విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భుజం విరగడం, తీవ్రమైన గాయాలు, రోటేటర్ కఫ్ దెబ్బతినడం, భుజం కీళ్ల మార్పిడి, ఇతర పునర్నిర్మాణ శస్త్రచికిత్సల అనంతరం సరైన సమయంలో ఫిజియోథెరపీ చేయించుకుంటే భుజం మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఓలాస్ గోరా తెలిపారు.
విజయవాడలోని వాసవ్య నర్సింగ్ హోమ్‌లో బుధవారం డాక్టర్ సమరం అధ్యక్షతన నిర్వహించిన ఆరోగ్య సదస్సులో ఆయన ‘భుజం శస్త్రచికిత్స తర్వాత ఫిజియోథెరపీ’ అంశంపై ప్రసంగించారు. శస్త్రచికిత్స అనంతరం తొలి దశలో నొప్పి, వాపును తగ్గించడం, అనంతరం క్రమంగా భుజం కదలికలను పెంచడం, కండరాల బలాన్ని పునరుద్ధరించడం, రోజువారీ పనులు తిరిగి చేసుకునే సామర్థ్యాన్ని కల్పించడం ఫిజియోథెరపీ ప్రధాన లక్ష్యాలని వివరించారు. శస్త్రచికిత్స చేయించుకున్నవారు వైద్యులు, ఫిజియోథెరపిస్టులు సూచించిన వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయాలని సూచించారు. వైద్యుల సలహా లేకుండా అధికంగా చేతిని ఉపయోగించడం లేదా స్వయంగా వ్యాయామాలు చేయడం వల్ల చికిత్స ఫలితాలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ప్రతి రోగి పరిస్థితి భిన్నంగా ఉంటుందని, వారి వయస్సు, శస్త్రచికిత్స రకం, కండరాల స్థితి, ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక చికిత్సా ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. రోగి సహనం, క్రమశిక్షణతో వైద్యుల సూచనలను పాటిస్తే త్వరగా కోలుకునే అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. భుజం పూర్తిగా కోలుకోవడానికి కొన్ని వారాల నుంచి కొన్ని నెలల వరకు సమయం పట్టవచ్చని, ఆ సమయంలో నిరుత్సాహపడకుండా నిరంతర ఫిజియోథెరపీ కొనసాగించాలని సూచించారు. సరైన పునరావాస చికిత్స ద్వారా నొప్పి తగ్గడంతో పాటు భుజం కదలికలు, బలం, పనితీరు మెరుగుపడి తిరిగి సాధారణ జీవితం గడపవచ్చని డాక్టర్ ఓలాస్ గోరా వివరించారు.
సదస్సులో పాల్గొన్న వారు ఫిజియోథెరపీపై తమ సందేహాలను నివృత్తి చేసుకుని, శస్త్రచికిత్స అనంతర పునరావాసం ప్రాముఖ్యతపై వైద్య నిపుణులను అడిగి తెలుసుకున్నారు.
Prajavartha Online Telugu News