-రూ.75 కోట్లతో ఏఎంసీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రాజెక్టును జూలై-2027 నాటికి అందుబాటులోకి తీసుకురావాలి
-నవరాత్రుల సందర్భంగా పున్నమి ఘాట్, ఫెర్రీ ఘాట్, బసవ పున్నయ్య స్టేడియంలో ‘విజయవాడ ఉత్సవ్’ నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు చేయాలి
-ఇబ్రహీంపట్నం పవిత్ర సంఘం వద్ద వైదిక కమిటీ సూచనల మేరకు 30 డిగ్రీల డైమెన్షన్‌తో ప్లాట్‌ఫాం నిర్మాణం చేపట్టాలి
-పర్యాటక అభివృద్ధితో జిల్లా ఆర్థికాభివృద్ధికి మరింత ఊతం లభిస్తుంది
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రతిపాదించిన పర్యాటక ప్రాజెక్టులు డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టుల (డీపీఆర్) దశలోనే నిలిచిపోకుండా వేగవంతంగా గ్రౌండింగ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా జిల్లాకు ఆర్థికంగా, ఉపాధి పరంగా విశేష ప్రయోజనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.
జిల్లా కలెక్టరేట్‌లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో గురువారం జిల్లా పర్యాటక ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న పర్యాటక ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. భవానీ ఐలాండ్ వద్ద రూ.75 కోట్ల అంచనా వ్యయంతో ఐదు నుంచి పది ఎకరాల విస్తీర్ణంలో ప్రతిపాదించిన ఏఎంసీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులను త్వరితగతిన పొందాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. డెస్టినేషన్ వెడ్డింగ్, వాటర్ స్పోర్ట్స్, బోటింగ్, 500 మంది సామర్థ్యంతో కన్వెన్షన్ హాల్ తదితర ఆధునిక సౌకర్యాలతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. జూలై-2027 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. భవానీ ఐలాండ్‌లో అమరావతి బోటింగ్ క్లబ్‌ను పర్యాటకులకు ఆకర్షణీయంగా, భద్రతా ప్రమాణాలతో నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. బోటింగ్ కార్యకలాపాల నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ మరిన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. స్వరాజ్ మైదానంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కళావేదికలో 75 మంది సామర్థ్యంతో మినీ థియేటర్‌ను పాఠశాల, కళాశాల విద్యార్థులకు విద్యా, వైజ్ఞానిక, అవగాహన చిత్రాల ప్రదర్శనకు వినియోగించాలన్నారు. ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంఘం వద్ద నదీహారతి కార్యక్రమాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు వైదిక కమిటీ సూచనల మేరకు 30 డిగ్రీల డైమెన్షన్‌లో ప్రత్యేక ప్లాట్‌ఫాంను నిర్మించాలని ఆదేశించారు. అలాగే భక్తులకు అవసరమైన ఇతర మౌలిక వసతులను కూడా ఏర్పాటు చేయాలని కనకదుర్గ అమ్మవారి దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. రాకపోకలకు అనుగుణంగా రోడ్డు అభివృద్ధికి అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్ అండ్ బి అధికారులు తయారు చేయాలని సూచించారు. నదిహారతి సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నందున సాయంత్రం నాలుగు గంటల నుండి 6 గంటల మధ్య ఆర్టీసీ బస్సులను ఆ రూట్ లో నడపాలని సూచించారు. విద్యుత్ కేబుల్స్ ఏర్పాటుకు జల వనరుల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గత ఏడాది విజయవంతంగా నిర్వహించిన “విజయవాడ ఉత్సవ్” కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా నవరాత్రుల సందర్భంగా పున్నమి ఘాట్, ఫెర్రీ ఘాట్, బసవ పున్నయ్య స్టేడియంలో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. పర్యాటకులు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని చెప్పారు. జిల్లాలో పర్యాటక ఆకర్షణగా ఉన్న సిబార్ డిస్నీల్యాండ్ పునరుద్ధరణకు అవసరమైన చర్యలు చేపట్టి తిరిగి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక “ప్రసాద్” (Promotion of Religious Tourism and Spiritual Heritage Augmentation Drive) పథకం ద్వారా లభించే నిధులను జిల్లాలోని ప్రధాన దేవాలయాల అభివృద్ధికి వినియోగించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. కొండపల్లి ఖిల్లాను అడ్వెంచర్ టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ట్రెక్కింగ్, ర్యాపెల్లింగ్ వంటి సాహస క్రీడలకు అవసరమైన బేస్ క్యాంపును జూలై 7 నుండి 11 వరకు ఏర్పాటు చేయడంతో పాటు, శాశ్వత టికెటింగ్ కౌంటర్‌ను ఏర్పాటు చేసి ట్రెక్కింగ్‌కు అవసరమైన సామగ్రిని పర్యాటకులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పర్యాటక రంగంలో సమన్వయంతో ముందుకు సాగాలి
జిల్లాలో ప్రతిపాదించిన ప్రతి పర్యాటక ప్రాజెక్టు నిర్ణీత గడువులో పూర్తయ్యేలా సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశ స్పష్టం చేశారు. పర్యాటక అభివృద్ధి ద్వారా జిల్లాకు మరింత ఆదాయం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, విజయవాడను ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో పర్యాటక శాఖ రీజినల్ డైరెక్టర్ వై.వి. ప్రసన్నలక్ష్మి, జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎ.శిల్ప, జిల్లా అటవీశాఖ అధికారి ఏ.సతీష్, ఏపీటీడీసీ ఈఈ జి.శ్రీనివాసరావు, శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివారి దేవస్థానం ఏఈఓ ఎన్.రమేష్, ఏఈ రమ, అమరావతి బోటింగ్ ప్రాజెక్ట్ సీఈవో కాకాని తరుణ్, బీఐటీసీ ప్రాజెక్టు ఇంజనీర్ జి.ఉమామహేశ్వరరావు తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News