Breaking News

ఆపదమిత్ర శిక్షణ కార్యక్రమం నిజ జీవితంలో విపత్తుల సమయంలో ఎంతగానో ఉపకరిస్తుంది: జిల్లా కలెక్టర్

శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆపద మిత్ర శిక్షణ కార్యక్రమం ఒక బృహత్తరమైన కార్యక్రమం అని శిక్షణ పొందిన వారి సేవలు ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆపదలో ఉన్న ప్రజలకు ఎంతగానో ఉపయోగకరమని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు.

బుధవారం మధ్యాహ్నం శ్రీకాళహస్తి లోని విస్తరణ శిక్షణ కేంద్రం లో 12 రోజులపాటు ఆపదమిత్ర శిక్షణ తీసుకుంటున్న యువతీ యువకులను కలెక్టర్ అభినందించారు. వాలంటీర్లు, ఆశా వర్కర్లు ఈ శిక్షణ అనంతరం గ్రామీణ స్థాయిలో వీరు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని అన్నారు. ఇది గొప్ప అవకాశం అని తెలిపారు.

ఈటిసి ప్రిన్సిపాల్ కలెక్టర్ కు వివరిస్తూ ఈ శిక్షణ కార్యక్రమం ఈ ఏప్రిల్ నెల 10 నుండి ప్రారంభమై ఈనెల 21 వరకు కొనసాగుతుందని, ఇందులో అనంతపురం, పుట్టపర్తి, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, కడప, కర్నూలు జిల్లాల నుండి 88 మంది శిక్షణ పొందుతున్నారని తెలిపారు. వీరికి విషయ పరిజ్ఞానంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్ గా విపత్తు నిర్వహణ నేర్పించడం జరుగుతుందని తెలిపారు. శిక్షణ అనంతరం వీరికి సర్టిఫికెట్, కలెక్టర్ గారిచే ధృవీకరించబడిన గుర్తింపు కార్డు, 10 వేల రూపాయల విలువ చేసే ఆపద సమయంలో కాపాడేందుకు ఉపకరించే కిట్ ను అందజేయటం జరుగుతుందని, రాష్ట్ర విపత్తుల నిర్వహణ అథారిటీ వారి నుండి 5 లక్షల భీమా పాలసీ ఆపద మిత్రలకు ఇవ్వబడుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న వారు మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమంలో గ్యాస్ లీకేజీ జరిగినప్పుడు అప్రమత్తమై అగ్ని ప్రమాదాలను నివారించుటకు తీసుకోవలసిన చర్యలపై ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వారు మంచి శిక్షణ ఇచ్చారని తెలిపారు. సిపిఆర్ చేసే విధానం పై అవగాహన వచ్చినదని, వరద విపత్తు సంభవించినప్పుడు నీటిలో మునిగిపోతున్న వారిని కాపాడుటకు అనుసరించాల్సిన విధానాన్ని ఎస్ డిఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్ బృందాలు తదితర శాఖలు ఆశా వర్కర్లకు, వాలంటీర్లకు శిక్షణ అందించారని ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా నేర్చుకున్న విషయ పరిజ్ఞానంతో క్షేత్రస్థాయిలో ప్రజలకు ఆపదమిత్రగా ప్రకృతి విపత్తులు, ఇతర ప్రమాదాల సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు, తమ ప్రాణాలు కాపాడుకుంటూ ప్రజల ప్రాణాలు కాపాడటానికి అనుసరించాల్సిన వ్యూహాలను శిక్షణలో తెలుసుకున్నామని, తద్వారా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కాపాడగలగవచ్చు అని పూర్తి విశ్వాసం కలిగిందని కలెక్టర్ కు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డిఓ రామారావు, ఈ టి సి ప్రిన్సిపాల్ నాగ పద్మజ, వైస్ ప్రిన్సిపాల్ విద్యా రమ, సీనియర్ ఫ్యాకల్టీ సమత, శిక్షణ పొందుతున్న యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *