Breaking News

అర్చక స్వాములు అభ్యున్నతికి కృషి అర్చకత్వం గౌరవం పెంచుదాం…

-భక్తి భావంతో శాంతి సమాజం స్థాపన హిందుత్వం ఏ ఒక్కరి సొత్తు కాదు
-అర్చకుల అవగాహన సదస్సులో ఉపముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ

తాడేపల్లిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త :
గుడికి వచ్చే భక్తుడు దేవుడి తర్వాత కొలిచేది అర్చకుడినేనని అంతటి ప్రాశస్త్యం కలిగిన అర్చకులు తమ గౌరవాన్ని మరింత ఇనుమడింప చేసే విధంగా వ్యవహరించాలని అర్చకులు అభ్యున్నతికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని మాగంటి ఫంక్షన్ హాల్ లో ఆదివారం ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పరిధిలోని ఐదు జిల్లాల కు చెందిన అర్చకులకు అర్చక ట్రైనింగ్ అకాడమీ నిర్వహణలో ఆగమ శిక్షణ తరగతులు అవగాహన సదస్సు జరిగింది. దీనికి అకాడమీ డైరెక్టర్ రాజగోపాల చక్రవర్తి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి దేవుడిపై అపారమైన భక్తి అచంచలమైన విశ్వాసం ఉన్నాయన్నారు. రాష్ట్రంలో దేవాలయాలు అభివృద్ధికి అర్చకుల సంక్షేమానికి వైకాపా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. బడి గుడి లేని ఊరు ఉండదని గుడికి వచ్చే ప్రతి భక్తుడు దేవుడు తర్వాత అర్చకుడిని కొలుస్తారు. అన్నారు. తమ ఇంట్లో ఏ శుభకార్యం జరిగిన ఆ అర్చకుడి వద్దకు వచ్చి మంచి చెడు గురించి తెలుసుకుని అనుసరిస్తారన్నారు. భగవంతుడికి భక్తుడికి మధ్య అర్చకుడు అనుసంధానకర్త లాంటి వారని పేర్కొన్నారు. అతి ప్రాచీనమైన సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించడంలో అర్చకుల పాత్ర అత్యంత కీలకమైనదని మంత్రి కొట్టు సత్యనారాయణ ఉద్ఘాటించారు. తాను దేవాదాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించే నాటికి శాఖ పై ఉన్న అవినీతి మచ్చను చెరిపి వేసేందుకు అనేక సంస్కరణలు ప్రక్షాళన చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. కొంతమంది అధికారులు తీరుతో క్షేత్రస్థాయిలో అర్చకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు. అలాంటి వాటిని గుర్తించి తన హయాంలో ఎటువంటి సమస్యలు లేకుండా అర్చకుల కోసం వారి సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. గత తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో 1561 దేవాలయాల్లో కనీసం ధూప దీప నైవేద్యాలు లేవన్నారు తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 5000 దేవాలయాల్లో ధూప దీప నైవేద్య పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ పథకం కింద గత ప్రభుత్వంలో మూడు వేలు మాత్రమే ఇచ్చే వారిని తమ హయాంలో దానిని 5 వేల రూపాయలకు పెంచామని మంత్రి కొట్టు తెలియజేశారు. దేవాదాయ శాఖలో అనేక సమస్యలు లిటిగేషన్లు కోర్టు కేసులు ఉన్నాయని గుర్తించి వాటి పరిష్కారానికి ప్రతి మంగళవారం క్రమం తప్పకుండా దేవాదాయ శాఖ సమీక్ష సమావేశం నిర్వహిస్తూ సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీనికోసం ప్రతి సోమవారం జిల్లా అధికారి కార్యాలయంలో స్పందన నిర్వహిస్తూ ఆ జిల్లా పరిధిలోని దేవాదాయ శాఖకు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదులు స్వీకరిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. అర్చకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక అర్చకుల జ్ఞాన సంపత్తిని పెంపొందించేందుకు అర్చక సమాఖ్యను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ధార్మిక పరిషత్ ను కూడా పూర్తిస్థాయిలో పునరుద్ధరించామన్నారు. చరిత్రలో తొలిసారి దేవాదాయ శాఖకు ప్రభుత్వం నుండి 70 కోట్లు నిధులు కేటాయించి కనకదుర్గమ్మ గుడి అభివృద్ధి పనులు చేపట్టిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. అర్చకులు తమ మాట తీరు నడవడిక ప్రవర్తన కట్టుబాట్లు వంటి వాటి ద్వారా భక్తుల్లో మరింత విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని మంత్రి కొట్టు సత్యనారాయణ పిలుపునిచ్చారు. అర్చకుడు శ్రద్ధ పెట్టి సమర్థవంతంగా పనిచేసిన చోట ఆలయం ఎంతో అభివృద్ధి చెందుతుందని వైభవం సంతరించుకుంటుందని పేర్కొన్నారు. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ బయటపడకుండా అంతర్గతంగా చర్చించుకుని పీఠాధిపతులు ద్వారా ఏకాభిప్రాయం సాధించాలని ఆయన సూచించారు. హిందూ ధర్మం ఐకమత్యాన్ని ప్రబోధిస్తుందని దానిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరారు. పూజలు హోమాలు యజ్ఞ యాగాదులు వంటివి చేయడం ద్వారా ఆలయాల అభివృద్ధికి అర్చకులు పాటుపడాలన్నారు గతంలో పదివేల లోపు వేతనాలు ఉండే అర్చకులకు తాము వచ్చాక 10000 చేసామని అలాగే 10 నుంచి 15000 లోపు ఉండే వారికి 16,500 రూపాయలు చేశామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలియజేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఐదు లక్షల రూపాయల లోపు ఆదాయం కలిగిన ఆలయాలను అర్చకులకే అప్పగించే దిశగా ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. వంశపారంపర్య అర్చకత్వానికి సంబంధించి అర్చకుల కుటుంబాల్లో 16 సంవత్సరాలు వయసు నిండిన వారి పిల్లలకు అవకాశం కల్పిస్తూ చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అయితే వారు అర్చక ట్రైనింగ్ అకాడమీ నిర్వహించే ఆగమ పరీక్షలు ఉత్తీర్ణులై అవకాశం పొందవలసి ఉంటుంది అన్నారు. దీనికోసం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పరీక్షలు నిర్వహించేలా అర్చక ట్రైనింగ్ అకాడమీ కోర్సును రూపొందించింది అన్నారు. యువతరం అర్చకత్వంలోకి వచ్చేలా ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో కొన్ని ప్రముఖ ఆలయాలను వాస్తు ప్రకారం మార్పులు చేర్పులు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. అత్యంత ప్రాచీనమైన హిందూ ధర్మం హిందుత్వం ఏ ఒక్క రాజకీయ పార్టీ సొత్తు కాదని అన్నారు. భగవంతుడి మీద విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరి సొత్తు అన్నారు దేశంలోనే ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఆలయాలు అనేకం మన రాష్ట్రంలో ఉన్నాయని వాటిని అభివృద్ధి చేసేందుకు దేవాదాయ మంత్రిగా అవకాశం వస్తే బాగుండునని తాను ఆశించానని అదే జరిగిందన్నారు. శ్రీశైలం దేవస్థానానికి సంబంధించి ఎన్నో తరాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను రెవిన్యూ అటవీ శాఖ మంత్రులు సహకారంతో పరిష్కరించడం జరిగిందన్నారు. 4800 ఎకరాల భూమిని ఆలయానికి స్వాధీనం చేస్తూ సరిహద్దులు వేస్తున్నామన్నారు. సమాజంలో దైవచింతన ఆధ్యాత్మికత పెరిగితే శాంతి నెలకొంటుందని దానికి ఏకైక మార్గం ఆలయాలు దేవదాయ శాఖ ద్వారానే జరగాలని అన్నారు. దీని కోసం అర్చక స్వాములు శ్రద్ధ చేయాలని కోరారు. అర్చకులు వారి వారి సమస్యలను ఎప్పుడైనా తన దృష్టికి తీసుకు రావచ్చునని వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలియజేశారు. ఇంకా ఈ సభలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయ రాజు రీజనల్ జాయింట్ కమిషనర్ ఎం వి సురేష్ ఏలూరు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ రంగారావు పశ్చిమగోదావరి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ భద్రాజి తూర్పుగోదావరి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ సుబ్రహ్మణ్యం కాకినాడ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ పులి నారాయణమూర్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ ఆగమ శాస్త్ర ఇన్చార్జ్ ఆత్రేయ బాబు, ఎం రాంబాబు శాంతి బాబు కిరణ్ తదితరులు ప్రసంగించారు. తాడేపల్లిగూడెం ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ సుజన కుమార్ ఇంకా పలువురు ఎండోమెంట్ ఇన్స్పెక్టర్లు ఆలయ ఈవోలు ఐదు జిల్లాలకు సంబంధించిన ఆగమార్చకులు వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన అర్చకులకు దేవాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ చేతులు మీదుగా సర్టిఫికెట్లు ప్రధానం చేశారు. ఆలయ ఉద్యోగులు మంత్రి కొట్టు సత్యనారాయణ డిప్యూటీ కమిషనర్ విజయ రాజును ఘనంగా సన్మానించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *