మహిళ సంక్షేమంలో ఏపీ దేశానికే రోల్ మోడల్… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

-కష్టకాలంలోనూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్సార్ ఆసరా వారోత్సవాలు ఆరో రోజు పండుగ వాతావరణంలో కొన‌సాగాయి. అజిత్ సింగ్ నగర్లోని షాదీఖానాలో 58, 59, 60 డివిజన్ లకు సంబంధించి జ‌రిగిన సంబరాలలో ఎమ్మెల్సీ కరీమున్నిసా, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి చిత్రపటానికి పూల‌మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి  చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలియజేశారు. రెండో విడత నగదు చెక్కుల పంపిణీ సందర్భంగా లబ్ధిదారులతో  శాసనసభ్యులు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మ‌ల్లాది విష్ణు మాట్లాడుతూ.. ప్రజా విశ్వాసం పూర్తిగా కోల్పోయిన తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారాన్నే ఏకైక అస్త్రంగా చేసుకుని దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పాలనను చూసి ఓర్వలేక కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు రుణమాఫీ పేరిట మహిళలను మోసం చేస్తే.. ఇచ్చిన మాటకు కట్టుబడి జగన్మోహన్ రెడ్డి మహిళలకు అండగా నిలిచారన్నారు. ఎన్నికల నాటికి ఉన్న బకాయిలు నాలుగు విడతల్లో చెల్లిస్తానని హామీ ఇచ్చి, రెండు ఆర్థిక సంవత్సరాలలో రెండు విడతలు పూర్తి చేశారన్నారు. అది చూసి భరించలేక డైవర్ట్‌ పాలిటిక్స్‌ కు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడని మండిపడ్డారు.

ఇది అక్కచెల్లెమ్మల ప్రభుత్వం…
మహిళా సాధికారతకు సీఎం జగనన్న పెద్ద పీట వేసి ఆ దిశగా మహిళలను బలోపేతులను చేసే ఉద్దేశంతో అమ్మ ఒడి, వైఎస్సార్ ఆసరా, చేయూత, దిశా చట్టం వంటి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. పురుషులతో సమానంగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగేందుకు 50 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించి మహిళ పక్షపాతిగా నిలిచారన్నారు. 58 వ డివిజన్ లో రెండో విడత ఆసరాకు సంబంధించి 139 గ్రూపులకుగాను రూ. 1 కోటి 26 లక్షల 70 వేల 88 రూపాయలు డ్వాక్రా మహిళల ఖాతాలలో జమ చేశామన్నారు. 59 వ డివిజన్ లో రెండో విడత ఆసరాకు సంబంధించి 269 గ్రూపులకు గాను రూ. 2 కోట్ల 26 లక్షల 34 వేల 210 రూపాయలు, 60 వ డివిజన్ కు సంబంధించి 191 గ్రూపులకు గానూ రూ. కోటి 59 లక్షల 47 వేల 119 రూపాయలను నేరుగా డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూర్చామన్నారు. నియోజకవర్గ పరిధిలో 30వేల మంది డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఆసరాకి సంబంధించి రెండు విడతలు కలుపుకుని దాదాపు రూ. 60 కోట్లను అందించడం జరిగిందన్నారు. మొత్తంగా నాలుగు విడతలలో రూ. 120 కోట్ల రూపాయలు ఆసరా ద్వారా నియోజకవర్గ మహిళలకు లబ్ధి చేకూరనున్నట్లు వెల్లడించారు. అందుకే ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకున్నారని పేర్కొన్నారు. వరుస ఎన్నికల్లో వస్తున్న ఫలితాలే ఇందుకు నిదర్శనమని మల్లాది విష్ణు అన్నారు.

