Breaking News

సామాన్యులకు సున్నాగా, కార్పొరేట్లకు మిన్నగా కేంద్ర బడ్జెట్… : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శ

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ సామాన్యులకు గుండుసున్నాగా కార్పొరేట్ వర్గాలకు మిన్నగా ఉన్నదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. ఈ మేరకు రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను నిరాశకు గురిచేసింది. ముఖ్యంగా అట్టడుగు వర్గాలైన దళితులు, గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులకు జీవనోపాధి కల్పించే గ్రామీణ ఉపాధి పథకంలో రూ.25 వేల కోట్ల కోత విధించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు చారిత్రాత్మకంగా రైతాంగ ఉద్యమం జరిగిన పిదప ప్రధాని నరేంద్ర మోడీ దిగివచ్చి నల్ల చట్టాలను రద్దు చేస్తూ, రైతులకు క్షమాపణ చెప్పారు. కానీ ఇప్పుడు కేంద్ర బడ్జెట్ లో రైతులకు ఒరగబెట్టిందేమీ లేకపోగా, రైతులకిచ్చే ఎరువుల సబ్సిడీలో కూడా రూ.25 వేల కోట్లు కోత విధించారు. పంటలకు కనీస మద్దతు ధర గురించి ప్రకటించలేదు. ఈ కేంద్ర బడ్జెట్ లో విద్య, వైద్య రంగాలకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం, కరోనా కష్టకాలంలో 2 కోట్ల ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఏం సమాధానం చెబుతుంది? దేశవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మృగ్యమై యువత నిరుత్సహంలో మగ్గుతున్నది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ కేంద్ర బడ్జెట్లో ఒరిగిందేమీ లేదు. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ గురించి మాట్లాడలేదు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు నిధులను గురించి ప్రస్తావించలేదు. లోటు బడ్జెట్ గురించి మాట్లాడలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సెంట్రల్ యూనివర్సిటీలకు తగిన నిధులు కేటాయించలేదు. పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగిస్తామనడం మరిన్ని ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పజెప్పడమే. కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల విశాఖ ఉక్కు వంటి మరిన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు ధారాదత్తం అవుతాయి. ఈ బడ్జెట్ ప్రకటనలో తమకు మేలు జరుగుతుందనుకున్న వేతన జీవులు నిరాశ చెందారు. మొత్తం మీద దళిత, గిరిజన, వ్యవసాయ కార్మికుల వంటి అట్టడుగు వర్గాలకు, పేద, సామాన్య ప్రజలకు ఈ బడ్జెట్ లో తీవ్ర అన్యాయం జరిగింది. ఇది పూర్తిగా కార్పొరేట్ అనుకూల బడ్జెట్.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాలు.. ఈదురు గాలులు.. విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలి

-ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి -ఉత్తరాంధ్రకు ఎస్పీడీసీఎల్ నుంచి అదనపు సిబ్బంది -ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *