-వినియోగదారులకు ఇంటి నుంచే నూతన విద్యుత్ కనెక్షన్ దరఖాస్తు చేసే సౌకర్యం – సేవల సరళీకరణలో మరో ముందడుగు : ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యుత్ వినియోగదారులకు మరింత సులభమైన, పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) మరో వినూత్న డిజిటల్ సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఏపీసీపీడీసీఎల్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ పి. పుల్లారెడ్డి 1912 ఇంటిగ్రేటెడ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (IVRS) ద్వారా నూతన విద్యుత్ సర్వీస్ కనెక్షన్ (New Service Connection – NSC) దరఖాస్తుల స్వీకరణ సేవను అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ, వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ సేవలను పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ దిశగా తీసుకెళ్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఫిర్యాదుల నమోదు, సేవలకు సంబంధించిన సమాచారం, వినియోగదారుల సమస్యల పరిష్కారంలో 1912 సేవలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని, ఇప్పుడు అదే వేదిక ద్వారా నూతన విద్యుత్ సర్వీస్ కనెక్షన్ దరఖాస్తులను కూడా స్వీకరించే విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా వినియోగదారులకు మరింత సౌలభ్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
ఇకపై కొత్త విద్యుత్ కనెక్షన్ అవసరమైన వినియోగదారులు *1912*కు కాల్ చేసి IVRS సూచనలను అనుసరించి తమ దరఖాస్తును నమోదు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు నమోదైన వెంటనే సంబంధిత వివరాలు విద్యుత్ శాఖ అధికారులకు చేరుతాయని, అధికారులు వినియోగదారుని సంప్రదించి అవసరమైన పత్రాల పరిశీలన, సాంకేతిక తనిఖీలు, ఇతర ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత కాలవ్యవధిలో కనెక్షన్ మంజూరు చేసే చర్యలు తీసుకుంటారని వివరించారు.ఈ సేవ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు, వృద్ధులు, దివ్యాంగులు, ఉద్యోగ రీత్యా కార్యాలయాలకు రావడానికి సమయం లేని వినియోగదారులకు ఎంతో ఉపయోగపడుతుందని సీఎండీ తెలిపారు. కార్యాలయాలకు పలుమార్లు వెళ్లాల్సిన అవసరం తగ్గడంతో పాటు సేవలలో పారదర్శకత, సమర్థత, జవాబుదారీతనం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.
సాంకేతికత ఆధారిత సేవల ద్వారా విద్యుత్ వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించడమే ఏపీసీపీడీసీఎల్ లక్ష్యమని, భవిష్యత్తులో కూడా మరిన్ని వినియోగదారుల అనుకూల సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.
1912 (IVRS) ద్వారా నూతన సర్వీస్ కనెక్షన్ సేవ ముఖ్యాంశాలు
*1912*కు కాల్ చేసి నూతన విద్యుత్ సర్వీస్ కనెక్షన్ కోసం దరఖాస్తు నమోదు చేసుకునే అవకాశం.
* విద్యుత్ కార్యాలయాలకు వెళ్లకుండానే ఇంటి నుంచే దరఖాస్తు చేసుకునే సౌకర్యం.
* IVRS ద్వారా సులభమైన సూచనలతో వేగవంతమైన దరఖాస్తు నమోదు.
* దరఖాస్తు నమోదు అనంతరం సంబంధిత అధికారుల ద్వారా త్వరితగతిన పరిశీలన.
* అవసరమైన పత్రాల ధృవీకరణ అనంతరం నిబంధనల మేరకు కనెక్షన్ మంజూరు.
* సేవలలో పారదర్శకత, సమర్థత, వినియోగదారుల సంతృప్తి పెంపు.
* ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని అన్ని అర్హులైన వినియోగదారులకు ఈ సేవ అందుబాటులో ఉంటుంది.
ఈ వినూత్న సేవను విజయవంతంగా అభివృద్ధి చేసి అమలు చేసిన ఐటీ విభాగం, కస్టమర్ సర్వీసెస్ విభాగం, 1912 కాల్ సెంటర్ సిబ్బందిని సీఎండీ అభినందించారు. ఈ సేవపై డిస్కమ్ వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించి ప్రతి వినియోగదారునికి చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ టెక్నికల్ ఆవుల.మురళీకృష్ణయాదవ్, చీఫ్ జనరల్ మేనేజర్ ఆపరేషన్స్ సుబ్రహ్మణ్యం,LMC జీఎం శ్రీనివాసులరెడ్డి, ఐటీ విభాగం, కస్టమర్ సర్వీసెస్ విభాగం, 1912 కాల్ సెంటర్ అధికారులు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News