పేదరిక నిర్మూలన దిశగా అడుగులు…
మరోవైపు 58 వ డివిజన్ లో లలిత దేవి స్వయం సహాయక సంఘానికి అత్యధికంగా రూ. 7 లక్షల 84 వేలు., 59 డివిజన్ లో కనకదుర్గ స్వయం సహాయక సంఘానికి రూ. 7 లక్షల 50 వేలు., 60 వ డివిజన్ కు సంబంధించి సర్వేశ్వర స్వయం సహాయక సంఘానికి రూ. 8 లక్షల నగదును రెండో విడత ఆసరా సాయంగా అందించడం జరిగిందన్నారు. ఈ పెట్టుబడిని రెట్టింపు చేసే విధంగా డ్వాక్రా సంఘాల మహిళలు జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచుకోవాలన్నారు. పేదరిక నిర్మూలన దిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన నవశకం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

పారదర్శకంగా సంక్షేమ పథకాల అమలు…
ఒక్క రూపాయి అవినీతి లేకుండా, ఎవరి సిఫార్సులు, మధ్యవర్తులతో పనిలేకుండా మహిళల ఖాతాల్లోనే నేరుగా సంక్షేమ పథకాల నగదును సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జమ చేస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మహిళలకు చేస్తున్న మేలు చూసి ఓర్వలేక ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు కోర్టుకు వెళ్తున్నారన్నారు. తెలుగుదేశం హయాంలో 40 గజాల ఇళ్ల స్థలాలను అది కూడా అరకొరగా ఇచ్చిన చంద్రబాబు.. 30 లక్షల మంది పేదలకు జగనన్న ఇస్తున్న సెంటు భూమి ఇళ్ల పట్టాలపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. మరోవైపు అమ్మఒడి సాయాన్ని ప్రతిఒక్క విద్యార్థి సద్వినియోగపర్చుకోవాలనే ఉద్దేశంతో.. 70 శాతం హాజరు ఉండాలని చెబితే దానిని కూడా విమర్శించడం సిగ్గుచేటన్నారు.

చంద్రబాబు దుబారా ఖర్చులకు లెక్క చెప్పగలరా..?
రాష్ట్ర ప్రభుత్వం చేసిన రూ. లక్షా 50 వేల కోట్ల అప్పులో.. రూ. లక్షా 40 వేల కోట్లు నేరుగా నగదు బదిలీ ద్వారా లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయడం జరిగిందని మల్లాది విష్ణు గారు అన్నారు. అంతేగానీ తెలుగుదేశం మాదిరిగా చేసిన అప్పులకు లెక్కలు చెప్పుకోలేని దుస్థితిలో తమ ప్రభుత్వం లేదన్నారు. సింగపూర్, దావోస్, జపాన్ వంటి విదేశీ పర్యటనకు, పోలవరం సందర్శనలకు ఇష్టానుసారంగా రూ. వందల కోట్లను దుబారా తాము చేయలేదన్నారు. చివరకు హెరిటేజ్ నీటి కొనుగోళ్లకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం రూ. 16 కోట్ల నిధులను ఖర్చు చేసిందని గుర్తు చేశారు.

దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత ఉన్నప్పటికీ ఎక్కడా విద్యుత్ సంక్షోభం ఉండకూడదనే ఉద్దేశంతో రూ. 900 కోట్ల నిధులను విద్యుత్ కొనుగోలుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. కానీ పవర్ కట్ లంటూ ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రజలను లేనిపోని భయందోళనలకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో చూసుకుంటే ఏ ఒక్క రోజు కూడా ఎక్కడా విద్యుత్ కోతలనేవి లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరుగుతోందన్నారు. కాబట్టి ప్రతిపక్ష పార్టీల నేతలు దివాళకోరు ఆలోచనలను విడనాడాలని సూచించారు. రాష్ట్ర చరిత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ప్రజల ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు.

వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ షాహినా సుల్తానా మాట్లాడుతూ కరోనా కష్టకాలంలోనూ పాదయాత్ర హామీలను సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా మహిళ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో తాను కూడా భాగస్వామ్యం అయినందుకు గర్విస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ఉమ్మడి రమాదేవి, అలంపూర్ విజయలక్ష్మి, ఇసరపు దేవి, కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, అలీం, వైఎస్సార్ సీపీ నాయకులు బెవర నారాయణ, అధికారులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *