రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి స్థానిక గౌతమి జీవ కారుణ్య సంఘం మరియు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం సందర్శించారు. ముందుగా గౌతమి జీవ కారుణ్య సంఘాన్ని సందర్శించిన న్యాయ మూర్తి అక్కడ వృద్ధులకు కల్పిస్తున్న సదుపాయాలను పరిశీలించారు. వంటశాల, భోజనశాల మరియు వసతి గదులను పరిశీలించారు. అక్కడ అధికారులతో మాట్లాడి వారి సమస్యల గురించి తెలుసుకున్నారు. వృద్ధులకు ఏ విధమైన సమస్యలున్నా పారా లీగల్ వాలంటీర్ల ద్వారా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకురావాలని ప్రత్యూష కుమారి అన్నారు. తదుపరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన న్యాయమూర్తి సైకియాట్రిక్ విభాగాన్ని పరిశీలించారు. అక్కడి వైద్యులతో మాట్లాడి ఆసుపత్రిలో ఉన్న వైద్య సదుపాయాలు, రోగుల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఏ లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని, ఎటువంటి సమస్య ఉన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకురావాలని అన్నారు.
Prajavartha Online Telugu News