మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసిందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) స్పష్టం చేశారు.
సోమవారం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన కలుసుకొని వారితో ముఖాముఖిగా మాట్లాడారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే పరిష్కారం చూపించారు.
తొలుత పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మొక్కజొన్న రైతులు కొందరు మంత్రి పేర్ని నానిను కలిసి రైతు భరోసా కేంద్రాల ద్వారా కానీ , కో- ఆపరేటివ్ సొసైటీ ల ద్వారా తమ మొక్కజొన్న ఉత్పత్తిని కొనుగోలు చేయించాలని వాటిని కోళ్ల మేతలు తయారుచేసే వ్యాపారులకు అమ్మాలని తెలిపారు. ఈ విషయమై స్పందించిన మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, వ్యాపారస్తులతో పోటీగా ఆర్ బీ కె అమ్మగలిగే పరిస్థితులు ఏమాత్రం ఉన్నాయో చెప్పాలని అన్నారు. లాభాల బాటలో పయనిస్తున్న సొసైటీలు జిల్లాలో చాలా తక్కువని వారికి వివరించారు. గత ప్రభుత్వ హయాంలో జూన్ 2014 నుంచి మే 2019 వరకూ ఏనాడూ సక్రమంగా ధాన్యాన్ని కొనుగోలు చేసిన దాఖలాలు లేవని చెబుతూ,అరకొర కొనుగోళ్లకూ చెల్లింపులు చేయకుండా మూడు నుంచి ఆర్నెళ్ల పాటు జాప్యం చేసిందని గుర్తు చేశారు. దీంతో దళారులు, మిల్లర్లు తక్కువ ధరకే ధాన్యాన్ని సేకరించి రైతుల శ్రమను దోపిడీ చేశారని చెప్పారు. 2018–19 రబీలో కొనుగోలు చేసిన 27.52 లక్షల టన్నుల ధాన్యానికి చెల్లించాల్సిన రూ.4,838.03 కోట్లను నాటి ముఖ్యమంత్రి ‘పసుపు–కుంకుమ’ పథకానికి మళ్లించి రైతులను ముంచేశారని . ఆ బకాయిలు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక చెల్లించారన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రబీ, ఖరీఫ్తో కలిపి రూ.37,698.77 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేయగా ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రెండేళ్లలోనే రూ.35,371.09 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనడం రైతులు గమనించాలని అన్నారు. రైతులకు సకాలంలో రూ.32,009.45 కోట్లను చెల్లించి మిగతా రూ.3,361.64 కోట్లను కూడా చెల్లించేరన్నారు
తాము ఐదు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల పరిధిలో 104 అంబులెన్సులలో గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నమని , యు పి హెచ్ సి లలో ఏ ఎన్ ఎం లు ,స్వీపర్లు అవసరం లేదని కేవలం స్టాఫ్ మాత్రమే అవసరమని చెప్పి తమను ఇటీవల విధుల నుంచి తొలగించారని కె.యామిని, డి. అపర్ణ, కె. సునీత లు మంత్రి వద్ద తమ సమస్యను చెప్పుకొన్నారు.
తనకు కీళ్ళవాతం సోకిందని , కాళ్ళు చేతులు బలహీనంగా మారి మామూలు పనులు సైతం చేసుకోలేని అనారోగ్యం ఏర్పడిందని, ఏదైనా పని చేసుకొందామన్నా పట్టు ఇవ్వడం లేదని మంత్రి ఎదుట బాధపడింది. ఆటో నడిపే భర్త తన భర్త ఆ పని వదిలి, ఇద్దరు పిల్లల ఆలనా పాలన చూసుకొంటున్నడని , వంట సైతం ఆయనే చేస్తున్నారని వాపోయింది. అటు ఆరోగ్యపరంగా మందులు కొంటూ , మరోవైపు ఎన్నో ఆర్ధిక బాధలు పడుతున్నట్లు చెబుతూ, తనకు ఏదైనా పింఛను వచ్చేలా సహాయం చేయాలనీ దేశాయిపేట అంబెడ్కర్ విగ్రహం సమీపంలో నివసించే ఘంటసాల పావని అభ్యర్ధించింది.
ఇనగుదురుపేటకు చెందిన అజీమున్నీసా అనే మహిళ తనకు వితంతు పింఛను ఆగిపోయిందని ఏ కారణం చేతనో ఆ డబ్బులు రావడం లేదని తిరిగి ఆ పింఛను తిరిగి అందేలా సహాయం చేయాలని మంత్రిని వేడుకొంది.
స్థానిక ఒగీసుపేటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కొల్లూరు ఆదిశేషయ్య మంత్రిని కలిసి తన కష్టాన్ని చెప్పుకొన్నారు. గతకొంతకాలంగా తన బాగోలేదని ఉద్యోగ విరమణ కాలం సమీపంలో ఉందని తనకు ఏదైనా డిపోలో విధులు నిర్వహించే డ్యూటీ వేయించాలని మంత్రిని ఆయన కోరారు.
మచిలీపట్నం మండలం మేకావాని పాలెంకు చెందిన కోసూరి రవికుమార్ మంత్రి వద్ద తన ఆరోగ్య సమస్యను చెప్పుకొన్నారు. తనకు కడుపులో ఒక గడ్డ ఉందని నిమ్స్ లో ఇందుకు సంబంధించి శస్త్రచికిత్స చేయాలనీ సుమారు 6 లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు చెబుతున్నట్లు ఆయన వివరించారు.
Prajavartha Online Telugu News