గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త :
వడ్డీ లేకుండా పన్ను చెల్లించడానికి 8 రోజులే గడువు….కమిషనర్ కె.మయూర్ అశోక్
గుంటూరు నగరపాలక సంస్థకు వడ్డీ లేకుండా పన్ను బకాయిలు చెల్లించడానికి ఈ నెలాఖరువరకే గడువు ఉందని, ఆస్తి, ఖాళీ స్థల, నీటి చార్జీలు కలిపి సోమవారం ఒక్కరోజే రూ.2.45 కోట్లు పన్నుచెల్లించారని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు పన్ను వసూళ్లు వేగవంతంలో భాగంగా డిప్యూటీ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పన్ను బకాయిల చెల్లింపుపై బకాయిదారుల నుండి మంచి స్పందన ఉందని, నూరు శాతం పన్ను వసూళ్ళే లక్ష్యంగా అధికారులు వార్డ్ సచివాలయం వారీగా యాక్షన్ ప్లాన్ మేరకు వెళ్లాలన్నారు. పెద్ద మొత్తంలో బకాయి ఉన్న వారిని డిప్యూటీ కమిషనర్లు నేరుగా కలిసి పన్ను చెల్లించేలా తెలియచేయాలని, స్పందించకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అడ్మిన్ కార్యదర్శులు మార్చి నెల ముగింపుకు 8 రోజులే గడువు ఉన్నందున మరింత యాక్టివ్ గా విధుల్లో ఉండాలని, నిర్లక్ష్యంగా ఉండే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెడ్ నోటీసులు జారీ చేసినా స్పందించని వారి ఆస్తుల జప్తుకు చర్యలు తీసుకోవాలన్నారు. ట్యాక్స్ కలెక్షన్ కేంద్రాలు కూడా ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు పని చేస్తాయని, నగర ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని కోరారు.
Prajavartha Online Telugu News