-యుద్ధప్రాతిపదికన పనుల పూర్తికి చర్యలు
-ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (మునిసిపల్, పట్టణాభివృద్ధి) వై.శ్రీలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సామాజిక న్యాయస్ఫూర్తికి ప్రతిబింబంగా 18 ఎకరాల విశాల స్థలంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేస్తున్న 125 అడుగుల ఎత్తయిన డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం, స్మృతివనాలను జనవరి 20న రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (మునిసిపల్, పట్టణాభివృద్ధి) వై.శ్రీలక్ష్మి వెల్లడించారు.
నగరంలోని స్వరాజ్య మైదానంలో డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం పనులను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి శుక్రవారం పరిశీలించారు. పనుల సత్వర పూర్తికి అధికారులు, కేసీపీ ప్రతినిధులకు మార్గనిర్దేశనం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణం పూర్తయిందని.. ఇప్పుడు ప్రధానంగా విగ్రహం చుట్టూ ఉన్న ప్రాంగణంలో చేపడుతున్న పనుల పూర్తిపై దృష్టిసారించినట్లు తెలిపారు. పనులను త్వరితగతిన పూర్తిచేసి జనవరి 20న ప్రారంభోత్సవానికి సిద్ధం చేయనున్నట్లు వెల్లడించారు. స్మారక మ్యూజియం, మినీ థియేటర్, కన్వెన్షన్ సెంటర్, కేంటీన్ తదితర పనులను లక్ష్యానికి అనుగుణంగా పూర్తిచేయనున్నట్లు తెలిపారు. స్మృతివనం ప్రాంగణమంతా పచ్చదనం ఉట్టిపడేలా ప్రణాళికలకు అనుగుణంగా సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లోని కేబీఆర్ నేషనల్ పార్కు చూట్టూ వాక్ వే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉందని.. అదే విధంగా విజయవాడలోని డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం హరిత శోభతో కళకళలాడేలా తీర్చిదిద్దుతున్నామని.. వాక్‌వేను ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. ఫౌంటైన్ పనులు ఇప్పటికే పూర్తయినట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి తెలిపారు.
పట్టణప్రాంతాల సుందరీకరణకు ప్రణాళికాయుత కృషి:
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల సుందరీకరణ అనేది ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉందని.. ఆ దిశగా ప్రణాళికాయుత చర్యలు తీసుకుంటున్నట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి తెలిపారు. విశాఖపట్నం, కాకినాడ, ఇతర స్మార్ట్‌సిటీలతో పాటు నెల్లూరు, కర్నూలు తదితర నగరాల్లోనూ సుందరీకరణ, హరిత ప్రాజెక్టుల అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నగరాల్లో భౌగోళికంగా వాటివాటి ప్రత్యేకతల ఆధారంగా ప్రాజెక్టులు చేపడుతున్నట్లు తెలిపారు. ఉదాహరణకు రాజమహేంద్రవరంలో నదీ అభిముఖ సుందరీకరణ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. అదే విధంగా 110 చెరువులను మిషన్ అమృత్ సరోవర్ కింద అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. చెరువుల చుట్టూ వాక్‌వేల ఏర్పాటు, పచ్చని మొక్కలతో గ్రీన్ బెల్టు తదితరాలను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. మరో రెండు నెలల్లో ఈ పనులు పూర్తికానున్నట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి వెల్లడించారు. సందర్శనలో జిల్లా జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్, కేసీపీ ప్రతినిధులు తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News