-దళిత అనే మూడు అక్షరాలు నచ్చని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ..వర్ల రామయ్య
-రాష్ట్రంలో దళిత వర్గాలపై దమనకాండ జరుగుతున్నా చోద్యం చూస్తున్న ముఖ్యమంత్రి జగన్
-కోట్ల మంది తెలుగు గుండెల్లో ఎన్టీఆర్.. కర్నూలుకు సంజీవయ్య, నరసరావుపేటకి గుర్రం జాషువా పేరు పెట్టాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పార్లమెంట్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ‘దళిత ప్రతిఘటన సదస్సు’ ఆటోనగర్, ఏపీఐఐసీ కాలనీలో గల కోగంటి రామయ్య తులసమ్మగార్ల కళ్యాణ మండపం నందు నిర్వహించారు, ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎం.ఎస్.రాజు, విజయవాడ పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీఎన్‌టీయూసి రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు, తిరువూరు ఇన్‌చార్జి శ్యావల దేవదత్, దళిత ప్రతిఘటన సదస్సు రాష్ట్ర కోఆర్డినేటర్ కోడూరు అఖిల్, విజయవాడ పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ కరీముల్లా మరియు విజయవాడ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వాసం మునియ్య సబాధ్యక్షత నిర్వహించారు.
ఈ సందర్భంగా పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేదు, మాస్క్ అడిగిన దళిత డాక్టర్ శవంగా మారాడు, అన్యాయాన్ని ప్రశ్నిస్తే శిరోముండనం, మాస్క్ పెట్టుకోలేదని కొట్టి చంపడం వాస్తవం కాదా? రాష్ట్రంలో అత్యాచారాలకు గురైన దళిత యువతులకు ఏం న్యాయం చేశారు? నిందితులకు కొమ్ముకాసేలా అధికార పార్టీ తీరు, దళిత ఓట్లతో గెలిచి వారినే అణగదొక్కుతున్నారు, అమరావతిలో దళిత రైతులపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు, చరిత్రలో ఎక్కడైనా ఇంత దారుణాలు చూశామా? జగన్‌మోహన్‌రెడ్డికి దళిత అనే మూడు అక్షరాలు నచ్చవని అర్థమవుతుంది, దళితులపై దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నా నోరుమెదపని సీఎం, దళిత వర్గాలన్నీ ఏకమై జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా పోరాడాలి, అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదనే విషయాన్ని అధికార పార్టీ నేతలు గుర్తుంచుకోవాలి, జగన్‌మోహన్‌రెడ్డి తీరు మార్చుకోకుంటే ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు.
రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎం.ఎస్.రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై జరిగే దాడులు, అత్యాచారాలకు వ్యతిరేకంగా, దళితులపై జరిగే అన్యాయాలపై దళిత ప్రతిఘటన సదస్సులు నిర్వహిస్తున్నాం, రాష్ట్రంలో దళిత వర్గాలపై దమనకాండ జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్ చోద్యం చూస్తున్నారు, మహిళలపై దాడులకు తెగబడిన వారికి కాపాడుతున్న ప్రభుత్వం, అసలు దిశ చట్టం ద్వారా ఎంతమందికి పాలకులు శిక్షలు వేశారు? వినోద్ జైన్ విషయంలో వైసీపీ రాజకీయం చేస్తోంది, జైన్‌ని పార్టీ సస్పెండ్ చేసింది, దిశ చట్టం ఉపయోగించి ఉరి తీయండి, నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది.
టీడీపీ ప్రభుత్వం రాగానే డాక్టర్ సుధాకర్ మృతికి కారణమైన పోలీసులు అధికారులకు చట్టప్రకారం శిక్షిస్తాం, పోలీసులు అమలు చేయాల్సింది వైసీపీ సెక్షన్‌లు కాదు ఐపీసీ సెక్షన్‌లు, చంద్రబాబు గారు మహిళా,దళిత పక్షపాతి, జగన్ ప్రభుత్వంలో సకల శాఖలకు మంత్రిగా సజ్జల అని, పవర్‌లేని దళిత మంత్రులు ఉంటే ఎంత? పోతే ఎంత? అని ప్రశ్నించారు.
ఎన్టీఆర్ కోట్ల మంది తెలుగు గుండెల్లో ఉన్నారు, 7 నియోజకవర్గాలకు చెందిన జిల్లాకు ఎన్టీఆర్ పెడితే ఎంత? పెట్టకపోతే ఎంత? ఆయన పెట్టిన రూ.2 కిలో బియ్యం, అన్నా క్యాంటీన్లు, ఆయన పేరు మీద ఉండే సంక్షేమ పథకాలను పెట్టగలవా అని ప్రశ్నించారు. దామోదర్ సంజీవయ్య పేరును కర్నూలుకు ఎందుకు పెట్టలేదు, నరసరావుపేటకు గుర్రం జాషువా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు,
విజయవాడ పార్లమెంట్ అధ్యక్షులు నెట్టెం రఘురాం మాట్లాడుతూ దళితుల ఓట్లు వేయించి అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం, ఇంతటి ఘోరంగా ప్రజల్ని వంచించిన ప్రభుత్వం చరిత్రలో లేదన్నారు, తెలుగుదేశం పార్టీ అట్టడుగు వర్గాలనుపైకి తీసుకొని రావడంలో కృషిచేసిందన్నారు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 39 సంవత్సరాలలో 21 సంవత్సరాలు అధికారంలో ఉంది, కేవలం 18 సంవత్సరాలు మాత్రమే మిగతా పార్టీలు అధికారంలో ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో కమిటీలు వేసుకుని దళిత వాడల్లో పర్యటించి వారికి ఏం ప్రభుత్వం మేలు జరిగిందో గుర్తుచేస్తే బాగుంటుందని సూచించారు.
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దళితులపై దాడులు చేయిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న జగన్, అన్యాయాలను ప్రశ్నిస్తే సిగ్గులేకుండా బూతులు తిట్టిస్తారు, బూతుల మంత్రికి బుద్ధి చెప్పిన వర్ల రామయ్య, ఎం.ఎస్ రాజు. అధికార పార్టీ వాళ్లే దాడులు చేసి వారే కేసులు పెడతారు, అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయిస్తున్నారు, 7 లక్షల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో జగన్ శ్వేత పత్రం విడుదల చేయాలి, ప్రతిపక్షంలో ముద్దులు పెట్టి, అధికారంలోకి రాగానే గుద్దులు గుద్దుతున్నాడు, నాడు రోడ్ల మీదే ఉన్నాడు, నేడు తాడేపల్లి రాజప్రసాదం దాటి బయటకు రావడం లేదు, జగన్ ప్రజలకు చేసిన మోసాలను ప్రజలకు వివరించేలా కార్యక్రమాలు చేపడతామన్నారు.
తిరువూరు ఇన్‌చార్జి శ్యావల దేవదత్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, తెలుగుదేశం పార్టీ ద్వారానే రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతుందని ఎస్సీ వర్గాల్లో ప్రచారం చేయాలన్నారు.
Prajavartha Online Telugu News