– 10,381 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు 25 కేంద్రాల్లో ఏర్పాట్లు
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఈ నెల 25న దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించనున్న నేపథ్యంలో పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
బుధవారం కలెక్టర్ లక్ష్మీశ.. కలెక్టరేట్‌లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. అత్యంత ప్రతిష్టాత్మక సివిల్స్ ప్రిలిమ్స్‌ను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై మార్గనిర్దేశనం చేశారు. జిల్లాలో 25 కేంద్రాల్లో 10,381 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేయాలని.. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభ్యర్థులు పరీక్ష రాసేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. ఈ నెల 25న ఆదివారం ఉదయం 9.30 గం. నుంచి 11.30 గం. వరకు మధ్యాహ్నం 2.30 గం. నుంచి 4.30 గం. వరకు రెండు సెషన్లలో పరీక్ష జరగనుందన్నారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి లోకల్ ఇన్‌స్పెక్టింగ్ కమ్ లైజన్ ఆఫీసర్, రూట్ అధికారులు, సూపర్‌వైజర్లు, స్ట్రాంగ్ రూమ్ భద్రతా సిబ్బంది తదితరులను నియమించినట్లు వెల్లడించారు. రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్యం, విద్యుత్, ఏపీఎస్ఆర్‌టీసీ, మునిసిపల్ తదితర శాఖల అధికారుల సమన్వయంతో పరీక్షను విజయవంతంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
సమావేశంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య, నందిగామ ఆర్‌డీవో కె.బాలకృష్ణ, తిరువూరు ఆర్‌డీవో కె.మాధురి, కలెక్టరేట్ కోఆర్డినేషన్ విభాగం సూపరింటెండెంట్ సలీమ్, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, లైజనింగ్ అధికారులు, సహాయ లైజనింగ్ అధికారులు, వెన్యూ సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News