత కార్యక్రమాలను నిర్వహించాలని, ఉద్యోగులు, సిబ్బంది కూడా కొంత సమయం పాటు యోగా సాధన చేయాలన్నారు. పాఠశాల, కళాశాల విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వం వంటి పోటీలు నిర్వహించాలని సూచించారు. బాపూ మ్యూజియం, కొండపల్లి ఖిల్లా, గాంధీ హిల్ వంటి చారిత్రక, పర్యాటక ప్రాంతాల్లోనూ యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, మునిసిపల్, వైద్య ఆరోగ్యం.. ఇలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి యోగాంధ్రను విజయవంతం చేసేందుకు కృషిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
టెలీ కాన్ఫరెన్స్‌లో విజయవాడ నగరపాలక సంస్థ మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, ఆర్‌డీవోలు కావూరి చైతన్య, కె.బాలకృష్ణ, కె.మాధురి, వివిధ శాఖల జిల్లాస్థాయి, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News