-ముఖ్యమంత్రి కి ఏఐటియుసి వినతి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని వివిధ రంగాలలో కాంట్రాక్ట్ కార్మికులుగా ఆప్కాస్ సంస్థలో పనిచేస్తున్న వారికి కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం పథకం వర్తింపజేయాలని విజయవాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బుద్దె రాజా ముఖ్యమంత్రి గారికి పత్రికాముఖంగా విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఉదయం స్టేట్ గెస్ట్ హౌస్ వద్ద 23వ డివిజన్ పారిశుధ్య కార్మికులతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆప్కాస్ కార్మికులందరికీ కూడా అమ్మ ఒడి పథకం అందించింది అని, కానీ నేటి కూటమి ప్రభుత్వం గత సంవత్సరం ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం అమలుపరచలేకపోయిందని అన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖ మంత్రి గారికి విన్నవించగా అప్కాస్ కార్మికులకు కూడా తల్లికి వందనం అమలు పరచాలని జీవో ఇచ్చారు కానీ పదివేల రూపాయల లోపు జీతం తీసుకుంటున్న వారికి మాత్రమే వర్తింపచేయాలని మెలిక పెట్టారు అన్నారు. కనీస వేతనం 26 వేల రూపాయలకు తగ్గకుండా కార్మికులకు జీతాలు చెల్లించాలని సుప్రీంకోర్టు పేర్కొంటే ఇప్పటివరకు కనీస వేతనం అమలు చేయకపోగా కార్మికులకు రావలసిన ప్రభుత్వ పథకాలను కూడా దూరం చేయటం దుర్మార్గమని అన్నారు. ఇప్పటికైనా ఈ సంవత్సరం అమలు కాబోతున్న తల్లికి వందనం పథకం ఆప్కాస్ కార్మికులందరికీ కూడా వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షులు ఎస్వీఎస్ చలం అధ్యక్షత వహించారు.
Prajavartha Online Telugu News