స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం

-చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-చెప్పుకోలేక ప్ర‌చారంలో వెన‌క‌బ‌డ్డాం
-ఇంధ‌న‌శాఖ‌ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్

క‌ర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త :
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించేలా కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. క‌ర్నూలు జిల్లా మంత్రాల‌యంలో మంగ‌ళ‌వారం నాడు స‌హ‌చ‌ర మంత్రి నిమ్మ‌ల రామానాయుడుతో క‌లిసి మంత్రి గొట్టిపాటి మినిస్ట‌ర్స్ అవుట్ రీచ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ముందుగా మంత్రాల‌య రాఘ‌వేంద్ర‌స్వామి ఆల‌యానికి చేరుకుని మంత్రులు ఇరువురూ స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. అనంత‌రం మంత్రాల‌యంలో పీఎం సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కంలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత సోలార్ రూఫ్ టాప్ యూనిట్ల‌ను ప్రారంభించారు. ప్ర‌జ‌ల‌ను స్వ‌యంగా క‌లుసుకున్నారు. విద్యుత్‌ రంగంలో ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను వివరించారు. వారి నుంచి సూచ‌న‌లు, స‌ల‌హాల‌నూ స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ.. కూటమి రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్య‌క‌ర్త‌ల‌కు దిశా నిర్దేశం చేశారు. స్థానిక సంస్థల్లో నూరు శాతం విజయం సాధిస్తే అది త‌మ‌తో పాటు ప్రభుత్వానికి, కూటమి శ్రేణులకు కొండంత ధైర్యాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలోని కూటమి ప్రభుత్వం రెండేళ్లలో ఎన్నో మంచి పనులు చేసినప్పటికీ వాటిని ప్రజలకు వివరించడంలో ఇంకా వెనుకబడే ఉన్నామని మంత్రి అన్నారు. తాము పనిచేసినా చెప్పుకోలేకపోతున్నామని, వైసీపీ నేతలు పనిచేయకపోయినా చెడు ప్రచారానికి దిగుతున్నారని విమర్శించారు. డీఎస్సీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కూటమి కార్యకర్తలపై ఉందన్నారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో పేదల పెన్షన్‌ను రూ.వెయ్యి పెంచేందుకు ఐదేళ్లు పట్టిందని మంత్రి గొట్టిపాటి ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు ఒక్క సంతకంతో పేద‌ల‌ పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచారని గుర్తు చేశారు. డయాలసిస్‌ రోగులకు నెలకు రూ.10 వేల చొప్పున, మంచానికే పరిమితమైన దీర్ఘకాలిక రోగులకు రూ.15 వేల చొప్పున పెన్ష‌న్ ను ప్రభుత్వం అందిస్తోందని ఆయ‌న వివ‌రించారు. నిరుద్యోగులకు ఎప్పుడూ లేని విధంగా మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఒక్క శాతం కూడా మంచి చేయ‌ని జ‌గ‌న్ డిఎస్సీపై అస‌త్య ప్ర‌చారాలు చేస్తున్నా ఒక్క‌రు కూడా స‌రిగా ఖండించ‌డం లేదంటూ అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

విద్యుత్‌ సమస్యలకు శాశ్వత పరిష్కారం…

మంత్రాలయం నియోజకవర్గంలో విద్యుత్‌ సమస్యల ప‌రిష్కారానికి ఇప్పటికే 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ మంజూరు చేశామని మంత్రి గొట్టిపాటి తెలిపారు. త్వరలో రూ.65 కోట్లతో 132 కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మాణం చేపడతున్నామ‌ని, ఇందుకు అవసరమైన భూసేకరణ కూడా పూర్తయిందన్నారు. ఆర్‌డీఎస్‌ఎస్‌ పథకం కింద రూ.7 కోట్లతో నియోజ‌వ‌ర్గంలో విద్యుత్‌ అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 2,000 మంది లబ్ధిదారులకు సుమారు రూ.25 కోట్ల వ్యయంతో సోలార్‌ రూఫ్‌టాప్‌ యూనిట్లను ఉచితంగా అందించామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం చేసిన మంచితో పాటు విద్యుత్‌ రంగంలో చేపడుతున్న సంస్కరణలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రజలకు వివరించి, స్థానిక ఎన్నికల్లో కూటమి విజయానికి కార్యకర్తలు కృషి చేయాలని గొట్టిపాటి పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా స్థానిక సంస్థ‌ల్లో విజ‌యం సాధించే వ‌ర‌కూ కూట‌మి కార్య‌కర్త‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. కార్య‌క్ర‌మంలో క‌ర్నూలు ఎంపీ బ‌స్తి నాగ‌రాజు, ఎమ్మెల్యేలు బీవీ జ‌య నాగేశ్వ‌ర్ రెడ్డి, అశోక్ రెడ్డి, టీడీపీ నాయ‌కులు నాగార్జున రెడ్డి, గుడిసె కృష్ణ‌మ్మ‌తో పాటు స్థానిక కూట‌మి నేత‌లు, అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *