గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్నిసమర్థవంతంగా అమలు చేయడానికి పటిష్టమైన ప్రణాళిక సిద్దం చేశామని, నగర ప్రజలు, వ్యాపార వాణిజ్య సంస్థలు ప్రజారోగ్యానికి భంగం కల్గించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదంకు సహకరించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ కోరారు. ఆగస్ట్ 15 నుండి గుంటూరు నగరంలో అమలు చేయనున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదం పై అవగాహన కల్గించడానికి, శాఖలు, అధికారుల మధ్య సమన్వయం కోసం టాస్క్ ఫోర్స్ కమిటి, ప్రత్యక్ష్య తనిఖీ, అపరాధ రుసుం విధించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తూ కమిషనర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా గుంటూరు నగరంలో నిషేధిత ప్లాస్టిక్ నియంత్రణ, శాఖల మధ్య సమన్వయం మరియు నిరంతర పర్యవేక్షణ కోసం నగర స్థాయిలో ఒక పటిష్టమైన ‘టాస్క్ ఫోర్స్ కమిటీ’ని ఏర్పాటు చేసామన్నారు. ఈ కమిటీలో అదనపు కమిషనర్, ముగ్గురు డిప్యూటీ కమిషనర్లు, సిఎంఓహెచ్, ఎంహెచ్ఓ (కన్వీనర్), శానిటరీ సూపర్‌వైజర్లు సభ్యులుగా వ్యవహరిస్తారని, నగరంలో ప్లాస్టిక్ తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలు మరియు వినియోగాన్ని అరికట్టడానికి ఈ కమిటీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తుందన్నారు.
ఈ నిషేధ ప్రక్రియలో భాగంగా ఆగస్టు 15, 2026 నుండి నగరవ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో విస్తృత తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీ యూనిట్లు, గోడౌన్లు, హోల్‌సేల్ మార్కెట్లు, రిటైల్ దుకాణాలు, వీధి వ్యాపారులు మరియు ఇతర అమ్మకందారుల వద్ద ప్రత్యేక్ష తనిఖీ బృందాలు సోదాలు నిర్వహిస్తాయన్నారు. తనిఖీల సమయంలో నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు గమనిస్తే తక్షణమే ఆ సరుకును జప్తు చేయడమే కాకుండా, ‘స్వచ్చ గుంటూరు యాప్’ మరియు నగరపాలక సంస్థ నిబంధనల ప్రకారం ఉల్లంఘనదారులపై అక్కడికక్కడే భారీ జరిమానాలు విధించడం జరుగుతుందని, పునరావృతంగా నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అలాగే ప్రజల్లో మరియు వ్యాపారుల్లో నిషేధిత ప్లాస్టిక్ పై విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా మంగళవారం అన్ని వార్డుల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, స్వచ్చంద సంస్థలు, మహిళా, యువజన సంఘాలతో ప్రత్యేక అవగాహన సమావేశాలు నిర్వహిస్తామన్నారు. బుధవారం ప్రతి వార్డులో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ తో సమావేశాలు నిర్వహించి, గృహ స్థాయిలో ప్లాస్టిక్ నివారణ, ప్రత్యామ్నాయాల వినియోగం మరియు చెత్తను తడి-పొడి చెత్తగా వేరు చేయడంపై అవగాహన కల్పిస్తామని తెలిపారు.
Prajavartha Online Telugu News