-ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి కాశీ విశ్వేశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శివ నామస్మరణ సర్వపాపాలను హరిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి సోమవారం సత్యనారాయణపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కైలాసనాథునికి సుగంధద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. లయకారుడు, ఓంకార స్వరూపుడైన శంకరుని ధ్యానించే వారికి ఎటువంటి ఆపదలు దరిచేరవని చాగంటి వారు అన్నారు. కష్టాలన్నీ తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయన్నారు. అలా కాదని పాపాలను చేసిన వారికి అనుభవాన్ని ఈశ్వరుడు ఏదో ఒకరోజు సంఘటన రూపంలో కచ్చితంగా ఇస్తారని చెప్పారు. కనుక సరైన మార్గంలో శివుణ్ణి ధ్యానిస్తే ఉన్నతమైన స్థితికి చేరుకుంటారని తెలిపారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. మానవుడు ఒత్తిడిని జయించాలంటే ఆధ్యాత్మికతతోనే సాధ్యమని పేర్కొన్నారు. మానసిక ప్రశాంతతకు ఆధ్యాత్మికతే అనువైన మార్గమని వెల్లడించారు. హనుమత్ వైభవ ప్రవచన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులందరూ ఈ సందర్భంగా పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేశారు. తదనంతరం వేదపండితులు వీరికి ఆశీర్వచనాలు పలికి పరమశివుని తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం స్థానిక శైవ క్షేత్రంలో విశిష్ట పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ చైర్మన్ కొల్లూరు రామకృష్ణ, ఈవో యడ్లపల్లి సీతారామయ్య, కమిటీ సభ్యులు కోలవెన్ను కొండా, మంగళంపల్లి చంటి, మంగళంపల్లి నాగేశ్వరరావు, రాగోలు పద్మావతి, రాధిక, డివిజన్ కోఆర్డినేటర్ దోనేపూడి శ్రీనివాస్, నాయకులు చాంద్ శర్మ, మైలవరపు రామకృష్ణ, కూనపులి ఫణి, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News