-బీసీ కులగణనతోనే సమాన అవకాశాలు
– నూతన పీసీసీ మొదటి సమావేశంలో అధ్యక్షులు గిడుగు రుద్రరాజు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజోపయోగమైన మంచి మ్యానిఫేస్టోతో ప్రజల్లోకి వెళ్తామని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నూతన కమిటీ తొలి సమావేశం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో సోమవారం జరిగింది. ముందుగా విజయనగరం రైలు ప్రమాద బాధితులకు సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించిన తరువాత సమావేశాన్ని ప్రారంభించారు. ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర బాధ్యులు క్రిష్టోఫర్ తిలక్, సీడ్ల్యుసీ సభ్యులు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, తులసిరెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు చింతా మోమన్, జేడీ శీలం, మాజీ రాష్ట్ర మంత్రి కనుమూరి బాపిరాజు, సినీ హీరో రాజాతో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొని భవిష్యత్తు కార్యచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మీడియాతో మాట్లాడుతూ… ఎంతో ముఖ్యమైన కులాల వారీ జన గణనకు అనుకూలంగా తీర్మానం చేసినట్లు వెల్లడించారు. బీసీ కులగణనతో జనాభాలో 50 శాతానికిపైగా ఉన్న బహుజనులకు వారికి అందాల్సిన సామాజిక, రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు న్యాయబద్ధంగా అందుతాయని తెలిపారు. ఎన్నికలకు ఒక వ్యూహంతో వెళ్తామని చెప్పిన పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు.. భావసారూప్యం కలిగిన పార్టీలతో కలిసి ముందుకు వెళ్తామని, ఇప్పటికే సీపీఐ, సీపీఎం అగ్రనేతలతో భేటీ అయినట్లు తెలిపారు.
కరువు జిల్లాలను ప్రకటించాలి…
రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుందని, ముఖ్యమంత్రి జగన్ రైతుల కష్టాలు తెలుసుకోవడానికి పర్యటనలు చేయడంతో పాటు వెంటనే కరువు జిల్లాలు, మండలాలు ప్రకటించాలని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి కూడా తీర్మానాన్ని ఆమోదించినట్లు చెప్పారు. లక్షలాది రూపాయిలు వెచ్చించిన అన్నదాతకు వర్షాభావ పరిస్థితులతో కన్నీళ్లే మిగులుతున్నాయని వాపోయారు. ప్రభుత్వం కరువు ప్రాంతాలను ప్రకటించి, వెంటనే నష్ట పరిహారం అందించాలన్నారు. సాగు, తాగు నీటి అవసరాలను వెంటనే తీర్చాలన్నారు.
డిసెంబర్ లోపు మండల స్థాయి కమిటీలు… శిక్షణ…
పార్టీ బలోపేతం దిశగా చర్యలు చేపడుతున్నామని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. అందులో భాగంగానే ఇప్పటికే కొత్త పీసీసీ కార్యవర్గంలో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా / నగర అధ్యక్షులతో సమావేశం మొదటి సమావేశం సోమవారం నిర్వహించామని తెలిపారు. నవంబర్ 15వ తేదిలోపు మండల కమిటీల ఎంపిక పూర్తవుతుందని, డిసెంబర్ చివరికి బూత్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి శిక్షణా శిబిరాలు కూడా నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించామని చెప్పారు. కాంగ్రెస్ పునర్వైభవం సాధిస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియా ప్రాముఖ్యత పెరిగిందని, మండల, జిల్లా, నగర స్థాయి కమిటీలకు సోషల్ మీడియాలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని ఆయన తెలిపారు.
గొంతు నొక్కుతున్నారు…
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై దాడులు పెరిగిపోయాయని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా 144 సెక్షన్, జీవో 1 అంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని విమర్శించారు. మద్యం, మట్టి, ఇసుకను ప్రజా ప్రతినిధులే దోపిడీ చేస్తున్నారని మండి పడ్డారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో అధికార వైసీపీ తగిన బుద్ది చెబుతారన్నారు.
నిరుద్యోగులను నిండా ముంచారు…
ఉద్యోగ క్యాలెండర్ అంటూ నాలుగున్నరేళ్లుగా కాలయాపన చేస్తున్న అధికార పార్టీ… ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేక పోయిందని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఏఐసీసీ ప్రవేశపెట్టిన పథకాల వంటి వాటితోనే…ఇక్కడ కూడా మంచి మేనిఫేస్టోతో ప్రజల మందుకు వస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం… ఉద్యోగాలంటూ నిరుద్యోగులను నిండా ముంచారని ఆరోపించారు. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బీసీ కుల గణనకు సంబంధించి నవంబర్ నెలలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో.. ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. సీడ్ల్యుసీలో నూతనంగా ఎన్నికైన మాజీ మంత్రి డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి తో పాటు ముఖ్యనేతలను దుశ్సాలువాతో సత్కరించి, జ్జాపికలను బహూకరించారు. కార్యక్రమంలో కార్యనిర్వహక అధ్యక్షులు మస్తాన్ వలి, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డి, మహిళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు లాం తాంతియా కుమారి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ రుత్తుల శ్రీరామ్మూర్తి తో పాటు, nsui, యూత్ కాంగ్రెస్ తో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు, వివిధ విభాగాలు, డిపార్ట్మెంట్ ల ఛైర్మన్ లు, పలువురు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News