-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో నిర్వహించే ఎన్నికల ప్రక్రియలో భాగంగా కౌంటింగ్ కేంద్రాలు స్ట్రాంగ్ రూమ్‌లను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని ఇందుకు సంబంధించి అనుకూలమైన భవనాలను పరిశీలిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తెలిపారు.
జిల్లాలో నిర్వహించే ఎన్నికలకు సంబంధించి చేపట్టే ముందుస్తు చర్యలలో భాగంగా కౌంటింగ్ కేంద్రాలు స్ట్రాంగ్ రూమ్‌ల ఏర్పాటుకు భవనాల పరిశీలనలో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డా. పి. స ంపత్ కుమార్, మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సబ్ కలెక్టర్ అదితి సింగ్‌లు ఇబ్రహీంపట్నం నిమ్రా ఇంజనీరింగ్ మెడికల్ కళాశాలల భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో ఉమ్మడి కృష్ణాజిల్లాలో నిర్వహించిన ఎన్నికల సందర్భంలో పెనమలూరు మండలం కానూరు పి.వి.పి సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల భవనాలలో కౌంటింగ్ కేంద్రాలు స్ట్రాంగ్ రూమ్‌లలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాల పున:ర్‌వ్యవస్థీకరణ అనంతరం ఏర్పడిన ఎన్‌టిఆర్ జిల్లాలో నిర్వహించనున్న ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ కేంద్రాలు స్ట్రాంగ్ రూమ్‌లను ఏర్పాటు చేయవలసి ఉందన్నారు. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో 1781 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. ఎన్నికల ప్రక్రియ అనంతరం పార్లమెంట్ నియోజకర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ల లెక్కింపును వేరువేరు భవనాలలో నిర్వహించవలసి ఉంటుందన్నారు. పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ఓట్ల లెక్కింపు భవనంతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 7 ఓట్ల లెక్కింపు కేంద్రాలకు భవనాలను ఏర్పాటు చేయవలసి ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి మొత్తం 3,562 ఈవియంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్‌లను అదే ప్రాంగణంలో భవనాలను పరిశీలిస్తున్నామన్నారు. విజయవాడ లయోల, స్టెల్లా కళాశాలలతో పాటు నిమ్రా ఇంజనీరింగ్ మెడికల్ కళాశాల భవనాలను పరిశీలిస్తున్నామన్నారు. నగరంలో కౌంటింగ్ కేంద్రాలు స్ట్రాంగ్ రూమ్‌ల ఏర్పాటుకు అనుకూలమైన భవనాలను గుర్తించి రాష్ట్ర ఎన్నికల అధికారికి నివేదికలు సమర్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
కౌంటింగ్ కేంద్రాలు స్ట్రాంగ్ రూమ్‌ల పరిశీలనలో కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ డా. పి. స ంపత్ కుమార్, మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సబ్ కలెక్టర్ అదితి సింగ్, డిఆర్‌వో ఎస్ వి నాగేశ్వరరావు, ఎన్నికల సూపరింటెండెంట్ సిహెచ్ దుర్గాప్రసాద్, తహాశీల్థార్ శ్రీనివాసరావు, నిమ్రా విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ డా. టి. నారాయణ మూర్తి, ప్రిన్సిపల్ అక్బార్ ఖాన్‌లు ఉన్నారు.
Prajavartha Online Telugu News