– అధికారిక కమిటీ ఆమోదంతోనే కిడ్నీ మార్పిడి చికిత్స
– ఆర్ధిక ప్రయోజనాల కోసం అవయవదానం చేయడం చట్ట విరుద్ధం
– 2012లో చికిత్స చేస్తే ఇప్పుడు ఆరోపణలు చేయడం గమనార్హం
– అరుణ్ కిడ్నీ సెంటర్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు
– నిజాలు తెలుసుకోకుండా, వివరణ తీసుకోకుండా కొన్ని మీడియా సంస్థలు వాస్తవ విరుద్ధమైన కథనాలను ప్రసారం చేయడం దురదృష్టకరం
– ప్రఖ్యాత నెఫ్రాలజిస్ట్ డాక్టర్ నలమాటి అమ్మన్న
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓ కిడ్నీ మార్పిడి చికిత్సకు సంబంధించి తమ హాస్పిటల్ పై జరుగుతున్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని అరుణ్ కిడ్నీ సెంటర్ అధినేత, ప్రఖ్యాత నెఫ్రాలజిస్టు డాక్టర్ నలమాటి అమ్మన్న తెలిపారు. సూర్యారావుపేటలోని అరుణ్ కిడ్నీ సెంటర్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ హాస్పిటల్లో 2012లో నిర్వహించిన కిడ్నీ మార్పిడి చికిత్సను వివాదాస్పదం చేస్తూ కొన్ని ప్రసార మాధ్యమాల్లో అసత్య కథనాలు ప్రసారమయ్యాయని చెప్పారు. నిజాలు తెలుసుకోకుండా, వివరణ తీసుకోకుండా కొన్ని మీడియా సంస్థలు వాస్తవ విరుద్ధమైన కథనాలను ప్రసారం చేయడం దురదృష్టకరమని అన్నారు. తమ హాస్పిటల్లో నిర్వహించిన అన్ని చికిత్సల్లోనూ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ వచ్చామని, దాదాపు నాలుగు దశాబ్దాల తమ ప్రస్థానంలో ఏనాడూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. ప్రస్తుత అంశంలోకి వస్తే, అధికారిక కమిటీ ఆమోదం తర్వాతే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించామని అన్నారు. కిడ్నీ గ్రహీత వెంకటేశ్వరరావు, దాత శ్రీనివాసరావులిద్దరూ అమలాపురానికి చెందినవారనీ. వాళ్లిద్దరూ బావ బావమరుదులని చెప్పినప్పటికీ అవయవ మార్పిడికి సంబంధించి అధికారిక కమిటీ సమీక్షకు పంపించామని తెలిపారు. దాత, గ్రహీతల మధ్య ఎటువంటి ఆర్ధిక లావాదేవీలు జరగలేదని కమిటీ సభ్యులు విశ్వసించడంతోనే కిడ్నీ మార్పిడికి ఆమోదం లభించిందని, పూర్తి చట్టబద్ధంగానే సదరు కిడ్నీ మార్పిడి చికిత్సను నిర్వహించామని వెల్లడించారు. ప్రస్తుతం ఆరోపణలు చేస్తున్న కిడ్నీ దాత శ్రీనివాసరావు 2016లోనూ హైదరాబాదులో పోలీసులకు ఫిర్యాదు చేశాడని, ఆర్థికంగా లబ్ది పొందేందుకే ఇప్పుడు మళ్లీ అతడు ఆరోపణలకు పాల్పడుతున్నాడని అన్నారు. తమ ఆసుపత్రిపై నేరుగా ఆరోపణలు చేయకపోయినప్పటికీ, జరిగిన ప్రచారం వల్ల తమ హాస్పిటల్ ప్రతిష్టకు భంగం కలిగే ప్రమాదం ఉందని ఆందోళ వ్యక్తం చేశారు. ఆర్ధిక ప్రయోజనాల కోసం అవయవ దానం చేయడం చట్ట విరుద్ధమని, తనకు ఇస్తానన్న డబ్బులివ్వలేదని ఆరోపిస్తున్న శ్రీనివాసరావు చట్ట ప్రకారం శిక్షార్హుడని అన్నారు. 2012లో కిడ్నీ మార్పిడి జరిగితే పదేళ్ల తర్వాత ఆరోపణలు చేయడం గమనార్హమని తెలిపారు. కిడ్నీ మార్పిడి విషయంలో తాము నిబంధనలను కచ్చితంగా పాటించామని, సదరు వ్యవహారంలో వాస్తవాలను ప్రతిఒక్కరికీ తెలియజేసేందుకే ఈ సమావేశం ఏర్పటుచేశామని డాక్టర్ అమ్మన్న పునరుద్ఘాటించారు.
అరుణ్ కిడ్నీ సెంటర్ ఆధ్వర్యంలో నిరంతర సేవా కార్యక్రమాలు
అరుణ్ కిడ్నీ సెంటర్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు డాక్టర్ అమ్మన్న ఈ సందర్భంగా తెలిపారు. ఫ్లోరైడ్ కారణంగా మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న ఎ.కొండూరు మండలంలోని తండావాసుల కోసం ప్రతినెలా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. కరోనా విపత్తు సమయంలో ఐదు వేల మందికి కిట్లను ఉచితంగా పంపిణీ చేశామని, ప్రభుత్వ ఆసుపత్రి కోసం రూ.15 లక్షల విలువైన రెండు హెచ్ఎఫ్ఎన్సీ మెషీన్లను అందజేశామని గుర్తుచేశారు. వలస కార్మికులకు భోజన సదుపాయం కల్పించడంతో పాటు, వారికి పాదరక్షలను అందజేశామని చెప్పారు. కోవిడ్-19 బాధితుల కోసం 1500 డయాలసిస్ లను ఉచితంగా నిర్వహించామని తెలిపారు. ఎస్ఎంసీ అల్యుమినీ ద్వారా రూ.మూడు కోట్ల వ్యయంతో పాత, కొత్త ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటుచేశామని డాక్టర్ అమ్మన్న వివరించారు.
Prajavartha Online Telugu News