-సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS.,
-విజయవాడ లయోలా క్యాంపస్‌లోని YES-J సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌లో 3 రోజుల KRP శిక్షణా కార్యక్రమం
-రాష్ట్రంలో 1,599 పాఠశాలల్లో నైపుణ్య విద్య అమలు
-వొకేషనల్ ట్రైనర్ల గౌరవ వేతనం 12 నెలలకు పొడిగింపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థి పాఠశాల విద్య పూర్తి చేసి బయటకు వచ్చే సమయానికి కనీసం ఒక వృత్తి నైపుణ్యాన్ని తప్పనిసరిగా నేర్చుకునేలా తీర్చిదిద్దడమే సమగ్ర శిక్ష ప్రధాన లక్ష్యమని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ స్పష్టం చేశారు. సమగ్ర శిక్ష, ఆంధ్రప్రదేశ్ మరియు పుణేకు చెందిన ‘లెండ్ ఎ హ్యాండ్ ఇండియా’ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ లయోలా క్యాంపస్‌లోని YES-J సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌లో నిర్వహిస్తున్న మూడు రోజుల రాష్ట్రస్థాయి ‘కీ రిసోర్స్ పర్సన్స్’ (KRP) శిక్షణా కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీడీ మాట్లాడుతూ, ప్రస్తుత 2026–27 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 1,599 ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు నైపుణ్య విద్యను అందిస్తున్నామని తెలిపారు. జాతీయ విద్యా విధానం (NEP-2020), జాతీయ పాఠ్యాచరణ రూపకల్పన (NCF-SE 2023) మార్గదర్శకాలకు అనుగుణంగా NCERT రూపొందించిన “కౌశల్ బోధ్” పాఠ్యాంశాన్ని 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ప్రీ-వొకేషనల్ విద్యగా సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. నాణ్యమైన శిక్షణ అందిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు.
శిక్షకులకు ప్రభుత్వం అండ
రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఇందులో భాగంగా గతంలో 10 నెలల పాటు మాత్రమే ఉన్న వొకేషనల్ ట్రైనర్లు, వొకేషనల్ కోఆర్డినేటర్ల గౌరవ వేతనాన్ని 12 నెలలకు విస్తరించినట్లు వెల్లడించారు. పాఠశాలల్లో ఆధునిక స్కిల్ ల్యాబ్‌లు, పరికరాలు, పాఠ్యపుస్తకాలు, ప్రీ-వొకేషనల్ కిట్లు వంటి అన్ని వనరులను ప్రభుత్వం సమకూరుస్తోందని వివరించారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో రాష్ట్రంలోని 28 మంది డైట్ (DIET) అధ్యాపకులు, 56 మంది వృత్తి విద్యా శిక్షకులు పాల్గొన్నారు. నిపుణులు వీరికి కౌశల్ బోధ్ బోధనా పద్ధతులు, అనుభవాత్మక అభ్యాసం (Experiential Learning), కార్యాచరణ ఆధారిత బోధన, మూల్యాంకనం మరియు తరగతి గది అమలుపై శిక్షణ అందిస్తున్నారు. కార్యక్రమంలో స్టేట్ జీసీడీవో వి.ఎస్.ఎన్.మూర్తి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News