గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు జిల్లాను పచ్చదనంతో నింపే లక్ష్యంతో జిల్లా పరిపాలన చేపట్టిన “గ్రీన్ గుంటూరు” కార్యక్రమంలో స్వచ్ఛంద భాగస్వామిగా సేవలందించేందుకు భారతీయ హిందూ పరిషత్-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ సిద్ధంగా ఉందని రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్ అయినంపూడి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని అధికారులని మర్యాదపూర్వకంగా కలిసి “గ్రీన్ గుంటూరు – బి హెచ్ పి పార్టనర్ షిప్ ప్రపోసల్ “తో పాటు “బి హెచ్ పి గ్రీన్ గుంటూరు యాక్షన్ ప్లాన్”ను సమర్పించారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ అయినంపూడి మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుని బాధ్యత అని పేర్కొన్నారు. జిల్లా పరిపాలన చేపట్టిన లక్ష మొక్కల నాటే కార్యక్రమం విజయవంతం కావడానికి భారతీయ హిందూ పరిషత్ తన పూర్తి సహకారాన్ని అందిస్తుందని తెలిపారు.భారతీయ హిందూ పరిషత్ తరఫున జిల్లా పరిపాలనతో సమన్వయం చేసుకుంటూ గ్రామాలు, పట్టణాలు, దేవాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మరియు ప్రజా ప్రదేశాలలో విస్తృత స్థాయిలో వృక్షారోపణ కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అలాగే, మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, ప్రతి మొక్కకు ఒక బాధ్యత వహించే వాలంటీర్‌ను నియమించి, జియో-ట్యాగింగ్, ఫోటో డాక్యుమెంటేషన్, క్రమానుగత పర్యవేక్షణ మరియు ప్రజల భాగస్వామ్యంతో మొక్కల మనుగడను నిర్ధారించే విధంగా కార్యాచరణ చేపడతామని వివరించారు.
గ్రీన్ గుంటూరు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు ప్రతి స్వచ్ఛంద సంస్థ, యువజన సంఘం, విద్యార్థి, పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిస్తున్నారని, భారతీయ హిందూ పరిషత్ ఆ పిలుపును స్వాగతిస్తూ జిల్లా పరిపాలనతో కలిసి బాధ్యతాయుతంగా పనిచేయడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ప్రజలు, యువత, విద్యార్థులు, మహిళా సంఘాలు, దేవాలయ కమిటీలు మరియు స్వచ్ఛంద సంస్థలు ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించి “హరిత గుంటూరు” నిర్మాణంలో భాగస్వాములు కావాలని భారతీయ హిందూ పరిషత్ విజ్ఞప్తి చేసింది.
ఈ కార్యక్రమంలో రాజేశ్వరి మానేపల్లి, మాతృశక్తి అధ్యక్షురాలు, తలమంచి వెంకటేశ్వర్లు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, రామకృష్ణ, గుంటూరు జిల్లా మీడియా ఇంచార్జ్, మానేపల్లి త్రినాద్, గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు, మానేపల్లి శైలజ, గొన్నాభక్తుల కాళీ ప్రసన్న, ఆలూరి నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News