స్పెషల్ స్టొరీ
-గంగమ్మ తల్లి జాతరను ఘనంగా జరుపుకుందాం: భూమన కరుణాకర రెడ్డి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ శ్రీ శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఆలయం దేశంలోనే పురాతనమైనదని జానపద సంస్కృతి తిరుపతి నుండే ప్రారంభమైందని పల్లవుల కాలం నాడే నిర్మింపబడి ఆతరువాత చోళుల కాలంనాడు ఆరాదించబడినట్లు ఆ తరువాత సాక్షాత్తు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గంగమ్మ తల్లిని తన చెల్లెలు గా భావించి ఆలయాన్ని పునః ప్రతిష్టించమని రామానుజా చార్యుల సమకాలీకులు, అనంతాల్వారును ఆదేశించారని, అనంతాల్వారు తిరుపతిలో స్వామివారికి ప్రథమ భక్తుడు, తన గురువుగారైన తిరుమల నంబి పేరు మీద కోనేరు తవ్వి గంగమ్మతల్లి ఆలయాన్ని పునః ప్రతిష్టించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి వివరించారు. తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి భక్తుడు అనంతాల్వారు తిరుమలలో తన భార్య నిండు గర్భవతిగా ఉన్నప్పుడు స్వామి వారి అభిషేకం కొరకు తిరుమలలో ఒక కోనేరును పరమ భక్తులైన వీరు త్రవ్వారని ఇప్పటికీ అనంతాల్వారు ట్యాంక్ గా పిలువబడుతున్నదని తెలిపారు. తిరుమల నంబిని శ్రీవెంకటేశ్వర స్వామి వారే ముద్దుగా తాత, తాతా అని పిలిచే వారట అందుకే గంగమ్మతల్లి గుడి ముందు తాతయ్య గుంట ను త్రవ్విoచారని అందుకే ఈ దేవాలయం తాతయ్యగుంట గంగమ్మ గుడిగా ప్రసిద్ధి చెందిందని అన్నారు. ఆలయ పునః నిర్మాణ పనులు ఈ తరంలో జరగడం, మే 01 నుండి కుంభాభిషేక మహోత్సవాలు ప్రారంభించుకుని మే 05 న జగద్గురువు శ్రీశ్రీశ్రీ కంచి కామ కోటి పీటాధిపతులు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారిచే శ్రీ శ్రీ గంగమ్మ దేవత విగ్రహ పునః ప్రతిష్టాపన జరగనున్నదని అన్నారు. గత 500 ల సంవత్సరాలుగా తిరుమల శ్రీవారి నుండి తన చెల్లెలు గంగమ్మ తల్లికి సారె అందుతున్నదని, భారతీయ సంస్కృతిలో తోడబుట్టిన అక్క చెల్లెమ్మలకు సారె అందించడం మన సాంప్రదాయంగా ఉందని తెలిపారు.
ఈసారి జాతరను ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపధ్యంలో అమ్మవారి జాతరను ఈ నెల 09 నుండి 16 వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలలాగా ఈ జాతర మహోత్సవాన్ని నిర్వహించబోతున్నామని వివరించారు. గతంలో గంగమ్మ తల్లిని దర్శించుకుని స్వామివారి దర్శనానికి వెళ్ళేవారని, అందుకే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్వామి వారి బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలను సమర్పించే ముందు ఆచారం ప్రకారం శ్రీ గంగమ్మ తల్లిని దర్శించుకుని వెళ్ళిన విషయం మనకు తెలిసిందేనని ఈ ఆచారం కోనసాగించాలని ఆశిస్తున్నామని అన్నారు.
జాతర ప్రాముఖ్యత:
గంగమ్మ ఆదిశక్తి, అనంత చైతన్య జ్వాలాదీప్తి, అపర కాళికావతారం, కొలిచే భక్తుల కొంగు బంగారం, గంగమ్మ తల్లిగా అవతారం ఎత్తిన ఈ మహాశక్తి గురించిన స్థలపురాణం మొత్తం భక్తిరస చరిత్ర. ఆ రోజుల్లో తిరుపతి పరిసర ప్రాంతాలకు సామంతుడైన ‘పాలెగాడు’ పరిపాలించేవాడు. వాడు పరమ దుర్మార్గుడు.. ప్రజలను రాచిరంపాన పెట్టే రాక్షసుడు. వాణ్ణి వధించి కాపాడమని జనం ప్రార్ధిస్తే, అప్పుడు గంగమ్మ తల్లి ప్రజల కల్పవల్లిగా వానిని తుది ముట్టించాలని నిర్ణయించింది.
ఈ విషయం పాలెగాడికి తెలిసి, ఆ తల్లి కోపానికి జడిసి ఎక్కడికో వెళ్ళి దాక్కున్నాడు. తనను వాడు కనిపెట్టకుండా వాడి కోసం గంగమ్మ తల్లి రోజుకో వేషం వేసి తిరిగింది. చివరికి గంగమ్మ దొర వేషం వేసినప్పుడు పాలెగాడు తన రాజు వచ్చాడని భావించి బైటికి వచ్చిన వాడిని గంగమ్మ తల్లి వధించింది. పాలే గాడి నుండి కాపాడిన గంగమ్మ తల్లిని సంతృప్తి పరిచేందుకు జాతరలో భక్తులు రకరకాల వేషాలు వేస్తుంటారు. బైరాగి వేషం, గారడి వేషం, రౌడీ వేషం, బండ వేషం, ఆడ వేషం ఇలా ఏ వేషం వేసినా మదిలోని అహం, మోహం లాంటి అవలక్షణాలను వదిలించుకుంటూ అమ్మ కటాక్ష వీక్షణాలకు పాత్రులవుతూ ఉంటాం.
తిరుపతి ఒకప్పుడు గ్రామం, ఇప్పుడు విస్తరించిన ఆధ్యాత్మిక నగరం, కొందరు బతుకు తెరువు కోసం వచ్చారు. మరి కొందరు అవసరాల రీత్యా వచ్చారు. ఎవరు ఎందుకోసం వచ్చినా ఆ తల్లి అందరిని కాపాడుతూనే ఉంటుంది. అందుకే తిరుపతి సురక్షిత నగరంగా భాసిల్లుతోంది. గత వెయ్యి సంవత్సరాలలో దేశంలో ఎన్నో చోట్ల కలరా మహమ్మారి సోకినా మన తిరుపతి దరిదాపులకు సైతం అది చేరలేదు, ఇది కేవలం మన గంగమ్మ తల్లి చలువే. ఇక్కడ అతివృష్టి లేదు, అనావృష్టి లేదు భయంకరమైన తుఫానులు లేవు. సాఫీగా సాగిపోయే పరిస్థితులే ఉండడం చరిత్రకు తెలుసు, బయటి ప్రాంతాలనుంచి వచ్చి తిరుపతిలో స్థిరనివాసం ఏర్పరుచుకొన్న వాళ్ళెందరో గంగమ్మ తల్లి గొప్పతనాన్ని గురించి, ఆ తల్లి నెలకొన్న గుడి గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఆమె పాదాలకు మోకరిల్లి భక్తి భావనను పెంపొదించుకోవలసిన అవసరం మరింతగా వుంది.
మనమంతా కలిసి అమ్మవారి జాతరను గంగమ్మ తల్లి బ్రహ్మోత్సవాలుగా జరుపుదాం. దేశంలోనే మొదటి గ్రామ దేవత అయిన మన గంగమ్మ వైభవాన్ని జగమంతా చాటుదామని స్థానిక శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News