Breaking News

పెరిగిన ఎరువులు, పురుగుమందుల ధరలు వెంటనే తగ్గించాలి

-డిజిటల్ ఎరువుల యాప్‌లను రద్దు చేసి పాత పద్ధతిలోనే ఎరువులు అందించాలి-ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించాలి
-ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ఎత్తిపోతల పథకాలకు వెంటనే నిధులు విడుదల చేయాలి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పెరిగిన ఎరువులు, పురుగుమందులు, డీజిల్, వ్యవసాయ యంత్ర పరికరాల ధరలను వెంటనే తగ్గించాలని, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు నూతనంగా తీసుకొచ్చిన డిజిటల్ ఎరువుల యాప్‌లను రద్దు చేసి, గతంలో మాదిరిగానే రైతులకు అవసరమైన మేరకు ఎరువులను అందించాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య, ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్నీడి యలమందారావు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం (ఆగస్టు 17) ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని కలెక్టరేట్ వద్ద రైతులు, కౌలురైతులతో కలిసి ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాను ఉద్దేశించి పి. జమలయ్య మాట్లాడుతూ, ఇటీవల కాలంలో 50 కిలోల కాంప్లెక్స్ ఎరువుల బస్తా ధర రూ.300 నుంచి రూ.700 వరకు పెరిగిందని, అదే విధంగా పురుగుమందుల ధరలు సుమారు 30 శాతం పెరిగాయని తెలిపారు. పెట్రోల్, డీజిల్, వ్యవసాయ యంత్ర పరికరాల ధరలు కూడా భారీగా పెరగడంతో సాగు ఖర్చులు రైతులపై పెనుభారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పెరిగిన ఇన్‌పుట్ ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు.2024 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని విస్మరించి ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేసి స్వచ్ఛంద పంటల బీమా విధానాన్ని తీసుకురావడం సరికాదని ఆయన అన్నారు. దీనివల్ల రైతులు ఎకరాకు వరికి రూ.850, మిరపకు రూ.1,800, మొక్కజొన్నకు రూ.370, పెసరకు రూ.360 చొప్పున బీమా ప్రీమియం చెల్లించాల్సి వస్తోందన్నారు. ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించి, రైతులు చెల్లించాల్సిన ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కోరారు.ఎన్టీఆర్ జిల్లాలోని 118 ఎత్తిపోతల పథకాలు సంవత్సరాల తరబడి మరమ్మతులు, నిర్వహణ లేక మూలనపడ్డాయని జమలయ్య తెలిపారు. వీటి మరమ్మతులు, నిర్వహణ కోసం రూ.291 కోట్లు కేటాయించి ఏడాది గడిచినా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం దారుణమన్నారు. నీటి వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ సాగునీరు అందక రైతులు పంటలు పండించుకోలేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.
తారకరామ ఎత్తిపోతల పథకం, మునేరు ఆనకట్ట, కంచికచర్ల–వేదాద్రి, ముక్త్యాల–వేదాద్రి, వైకుంఠపురం తదితర ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కౌలురైతులకు సులభతరంగా సీసీఆర్సీ కార్డులు జారీ చేయాలని, భూయజమాని తీసుకున్న రుణాలతో సంబంధం లేకుండా కౌలురైతులకు పంట రుణాలు అందించాలని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్నీడి యలమందారావు మాట్లాడుతూ, గత రెండేళ్లుగా రైతులకు చెల్లించాల్సిన వడ్డీ రాయితీ బకాయిలు సుమారు రూ.500 కోట్లు పేరుకుపోయాయని తెలిపారు. బకాయిలను వెంటనే విడుదల చేసి రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ధరల వ్యత్యాసం పథకం కింద మొక్కజొన్న రైతులకు ఎకరాకు రూ.21 వేల చొప్పున వారి ఖాతాల్లో జమ చేయాలని కోరారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని విజ్ఞప్తి చేశారు.రైల్వేలు, రహదారులు, ప్రాజెక్టుల నిర్మాణం కోసం రైతుల భూములను సేకరించే సమయంలో 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేసి, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం జిల్లా అధ్యక్షులు బుడ్డి రమేష్, ఉపాధ్యక్షులు పెయ్యల వెంకటేశ్వరరావు, రైతుసంఘం నాయకులు పొన్నెగంటి వెంకటశివ, బొర్ర వెంకటేశ్వరరావు, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *