– సర్ ప్రక్రియలో ప్రతి దశలోనూ నాణ్యతకే అగ్రస్థానం
– ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో చొరవ అభినందనీయం
– అక్టోబర్ 3న తుది జాబితా ప్రచురణ వరకు సమష్టి కృషితో ముందుకెళ్లండి
– పైస్థాయి నుంచి బీఎల్వో వరకు సరైన సమన్వయం, సహకార స్ఫూర్తి కీలకం
– జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో ఈసీఐ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డా. పవన్ కుమార్ శర్మ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో ప్రతి దశలోనూ నాణ్యతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ లోపాలకు తావులేకుండా దోషరహితమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు సమష్టి కృషి అవసరమని.. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు చూపిన చొరవ అభినందనీయమని భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డా. పవన్ కుమార్ శర్మ అన్నారు.
గురువారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో రాష్ట్రంలో సర్ పురోగతిపై ఈసీఐ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డా. పవన్ కుమార్ శర్మ సమీక్షా, పరస్పర చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ సీఈవో వివేక్ యాదవ్, అదనపు సీఈవో ఎస్.డిల్లీరావుతో పాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, గుంటూరు కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ, పల్నాడు కలెక్టర్ డా. కృతికా శుక్లా, తూర్పుగోదావరి కలెక్టర్ కీర్తి చేకూరి, పశ్చిమగోదావరి కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఏలూరు కలెక్టర్ కె.వెట్రిసెల్వి, బాపట్ల కలెక్టర్ డా. వి.వినోద్ కుమార్, ఆయా జిల్లాల ఈఆర్వోలు ప్రత్యక్షంగా హాజరుకాగా వివిధ జిల్లాల కలెక్టర్లు వర్చువల్‌గా పాల్గొన్నారు. ప్రస్తుతం నోటీసుల జారీ, విచారణ, క్లెయిములు, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డా. పవన్ కుమార్.. జిల్లాల వారీగా పురోగతిని పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 43,71,397 నోటీసుల పంపిణీ కాగా 16,23,774 నోటీసులపై క్షేత్రస్థాయిలో విచారణ పూర్తయింది. ఈ నేపథ్యంలో నోటీసుల పంపిణీ, విచారణ ప్రక్రియలో ముందంజలో ఉన్న జిల్లాలను అభినందిస్తూ.. మిగిలిన జిల్లాలోనూ నాణ్యంగా, వేగంగా, పారదర్శకంగా సర్ స్ఫూర్తికి అనుగుణంగా ప్రక్రియను సజావుగా ముందుకు తీసుకెళ్లేందుకు దిశానిర్దేశం చేశారు. నోటీసులపై విచారణకు సంబంధించి ప్రస్తుతానికి అత్యల్పంగా 15.18 శాతం మాత్రమే పెండింగ్ ఉన్న కర్నూలు జిల్లా కలెక్టర్‌ను అభినందించారు. ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, బీఎల్వోలు, బీఎల్ఏలు, రాజకీయ పార్టీల మధ్య సమన్వయం, సహకారం అనేవి ప్రక్రియను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు కీలకమని.. ఎవరికి ఏ సందేహమున్నా నివృత్తి చేయడం, సమస్య పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం ముఖ్యమన్నారు. ఓటర్లకు అవసరమైన సహాయసహకారాలు సంతృప్తికరంగా అందించడంలో ప్రతిఒక్కరూ కృషిచేయాలని ఈ సందర్భంగా పవన్ కుమార్ శర్మ సూచించారు. ప్రస్తుత దశలో జిల్లాల్లో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, నిబంధనల ప్రకారం సరైన కార్యాచరణపైనా సమావేశంలో చర్చించారు. వృద్ధాప్యం, అనారోగ్యం వంటి వివిధ కారణాల వల్ల విచారణకు హాజరుకాలేని పక్షంలో ఈఆర్వో/ఏఈఆర్వో – బీఎల్వోను సమన్వయం చేసుకుంటూ ఇంటి సందర్శన, వివిధ మార్గాల ద్వారా ఓటర్లకు సహాయసహకారాలు అందించాలన్నారు. అదేవిధంగా నోటీసులపై విచారణ అనంతరం క్వాసీ జ్యుడీషియల్ అధికారి అయిన ఏఈఆర్వోలు సమస్యను అర్థం చేసుకొని న్యాయమైన తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. సమావేశం సందర్భంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్, ఫారం-6, ఫారం-7, ఫారం-8 తదితరాల స్వీకరణ, పరిష్కారం తదితర అంశాలనూ డా. పవన్ కుమార్ శర్మ పరిశీలించారు. నోటీసుల విచారణలో వెనుకబడియున్న శ్రీ సత్యసాయి, తిరుపతి, విశాఖపట్నం, బాపట్ల, మార్కాపురం జిల్లాలతో పాటు విశాఖపట్నం వెస్ట్, పెందుర్తి, నెల్లూరు సిటీ, కదిరి, హిందూపూర్, ఉదయగిరి, పెనుకొండ, ఎర్రగొండపాలెం, తిరుపతి, సర్వేపల్లి తదితర నియోజకవర్గాలు సెప్టెంబర్ 5న జరిగే ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష నాటికి సరైన కార్యాచరణతో ప్రగతిపై దృష్టిసారించాలని సూచించారు.
Prajavartha Online Telugu News