Breaking News

జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తా

-ఎంపీ కేశినేని శివనాథ్‌ చిన్ని హామీ
-ఘనంగా APUWJ 70 వసంతాల వేడుకలు
-‘పత్రికా రంగం–నాడు, నేడు’ అంశంపై సదస్సు
-నూతన లోగో, సావనీర్‌ ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ చిన్ని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ APUWJ 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రెస్‌క్లబ్‌ వద్ద APUWJ ప్రతినిధులు సంఘ పతాకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ సభకు APUWJ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి. సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఎంపీ కేశినేని శివనాథ్‌ చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ సెక్రటరీ జనరల్‌ డి. సోమసుందర్‌, ఐజేయూ నాయకుడు సిన్హా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

APUWJ 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని “పత్రికా రంగం–నాడు, నేడు” అనే అంశంపై సదస్సు నిర్వహించారు. నాటి ముద్రిత పత్రికల నుంచి నేటి ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌, సామాజిక మాధ్యమాల వరకు పత్రికా రంగంలో వచ్చిన మార్పులు, జర్నలిజం విలువలు, మీడియా విశ్వసనీయత, వృత్తిపరమైన సవాళ్లు, జర్నలిస్టుల బాధ్యతలపై వక్తలు మాట్లాడారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా జర్నలిస్టులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూనే వాస్తవికత, నిష్పాక్షికత, వృత్తి విలువలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని వారు ప్రస్తావించారు.

ఈ సందర్భంగా ఐజేయూ సెక్రటరీ జనరల్‌ డి. సోమసుందర్‌ ,APUWJ అధ్యక్షుకు ఐ వీ సుబ్బారావు సమక్షంలో ఎంపీ కేశినేని శివనాథ్‌, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఐజేయూ నాయకుడు సిన్హా APUWJ 70 వసంతాల నూతన లోగోను ఆవిష్కరించి, సంఘ చరిత్ర, పోరాటాలు, విజయాలను వివరిస్తూ ప్రచురించిన సావనీర్‌ను విడుదల చేశారు.

సభకు అధ్యక్షత వహించిన ఐ.వి. సుబ్బారావు మాట్లాడుతూ APUWJ 70వ వార్షికోత్సవ ప్రాధాన్యాన్ని, ఏడు దశాబ్దాల సంఘ ఉద్యమ ప్రస్థానాన్ని వివరించారు. పత్రికా స్వేచ్ఛ పరిరక్షణతోపాటు జర్నలిస్టుల వృత్తిపరమైన హక్కులు, ఉద్యోగ భద్రత, సంక్షేమం కోసం APUWJ నిరంతరం పోరాటాలు నిర్వహించిందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న కొత్త సమస్యలపై కూడా సంఘం ఉద్యమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఐజేయూ సెక్రటరీ జనరల్‌ డి. సోమసుందర్‌ మాట్లాడుతూ ప్రస్తుత జర్నలిజం స్థితిగతులు, మీడియా రంగంలో వస్తున్న మార్పులు, జర్నలిస్టు సంఘాల ఉద్యమ నేపథ్యాన్ని వివరించారు. పత్రికా స్వేచ్ఛ, వృత్తి భద్రత, జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం సాగిన సంఘటిత ఉద్యమాల ప్రాధాన్యాన్ని తెలియజేశారు. సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్‌ మాధ్యమాల విస్తరణ నేపథ్యంలో జర్నలిజం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, వృత్తి విలువలు, విశ్వసనీయతను కాపాడుకోవాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందని పేర్కొన్నారు.

APUWJ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంచల జయరాజ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అపరిష్కృత సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. జర్నలిస్టులపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, హత్యలు, ప్రమాదాల కారణంగా మరణించే జర్నలిస్టుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. జర్నలిస్టులతోపాటు వారి కుటుంబ సభ్యులకు సమగ్ర వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

రైలు ప్రయాణాల్లో జర్నలిస్టులకు గతంలో అమలైన రాయితీలను పునరుద్ధరించాలని, జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, గృహవసతి సమస్యలను పరిష్కరించాలని జయరాజ్‌ విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల పదవీ విరమణ వయసును 58 నుంచి 65 సంవత్సరాలకు పెంచాలని, ప్రతి జర్నలిస్టుకు రూ.10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి అమలయ్యేలా సహకరించాలని కోరుతూ ఎంపీ కేశినేని శివనాథ్‌ చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావులకు APUWJ ప్రతినిధులు వినతిపత్రాలు అందజేశారు.

