-అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: కె.రామకృష్ణ
-పసుసు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్ని వెంటనే ప్రారంభించాలి: కెవివి.ప్రసాద్
-పంట దెబ్బతిన్న పొలాల్లో పర్యటించిన సీపీఐ, రైతు సంఘాల నాయకత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం పసుపు, మొక్కజోన్న పంటల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంట సేకరణ ప్రారంభించి ఉంటే రైతులు పంట నష్టపోయే వారు కాదని, వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రైతులు తీవ్రంగా నష్టపోయారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. సిపిఐ, రైతు సంఘాల ప్రతినిధి బృందం కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పెదపులిపాక గ్రామంలో మంగళవారం పర్యటించి అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న పొలాలను పరిశీలించింది. పంట నష్టపోయిన రైతులను పరామర్శించి, నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులతో కలిసి పొలాల్లోకి వెళ్లి కల్లాలలో ఉండిపోయిన వండిన పసుపు, ఈదురుగాలలకు వంగిపోయి పూర్తిగా తడిసిన మొక్కజొన్న, తెల్లజొన్న పంటలను పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న కూలీలతో మాట్లాడారు.
అనంతరం రామకృష్ణ విలేకర్లతో మాట్లాడుతూ పసుపు పంటకు ఎకరానికి లక్ష రూపాయలు, మొక్కజొన్న పంటకు ఎకరానికి రూ.40 వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు మిగతా పనులు ప్రక్కనపెట్టి పంట నష్టపోయిన పొలాలకు సంబంధించిన పూర్తి ఎన్యూమరేషన్ చేయాలని కోరారు. రైతులను ఆదుకోవటం కోసం అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని తీసుకోవాలన్నారు. నష్టపోయిన వారిలో కౌలు రైతులు ఉంటే నష్టపరిహారాన్ని కౌలు రైతులకు ఇవ్వాలన్నారు. వ్యవసాయ శాఖా మంత్రిని కలిసి రైతులకు న్యాయం చేయాలని కోరనున్నట్లు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలను కేంద్రం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ట్రేడ్ యూనియన్లు బుధవారం (మే 3న) రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రాస్తారోకోలకు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించిందనీ, ఈ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొంటామన్నారు. ఈ రాస్తారోకో కార్యక్రమాల్లో అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వం కూడా పాల్గొని మద్దతు ప్రకటించాలని కోరారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని, రాస్తారోకోలు జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్ మాట్లాడుతూ వరి కోతలు, మినుము నూర్పిడులు, దాళ్వా కోతల సమయంలో అకాల వర్షాలు పడి రైతులు కోలుకోలేని స్థితిలో ఉన్నారని తెలిపారు. టమాట, ఉల్లి వంటి ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయిందన్నారు. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ పేరుతో రైతాంగాన్ని ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఆరోపించారు. పసుపు క్వింటాకు మద్దతు ధర రూ.6,850/` ఉంటే బయట రూ.4,200/` అడుగుతున్నారన్నారు. మొక్కజొన్న క్వింటా మద్దతు ధర రూ.1962/` ఉంటే బయట రూ.1500/` పలుకుతుందన్నారు. ధాన్యం 75 కిలోల బస్తా మద్దతు ధర రూ.2,060/` ఉంటే మార్కెట్‌లో రూ.900/`లకు కూడా అడగటం లేదన్నారు. మద్దతు ధరకు కూడా ప్రభుత్వం పంట కొనుగోలు చేయించలేకపోతే రైతాంగం పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే పంటను ఎన్యూమరేషన్ చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ బృందంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి శంకర్, కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, సీపీఐ కృష్ణాజిల్లా ఇన్‌చార్జి కార్యదర్శి టి.తాతయ్య ఉన్నారు.
రైతుల ఆవేదన: పంట నష్టాన్ని పరిశీలించటానికి తమ గ్రామానికి వచ్చిన సీపీఐ బృందం వద్ద రైతులు బండి సదాశివరావు, మేడసాని రాంబాబు, ఎస్‌కే. నసీర్, అట్లూరి శ్రీనివాసరావు, ఘంటా వెంకటేశ్వరరావు, చుండూరి లాజర్, కరిముల్లా, వల్లూరు ఏలియా వారి గోడు వెళ్లబోసుకున్నారు. ఆరుగాలం కష్టించి పండిరచిన పంట చేతికి వచ్చే సమాయానికి అకాల వర్షాలు తమ జీవితాల్ని తల్లకిందులు చేశాయని కన్నీరుమున్నీరయ్యారు. పంటలు కాపాడుకోవటానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవటంతో తీవ్రంగా నష్టపోయామని చెప్పారు. అప్పు తెచ్చి పెట్టిన పెట్టుబడి పోవడంతో అప్పు ఎలా తీర్చాలి, కుటుంబాన్ని ఎలా పోషించాలంటూ వండిన పసుపు, తడిసిపోయిన మొక్కజొన్న పంటలను చూపించి బోరున విలపించారు. సీపీఐ, రైతు సంఘాల ప్రతినిధి బృందం రైతులను ఓదార్చి, వారికి న్యాయం జరిగేవరకూ అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది.
Prajavartha Online Telugu News