– రాజీమార్గమే రాజమార్గం
– జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డిసెంబర్ 13వ తేదీన నిర్వహిస్తున్న నాలుగవ జాతీయ లోక్ అదాలత్‌లో న్యాయసేవలు అందించేందుకు మొత్తం 46 బెంచీలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత తెలిపారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA) కార్యదర్శి శ్రీమతి ఎన్. శ్రీలక్ష్మి తదితర న్యాయమూర్తులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, న్యాయం కోరుకునే ప్రతి ఒక్కరూ రాజీమార్గం వైపు మళ్లే విధంగా అవగాహన కలిగి ఉండాలని, రాజీ ద్వారా వేగవంతమైన, తక్కువ ఖర్చుతో న్యాయం లభిస్తుందని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ సంవత్సరానికి చివరి నాలుగవ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ లోక్ అదాలత్‌లో రాజీపడ్డదగ్గ సివిల్, క్రిమినల్, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్ కేసులు, రోడ్డు ప్రమాద పరిహార కేసులు, బ్యాంకు కేసులు, ప్రీ–లిటిగేషన్ కేసులు తదితరాలను పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. వాహన ప్రమాద పరిహార కేసుల్లో చట్టబద్ధత ఉన్నపుడు, రెండు పక్షాలు అడ్వకేట్ల సమక్షంలో ముందుకు వస్తే సానుకూలంగా పరిష్కార చర్యలు చేపడతామని తెలిపారు. ఈ సంవత్సరంలో నిర్వహించిన గత మూడు జాతీయ లోక్ అదాలత్‌లలో మొత్తం 10,700 కేసులు పరిష్కరించబడగా, రూ.100,99,11,504/- (అక్షరాల వంద కోట్ల తొంభై తొమ్మిది లక్షల పదకొండు వేల ఐదు వందల నాలుగు రూపాయలు) నష్టపరిహారం లబ్ధిదారులకు చెల్లించామని తెలిపారు. నాలుగవ జాతీయ లోక్ అదాలత్‌కు సంబంధించి మొత్తం 89 వేల కేసులు ఉండగా, సుమారు 69 వేల కేసులు రాజీ చేసుకునే అవకాశముండగా, ఇప్పటివరకు 18 వేల కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. 2024 సంవత్సరంలో నిర్వహించిన నాలుగు జాతీయ లోక్ అదాలత్‌లలో 2,131 సివిల్ కేసులు, 7,796 రాజీపడ్డదగ్గ క్రిమినల్ కేసులు, 696 ప్రీ–లిటిగేషన్ కేసులు కలిపి మొత్తం 10,623 కేసులు పరిష్కరించబడ్డాయని, వీటి ద్వారా రూ.162,35,24,590/- (అక్షరాల నూట అరవై రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల తొంభై రూపాయలు) మేర పరిహారం చెల్లించబడినట్లు తెలిపారు. డిసెంబర్ 13న నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్‌కు 46 బెంచీలు ఏర్పాటు చేసినట్లు, గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు ట్రాఫిక్ చలానా కేసులు, అలాగే ఎక్సైజ్ విభాగానికి చెందిన డ్యూటీ పేయిడ్, నాన్–డ్యూటీ పేయిడ్ కేసులను కూడా రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌కు 18,035 కేసులను రాజీ పరిష్కారానికి గుర్తించడం జరిగిందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ పర్యవేక్షణలో ప్రతి మూడు నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్‌లు నిర్వహించబడుతున్నాయని, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడం, ప్రజలకు తక్కువ ఖర్చుతో న్యాయం అందించడం, రాజీ ద్వారా చట్టపరమైన వివాదాలకు ముగింపు పలకడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రాజీతో పరిష్కారమైన కేసులకు కోర్టు ఫీజు రీఫండ్ లభించడమే కాకుండా, ఆ తీర్పులు తుది తీర్పులుగా పరిగణించబడడం వల్ల ప్రజలకు విస్తృత ప్రయోజనం కలుగుతుందని వివరించారు.
నేడు అవార్డులు జారీ చేసిన కొన్ని కేసులు:
జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో 13.12.2025న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో వాహన ప్రమాద పరిహారానికి సంబంధించిన రాజీ ద్వారా పరిష్కరించిన కొన్ని కేసులు: ఇందులో PDJ కోర్టులో కేసు నం.56/2025కు సంబంధించి రూ.42 లక్షల పరిహారాన్ని SBI జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించేందుకు అంగీకరించగా, పిటిషనర్ తరఫున న్యాయవాది జి. వెంకటేష్, ఇన్సూరెన్స్ స్టాండింగ్ కౌన్సెల్‌గా యు.వి.ఎస్.పి. అవదాని హాజరయ్యారు. అలాగే VIII అదనపు జిల్లా న్యాయమూర్తి కోర్టులో కేసు నం.58/2025కు సంబంధించి రూ.32 లక్షల పరిహారాన్ని చోళమండల్ ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించేందుకు ఒప్పుకోగా, ఈ కేసులో పిటిషనర్ న్యాయవాదిగా జి. వెంకటేష్, ఇన్సూరెన్స్ స్టాండింగ్ కౌన్సెల్‌గా పి.ఎల్.ఎన్. ప్రసాద్ వ్యవహరించారు. అదే విధంగా V అదనపు జిల్లా న్యాయమూర్తి కోర్టులో కేసు నం.180/2020లో ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ రూ.26 లక్షల పరిహారం చెల్లించేందుకు అంగీకరించగా, పిటిషనర్ తరఫున న్యాయవాది కె.వి.వి.ఎస్. రాంప్రసాద్, ఇన్సూరెన్స్ స్టాండింగ్ కౌన్సెల్‌గా సిహెచ్.వి. ప్రసాద్ హాజరై కేసు పరిష్కారానికి సహకరించారు. ఈ కార్యక్రమంలో 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీమతి ఎం. మాధురి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి . శ్రీలక్ష్మి, విధులు నిర్వహిస్తున్న ఇతర న్యాయమూర్తులు, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శోభనాద్రి శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News