ఎంపీ కేశినేని శివనాథ్‌ చిన్ని మాట్లాడుతూ దేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్న వెంటనే 70వ APUWJ ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. జర్నలిజం పుట్టిందే విజయవాడ గడ్డపై అన్నంతగా ఈ నగరానికి పత్రికా రంగంతో అవినాభావ సంబంధం ఉందని పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

విలువలతో కూడిన జర్నలిజం క్రమంగా తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోందని కేశినేని శివనాథ్‌ అన్నారు. ఒకప్పుడు పత్రికా రంగమే ప్రధాన సమాచార వ్యవస్థగా ఉండేదని, ఆ తరువాత ఎలక్ట్రానిక్‌ మీడియా, ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు దానికి తోడయ్యాయని చెప్పారు. త్వరగా వార్తలను అందించాలనే పోటీలో కొన్నిసార్లు అవాస్తవాలు ప్రచారంలోకి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిజం కంటే అబద్ధమే వేగంగా ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు.

గతంలో ఒక వార్త రాసే ముందు సంబంధిత వ్యక్తుల వివరణ తీసుకునే సంప్రదాయం ఉండేదని, ప్రస్తుతం ఆ పద్ధతి చాలా వరకు కనుమరుగవుతోందని ఎంపీ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు ప్రజలు ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి పత్రిక కోసం ఎదురుచూసేవారని, డిజిటల్‌ యుగం వచ్చిన తరువాత సమాచారమంతా చరవాణుల్లోనే అందుబాటులోకి వచ్చిందన్నారు. వాస్తవాలను ప్రతిబింబించాల్సిన వార్తలు కొన్ని సందర్భాల్లో పక్కదారి పడుతున్నాయని పేర్కొన్నారు.

ఒకప్పుడు తమపై వార్త వస్తుందంటే రాజకీయ నాయకులు భయపడేవారని, నాణ్యమైన, వాస్తవాధారిత వార్తలు తగ్గిపోవడంతో ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదని కేశినేని శివనాథ్‌ అన్నారు. వార్తల కంటే వివాదాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, కొన్ని సందర్భాల్లో వార్తల విశ్వసనీయతను తామే ప్రశ్నించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని చెప్పారు. “జర్నలిస్టులకు మేము ఎప్పుడూ గౌరవం ఇస్తాం. జర్నలిస్టులు కూడా ప్రజలకు ఉపయోగపడే మంచి వార్తలను, సత్యాలను వెలుగులోకి తీసుకురావాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు” అని తెలిపారు.

ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ జర్నలిజం అనేక సవాళ్లతో కూడుకున్న వృత్తి అని పేర్కొన్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా నిరంతరం పనిచేసేది జర్నలిస్టులేనని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం విస్తరించిన తరువాత ఎవరు వేగంగా సమాచారాన్ని అందిస్తే వారికే ప్రాధాన్యం లభిస్తున్నప్పటికీ, ఆ వేగంతోపాటు వార్తల విశ్వసనీయతను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఒకప్పుడు పత్రిక చదివిన తరువాతే దేశంలో, రాష్ట్రంలో ఏం జరుగుతోందో ప్రజలకు తెలిసేదని బోండా ఉమ గుర్తుచేశారు. ప్రస్తుతం తాము మాట్లాడకపోయినా మాట్లాడినట్లుగా కొన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని అన్నారు. డిజిటల్‌ యుగంలో వాస్తవాల కంటే అవాస్తవాలు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కనీస నమోదు, బాధ్యత లేకుండా కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు నిర్వహిస్తూ, తమకు నచ్చిన విధంగా వార్తలను ప్రసారం చేస్తున్నాయని విమర్శించారు.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని బోండా ఉమ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా జర్నలిస్టుల సమస్యలపై సానుకూలంగా స్పందిస్తారని చెప్పారు. APUWJ ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రిని కలిసి సమస్యలను వివరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించే “మీట్‌ ది ప్రెస్‌” కార్యక్రమంలో పాల్గొనేందుకు తాను, ఎంపీ కేశినేని శివనాథ్‌ సిద్ధంగా ఉన్నామని, అనుకూలమైన సమయాన్ని నిర్ణయిస్తే జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు తప్పకుండా సమాధానాలు ఇస్తామని ప్రకటించారు.

కార్యక్రమంలో ఐజేయూ కార్యవర్గ సభ్యుడు కూన అజయ్‌బాబు, APUWJ ఉపాధ్యక్షులు స్వాతి ప్రసాద్‌, చావా రవి, ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఏచూరి శివ, చిన్న పత్రికల సంఘం ప్రధాన కార్యదర్శి సీహెచ్‌. రమణారెడ్డి, APUWJ విజయవాడ అర్బన్‌ కమిటీ కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, విజయవాడ ప్రెస్‌క్లబ్‌ కార్యదర్శి దాసరి నాగరాజుతోపాటు యూనియన్‌ రాష్ట్ర, జిల్లా నాయకులు, వివిధ పత్రికలు, ప్రసార మాధ్యమాలకు చెందిన జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సీనియర్‌ జర్నలిస్టు ఎస్‌.కె. బాబును ఈ సందర్భంగా సన్మానించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *