-బీఎల్ఏ శిక్షణ సమావేశాన్ని వ్యక్తిగత దూషణల వేదికగా మార్చడం దురదృష్టకరం: యార్లగడ్డ
-నేను దివాళా తీశానంటున్న నువ్వు.. నేను ఇచ్చిన డబ్బులు ఎప్పుడు తిరిగి ఇస్తావో చెప్పు: యార్లగడ్డ
-మంత్రి పదవి వచ్చిన రోజు నా భవనంలో విజయసాయి రెడ్డి ఫోన్ కోసం వేచి చూసింది నిజం కాదా?: యార్లగడ్డ
-డబ్బుల పెట్టెల ఆరోపణలు పచ్చి అబద్ధాలు.. నిజాలు తెలుసుకోవాలంటే జగన్‌ను అడిగి తెలుసుకో : యార్లగడ్డ
-గన్నవరానికి నువ్వేం చేశావో చెప్పు.. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం: యార్లగడ్డ
-కేడీసీసీ బ్యాంకును రూ.115 కోట్ల లాభాల్లోకి తీసుకొచ్చా: యార్లగడ్డ వెంకట్రావు
-గన్నవరంలో మట్టి దందా చేయలేదు.. రైతులకు, పేదలకు ఉచితంగా మట్టి ఇచ్చా: యార్లగడ్డ
-‘లంబు, జంబు, చెంబు’ భాష మానుకుని పార్లమెంటరీ భాషలో మాట్లాడు : యార్లగడ్డ
-కృష్ణా జిల్లా గౌరవాన్ని దిగజార్చేలా పేర్ని నాని వ్యాఖ్యలు: వీరంకి గురుమూర్తి
-రాజకీయ హుందాతనం మరిచి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు: వీరంకి
-అభివృద్ధి, ప్రజా సమస్యలపై మాట్లాడలేక వ్యక్తిగత విమర్శలకు పరిమితం: చలమలశెట్టి రమేష్
-యార్లగడ్డ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే పేర్ని నాని విమర్శలు: రమేష్
-రాజకీయాల్లో సంస్కారం, హుందాతనం పాటించాలని పేర్ని నానికి హితవు: కూటమి నేతలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని తనపై చేస్తున్న వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం విజయవాడలోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మచిలీపట్నంలో బూత్ లెవల్ ఏజెంట్లకు (బీఎల్ఏ) శిక్షణ ఇచ్చేందుకు నిర్వహించిన ఎస్‌ఐఆర్ సమావేశాలను వ్యక్తిగత విమర్శలకు వేదికగా మార్చడం దురదృష్టకరమని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తిచూపడం, పార్టీని బలోపేతం చేయడం, కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జిల్లా అధ్యక్షుడి బాధ్యత అని, అలాంటి వేదికలపై తన గురించి అసత్య ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీఎల్ఏలకు శిక్షణ ఇవ్వాల్సిన సమావేశాల్లో వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల కార్యకర్తలకు ఎలాంటి ప్రయోజనం అని వ్యాఖ్యానించారు. పేర్ని నాని తన రాజకీయ వైఖరిని తరచూ మార్చుకుంటూ ఉంటారని యార్లగడ్డ విమర్శించారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై తీవ్ర విమర్శలు చేసి, తరువాత వారినే పొగిడిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్‌పై కూడా అనవసర విమర్శలు చేయడం సరికాదన్నారు. తాను దివాళా తీశానంటూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, ఎనిమిదేళ్ల క్రితం పేర్ని నానికే తాను అప్పు ఇచ్చానని యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ఆ డబ్బులు ఎప్పుడు తిరిగి ఇస్తారో ప్రజల ముందే చెప్పాలని డిమాండ్ చేశారు. డబ్బుల పెట్టెల ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, తాను ఎవరి వద్ద నుంచి చందాలు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఆ విషయంపై నిజాలు తెలుసుకోవాలంటే జగన్ మోహన్ రెడ్డినే అడగాలని సూచించారు. అభివృద్ధి అంశాలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని, పేర్ని నాని మంత్రిగా ఉన్న సమయంలో గన్నవరం నియోజకవర్గానికి అదనంగా ఏమి చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. తాను కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌గా ఉన్నప్పుడు బ్యాంకును రూ.115 కోట్ల లాభాల్లోకి తీసుకువచ్చానని, ‘రైతు నేస్తం’ వంటి పథకాలను అమలు చేశానని గుర్తు చేశారు. గన్నవరంలో తాను ఎలాంటి మట్టి దందా చేయలేదని, రైతులు, పేదలకు ఉచితంగా మట్టి అందించానని స్పష్టం చేశారు. గతంలో పేర్ని నానికి మంత్రి పదవి వచ్చిన సమయంలో విజయసాయి రెడ్డి ఫోన్ కోసం తన భవనంలోనే రాత్రి 11:30 గంటల వరకు వేచి చూసిన విషయాన్ని యార్లగడ్డ గుర్తు చేశారు. కొడాలి నాని ద్వారానే తమకు పరిచయం ఏర్పడిందని, గత అనుబంధాలను మరిచి ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. అలాగే వంగవీటి రాధాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇవ్వాలని జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో తానే గట్టిగా వాదించానని, ఈ విషయాన్ని వంగవీటి రాధానే ధృవీకరించగలరని చెప్పారు. రాధాకు స్నేహితుడినని చెప్పుకునే పేర్ని నాని ఆ సమయంలో ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసుల కారణంగా గత 19 నెలలుగా అమెరికా వెళ్లలేకపోయానని, ప్రస్తుతం కోర్టు అనుమతితో వ్యక్తిగత పనుల నిమిత్తం పది రోజుల పాటు అమెరికా పర్యటనకు వెళ్తున్నట్లు తెలిపారు. తాను లేని సమయంలో అసత్య ప్రచారాలు చేయవద్దని, తిరిగి వచ్చిన తర్వాత ఏ అంశంపైనైనా, ఏ వేదికలోనైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. రాజకీయాల్లో పరుష పదజాలానికి తావు ఉండకూడదని, “లంబు, జంబు, చెంబు” వంటి పదజాలాన్ని ఉపయోగించడం మానుకుని ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై పార్లమెంటరీ భాషలో చర్చించాలని పేర్ని నానికి సూచించారు. గన్నవరం నియోజకవర్గంలో 13 నెలల పాటు పాదయాత్ర చేసి ప్రతి గ్రామం, ప్రతి గడపకు వెళ్లానని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు.
కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి మాట్లాడుతూ, కృష్ణా జిల్లా అనేక మంది మహానుభావులు జన్మించిన గడ్డ అని, పుచ్చలపల్లి సుందరయ్య, నందమూరి తారక రామారావు వంటి ఎంతో మంది మహనీయులు ఈ జిల్లాకు, రాష్ట్రానికి గౌరవం తీసుకొచ్చారని అన్నారు. అలాంటి చరిత్ర కలిగిన జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న పేర్ని నాని హుందాతనం మరిచి అనుచిత భాషలో మాట్లాడటం బాధాకరమని విమర్శించారు. రాజకీయాల్లోకి వచ్చే యువతకు ఇలాంటి వ్యాఖ్యల ద్వారా ఎలాంటి సందేశం ఇస్తున్నారో ఆలోచించుకోవాలని హితవు పలికారు. గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల గురించి మాట్లాడే నైతిక హక్కు పేర్ని నానికి లేదని అన్నారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చేసిన వ్యాఖ్యలకు రాజకీయంగా సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం పేర్ని నాని స్థాయిని తెలియజేస్తోందని విమర్శించారు. డీఎస్సీ నియామకాల విషయంలో కూడా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేసిందని తెలిపారు.
గన్నవరం నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి చలమలశెట్టి రమేష్ మాట్లాడుతూ, పేర్ని నాని వ్యాఖ్యలు రాజకీయ హుందాతనానికి విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం, ప్రజా సమస్యలపై చర్చించకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం సరైన రాజకీయ విధానం కాదన్నారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని, అలాంటి నాయకుడిపై ఆధారరహిత ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. విమర్శలు చేయాలంటే అభివృద్ధి, పాలన, ప్రజా సమస్యలపై చేయాలని, వ్యక్తిగత విమర్శలు, పరుష పదజాలం మానుకుని హుందాగా రాజకీయాలు చేయాలని పేర్ని నానికి సూచించారు.
Prajavartha Online Telugu News