Breaking News

తెలుగు భాషపై అంశం పై శాసనసభలో ప్రభుత్వ విప్, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావ్ ఆవేదన

-ఇంటర్‌లో తెలుగును తప్పనిసరి చేయాలని సూచన
-యార్లగడ్డ సూచనలపై లోకేష్ సానుకూల స్పందన
-తెలుగు పరిరక్షణకు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం… కమిటీ లో యార్లగడ్డ ఉండాలని మంత్రి లోకేష్ సూచన
-మాతృభాషను కాపాడటం అందరి బాధ్యత: విద్యాశాఖ మంత్రి లోకేష్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాష పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. విద్యార్థులు తెలుగు మాట్లాడగలుగుతున్నప్పటికీ చదవడం, రాయడం చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో విద్య, తెలుగు భాషపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్‌ స్థాయిలో తెలుగుకు ప్రాధాన్యం తగ్గిపోవడం, కార్పొరేట్‌ కళాశాలల్లో మార్కులు, ర్యాంకుల కోసం ఇతర భాషలను ప్రోత్సహించడం ఆందోళన కలిగించే అంశమన్నారు. విద్యా సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం మంచి పరిణామమని యార్లగడ్డ అన్నారు. అయితే తెలుగు భాషలోనే ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోవడం బాధాకరమన్నారు. పదో తరగతి వరకు సంస్కృతం చదవని విద్యార్థులు సైతం ఇంటర్మీడియట్‌లో ఎక్కువ మార్కులు వస్తాయనే ఉద్దేశంతో సంస్కృతాన్ని ద్వితీయ భాషగా ఎంచుకుంటున్నారని తెలిపారు. గతంలో ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు కొంత ప్రాధాన్యం ఉండేదని, ప్రస్తుతం జేఈఈ మెయిన్స్‌ వంటి ప్రవేశ పరీక్షల్లో ఇంటర్‌ మార్కులకు పెద్దగా సంబంధం లేకపోయినా కార్పొరేట్‌ కళాశాలలు ర్యాంకుల కోసం విద్యార్థులను ఇతర భాషల వైపు మళ్లిస్తున్నాయని పేర్కొన్నారు. తెలుగు భాషపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచేలా పరీక్షా విధానంలో మార్పులు తీసుకురావాలని యార్లగడ్డ సూచించారు. కఠినమైన వ్యాకరణం, క్లిష్టమైన పద్యాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా.. విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునేలా పాఠ్యాంశాలను రూపొందించాలని కోరారు. తెలుగులో 98, 99 మార్కులు సాధించేలా ప్రశ్నపత్రాల రూపకల్పనలో మార్పులు చేస్తే విద్యార్థులు ఆ భాష వైపు ఆసక్తి చూపుతారని అన్నారు. ఇంటర్మీడియట్‌లో తెలుగును తప్పనిసరి ద్వితీయ భాషగా చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం కొనసాగితేనే భాష భవిష్యత్‌ తరాలకు చేరుతుందని, మరో కొన్ని వందల సంవత్సరాలు తెలుగు సజీవంగా ఉండాలంటే ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు భాష అభివృద్ధికి గిడుగు రామమూర్తి పంతులు చేసిన కృషిని యార్లగడ్డ గుర్తుచేశారు. పద్య కవిత్వానికి పరిమితమైన భాషను వ్యవహారిక భాష వైపు తీసుకురావడంలో గిడుగు కీలక పాత్ర పోషించారని తెలిపారు. ప్రస్తుతం తెలుగు మాట్లాడటంలోనే ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితితోపాటు బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే ఫ్లెక్సీల్లో కూడా తెలుగు పదాలను తప్పుగా రాస్తున్న పరిస్థితి కనిపిస్తోందన్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో తెలుగు భాషకు ఉన్న ప్రాధాన్యాన్ని విదేశీ యాత్రికులు సైతం ప్రశంసించిన విషయాన్ని గుర్తుచేశారు. అలాంటి గొప్ప భాషకు ప్రస్తుతం ఈ పరిస్థితి రావడం బాధాకరమన్నారు. తెలుగు భాషను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని విద్యాశాఖ మంత్రిని కోరారు.

