-జిల్లా కన్వీనర్ ఎం. కనకారావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని ఐ.టి.ఐ లలో 2026-27/28 విద్యా సంవత్సరానికి గాను రెండవ విడత అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ప్రిన్సిపాల్ మరియు జిల్లా కన్వీనర్ ఎం. కనకారావు ఒక ప్రకటనలో తెలిపారు. అడ్మిషన్ల కొరకు అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 3వ తేదీ లోగా ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 6వ తేదీన విజయవాడలోని ప్రభుత్వ ఐ.టి.ఐ ప్రాంగణంలో అడ్మిషన్ల కౌన్సిలింగ్ నిర్వహించబడుతుందని తెలిపారు.
అభ్యర్థులు తమ మెరిట్ నంబర్ ఆధారంగా నిర్ణీత తేదీన తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో కౌన్సిలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఐ.టి.ఐ లలో ప్రవేశం పొందే వారిలో ఎస్.సి., ఎస్.టి. అభ్యర్థులు మినహా మిగిలిన కేటగిరీల అభ్యర్థులు రూ. 60/- కాషన్ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని, ప్రైవేటు ఐ.టి.ఐ లలో చేరే అభ్యర్థులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజు చెల్లించాలని తెలిపారు. అభ్యర్థులు తమ మెరిట్ నంబర్ సమాచారం కోసం విజయవాడ ప్రభుత్వ ఐ.టి.ఐ లోని జిల్లా కన్వీనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌ను సంప్రదించవచ్చునన్నారు.
ఇతర వివరాలకు 0866-2475575, 94906 39639, లేదా 77804 29468 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని కన్వీనర్ ఆ ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News