-రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం – KDCC చైర్మన్ నెట్టేం రఘురామ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కోనయాపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో రైతుల అభివృద్ధి, వ్యవసాయ బలోపేతానికి ప్రాధాన్యం ఇస్తూ రూ.1 కోటి 30 లక్షల రుణ పంపిణీ చెక్కులను ఉమ్మడి కృష్ణా జిల్లా KDCC చైర్మన్ నెట్టేం రఘురామ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం రైతుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రాధాన్యాన్ని ఈ కార్యక్రమం స్పష్టంగా ప్రతిబింబించింది. పంటల సాగు, ఎరువులు, విత్తనాలు మరియు ఇతర వ్యవసాయ అవసరాల కోసం ఈ రుణాలు ఉపయోగపడతాయని నాయకులు తెలిపారు.
KDCC చైర్మన్ నెట్టేం రఘురామ్ మాట్లాడుతూ సహకార రంగం రైతులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. తక్కువ వడ్డీపై రుణాలు అందించడం ద్వారా రైతుల ఆర్థిక భారం తగ్గుతుందని, సహకార సంఘాల సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ రైతే దేశానికి వెన్నెముక అని, రైతు అభ్యున్నతే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, ప్రతి రైతు కుటుంబానికి అభివృద్ధి ఫలాలు చేరేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రైతులకు సకాలంలో రుణాలు అందించడం ద్వారా వారి భారం తగ్గించి, వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రుణ చెక్కులు అందుకున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ, సమయానికి అందిన ఈ సహాయం పంటల సాగుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. KDCC చైర్మన్ నెట్టేం రఘురామ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మార్కాపుడి వెంకట్రావమ్మ, ఎంపీటీసీ గుత్తికొండ కల్పన, సహకార సంఘం చైర్మన్ వాసిరెడ్డి ప్రసాద్, లాల్ బహుదూర్ లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కోట వీరబాబు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అమ్మినేని జ్వాలా ప్రసాద్, రైతు నేతలు, కూటమి నాయకులు, స్థానికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News