గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో ఇంటింటి, కమర్షియల్ చెత్త సేకరణ నూరు శాతం జరిగేలా వార్డ్ ల వారీగా పిన్ పాయింట్ ప్రోగ్రాం సిద్దం చేసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో ఈ-ఆటోలు, మెకానికల్ స్వీపింగ్ మెషిన్స్, జిపిఎస్ ట్రాకింగ్, మ్యాపింగ్ పై ప్రజారోగ్య అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ త్వరలో 2 అందుబాటులోకి రానున్న 2 వందల ఈ-ఆటోల ద్వారా నూరు శాతం చెత్త సేకరణ జరిగేలా వార్డ్ లు, సచివాలయాల వారీగా క్షేత్ర స్థాయి ప్లాన్ ఉండాలన్నారు. ప్రతి వాహనంకు కేటాయించిన ప్రాంతాన్ని మ్యాపింగ్ చేసి, జిపిఎస్ ట్రాకర్, ప్రతి ట్రిప్ తూకం రికార్డ్ చేసేలా ఏర్పాటు చేయాలన్నారు. అలాగే నగరపాలక సంస్థలో ఉన్న 10 మెకానికల్ స్వీపింగ్ మెషిన్ల ద్వారా ఎంపిక చేసిన 10 ప్రధాన రహదారులలో షుమారు 241 కిలోమీటర్లు వాయు కాలుష్యం జరగకుండా రాత్రి సమయంలో స్వీపింగ్ చేయాలన్నారు. ఈ-ఆటోలు, స్వీపింగ్ మెషిన్లు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం పని చేసేలా ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని, ప్రజల్లో పారిశుధ్య పనుల పట్ల సంతృప్తి వచ్చేలా పనితీరు మెరుగవ్వాలని స్పష్టం చేశారు.
సమావేశంలో ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, ఎస్ఎస్ లు రాజేష్, ఐజాక్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ అనిల్ కుమార్, ఈ-ఆటోల ఏజన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News