గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో వార్డ్ల వారీగా ప్రారంభించి, అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నవభారత్ నగర్, ఎస్వీఎన్ కాలనీ, గోరంట్ల, మేరీ ప్రియ నగర్, కాకాని రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పార్క్ ల అభివృద్ధి, సిసి రోడ్లు, డ్రైన్ల వంటి పలు అభివృద్ధి పనులకు సంబందించి టెండర్ ద్వారా కాంట్రాక్టు లు దక్కించుకొని, ఆయా పనులను కొంత మేర చేసి, అసంపూర్తిగా వదిలివేస్తున్నారని, దీనివలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తమ దృష్టికి తెస్తున్నారన్నారు. అసంపూర్తి పనులు చేసిన కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి, తదుపరి చర్యలు తీసుకోవడంలో ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసి, వార్డ్ ల వారీగా అసంపూర్తిగా చేపట్టిన పనులు, ఆయా కాంట్రాక్టర్లపై తీసుకున్న చర్యలతో కూడిన సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఎస్వీఎన్ కాలనీ పార్క్ లో పెండింగ్ పనులను పూర్తీ చేయాలని, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్ మరమత్తు చేపట్టి, ఫాగింగ్ చేపట్టాలన్నారు. మేరి ప్రియ నగర్ లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో జాప్యంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని, సదరు నగర్ లో పనుల పురోగతిపై ఈఈ నివేదిక ఇవ్వాలన్నారు. జిఎంసి పరిధిలో రోడ్ల మీద ఏర్పడిన గోతుల మరమత్తులకు కేటాయించిన పాట్ హోల్స్ మెషిన్ పనితీరు సక్రమంగా లేదని, ఇప్పటి వరకు మెషిన్ ద్వారా చేపట్టిన పనుల వివరాలను అందించాలని ఆదేశించారు.
పర్యటనలోన కార్పొరేటర్ వి.శ్రీరాం ప్రసాద్, డిఈఈలు కళ్యాణరావు, వెంకటరమణ, ఇంజినీరింగ్, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News