తాడేపల్లిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కాపు సామాజిక వర్గానికి సంపూర్ణ న్యాయం జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాపులకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ తో జోగయ్య ఆమరణ దీక్షకు దిగడం సరైనది కాదన్నారు. కాపు సంక్షేమ సేన పేరుతో ఒక సంఘాన్ని స్థాపించి జనసేనతో అంట కాగుతున్నారని విమర్శించారు. మరోవైపు వంగవీటి మోహన రంగ హత్యకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు కారణమని జోగయ్య రాసిన పుస్తకం లోని చెప్పారు అనే విషయాన్ని గుర్తించాలన్నారు. అటువంటి తెలుగుదేశంతో జతకట్టాలనీ ప్రయత్నిస్తున్న జనసేనకు కాపు సంక్షేమ సేన వత్తాసు పలకడం దారుణమని మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. జగన్ నాయకత్వంలో కాపు సామాజిక వర్గానికి సంపూర్ణ న్యాయం జరుగుతుందన్నారు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు అనేది ఆచరణ సాధ్యం కాదని తెలిసి ఉండి తెలుగుదేశం జనసేన లు కుయుక్తులు పన్నుతున్నాయి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వారికోసం ప్రవేశపెట్టిన ఈబీసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో కాపు సామాజిక వర్గానికి న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పటిష్టమైన చర్యలు తీసుకున్నారన్నారు. ప్రత్యేకంగా ఒక కమిటీని వేసి దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆ కమిటీ పర్యటించి ఇచ్చిన నివేదిక ప్రకారం ఈబిసి ఈడబ్ల్యూఎస్ కు అర్హతను ఎనిమిది లక్షలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఫలితంగా 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో ఆరు నుంచి ఏడు శాతం వరకు జనాభా ప్రాతిపదికన కాపు సామాజిక వర్గానికి లబ్ధి చేకూరుతుందన్నారు. లేనిపక్షంలో అది ఐదు శాతానికి పరిమితం అయ్యేది అన్నారు. ఈ విధంగా కాపు సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి విద్యా ఉద్యోగ అవకాశాల్లో ప్రయోజనం కల్పించారన్నారు. జోగయ్యతో తనకు 30 ఏళ్ల అనుబంధం ఉందని ఆయన గురించి పూర్తిగా తెలుసునని అంత పెద్దాయనను విమర్శించాలనుకోవడం తన ఉద్దేశం కాదన్నారు. ఆయన వాస్తవాలను గ్రహించాలని కోరారు తెలుగుదేశం జనసేన లకు రాజకీయ ప్రయోజనం చేకూరేలా వ్యవహరించాలనుకోవడం అటువంటి సీనియర్ నాయకుడికి తగదని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ హితవు పలికారు.
Prajavartha Online Telugu News