యార్లగడ్డ సూచనలపై శాసనసభ ఉపసభాపతి కె. రఘురామకృష్ణరాజు స్పందిస్తూ.. తెలుగు భాష పరిరక్షణకు ఆధునిక గిడుగు రామమూర్తిగా మంత్రి నారా లోకేశ్‌ ఉండాలని యార్లగడ్డ కోరుతున్నారని చమత్కరించారు.
విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడుతూ.. తాను కూడా ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నానని, ఇంటర్మీడియట్‌లో సంస్కృతాన్ని ద్వితీయ భాషగా తీసుకున్నానని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో తెలుగు చదవడం, మాట్లాడటంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే తెలుగు చదవడం నేర్చుకున్నానని చెప్పారు. మండలి బుద్ధప్రసాద్‌ అంత అద్భుతంగా మాట్లాడలేకపోయినా.. కనీసం ఇబ్బంది లేకుండా తెలుగు మాట్లాడగలుగుతున్నానని అన్నారు. తనలాంటి ఇబ్బందులను ప్రస్తుత తరం పిల్లలు ఎదుర్కోకూడదన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. మాతృభాష చాలా కీలకమైనదని లోకేశ్‌ అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కూడా మాతృభాషను విస్మరించవద్దని పలుమార్లు సూచించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమం వైపు వెళ్లినప్పటికీ మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. తెలుగును మర్చిపోకుండా ఉండేందుకు ద్విభాషా పాఠ్యపుస్తకాలను తీసుకొచ్చి కొనసాగిస్తున్నామని తెలిపారు. తెలుగును తప్పనిసరి భాషగా తీసుకురావాలన్న సూచనపైనా సమగ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు భాష పరిరక్షణ, విద్యావిధానంలో అవసరమైన మార్పులపై త్వరలో ఉన్నతస్థాయి సలహా కమిటీని ఏర్పాటు చేస్తామని లోకేశ్‌ ప్రకటించారు. యార్లగడ్డ వెంకట్రావు కీలక సూచనలు చేసినందున ఆయన్ను కూడా కమిటీలో సభ్యుడిగా చేర్చాలని తెలిపారు. కమిటీ నామమాత్రంగా ఉండదని, రెండు మూడు సమావేశాలతో ముగించకుండా కనీసం పది సార్లు సమావేశమై అవసరమైన నిర్మాణాత్మక మార్పులపై చర్చించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కమిటీ చేసే సూచనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజలు తమ మాతృభాషకే ప్రాధాన్యం ఇస్తున్నారని లోకేశ్‌ తెలిపారు. తాను దక్షిణ కొరియాకు వెళ్లినప్పుడు అక్కడి సమావేశాల్లో కొరియన్లు తమ మాతృభాషలోనే మాట్లాడారని, అవసరమైనప్పుడు అనువాదకుల ద్వారా ఇతర భాషల్లోకి అనువదించుకున్నారని వివరించారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా మాతృభాషను విస్మరించడం లేదని, మనం కూడా అదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. మాతృభాష పరిరక్షణ కేవలం ప్రభుత్వం లేదా ఒక్క వ్యక్తి వల్ల సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పోటీతత్వ ప్రపంచంలో ఇతర భాషలు నేర్చుకోవడంతోపాటు మాతృభాషను విస్మరిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తెలుగు భాష పరిరక్షణకు ఇప్పటికే కొన్ని సంస్కరణలు తీసుకొచ్చినప్పటికీ అవి సరిపోవని తాను భావిస్తున్నానని, అందరి సూచనలతో మరింత సమగ్రంగా ముందుకు వెళ్తామని లోకేశ్‌ స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *