-సీపీఐ 99వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే నాసర్‌వలి విగ్రహావిష్కరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సామాన్యు కుటుంబం నుంచి వచ్చి పెద్దగా చదువు లేకపోయినా ప్రజల మనిషిగా ఉండి ప్రజాప్రతినిధిగా ఎదిగిన షేక్ నాసర్‌వలి నిఖార్సైన కమ్యూనిస్టు నేత అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కొనియాడారు. సీపీఐ 99వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిస్వార్ధ ప్రజాసేవకుడు, మాజీ శాసనసభ్యులు నాసర్‌వలి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. కృష్ణలంక చలసాని నగర్‌లో సిద్ధెం కృష్ణారెడ్డి భవన్ వద్ద మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా 99వ వ్యవస్థాపక దినోత్సవాల్లో మొదటి కార్యక్రమంగా నాసర్‌వలి విగ్రహాన్ని ఆవిష్కరించటం ఆనందంగా ఉందన్నారు. సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ అతిపెద్ద మెజార్టీతో కార్పోరేటర్‌గా ఎన్నిక కావటం, తరువాత 28వేల ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందటం మాటలు కాదన్నారు. నాసర్‌వలీతోపాటు ఆయన కుటుంబ సభ్యులందరూ కమ్యూనిస్టు పార్టీ కోసం పనిచేసేలా తీర్చిదిద్దారని తెలిపారు. ప్రపంచంలో అత్యధిక దేశాల్లో ఉన్న రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీయే అన్నారు. శ్రమజీవులతోనే ప్రపంచం ముందుకెళుతుందన్నారు. మేథావులతో పాటు కష్టజీవులకు ప్రాధాన్యత ఉండాలన్నారు. ప్రజల నుంచి నాయకుడుగా ఎదగాలనే స్ఫూర్తిని నాసర్‌వలి ద్వారా అలవరచుకోవాలన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ ఓట్లు, సీట్లు చూడకుండా ప్రజలపక్షాన నిలబడి పోరాడేది కమ్యూనిస్టు పార్టీయే అన్నారు. సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ పేద ప్రజల నాయకుడుగా ఉన్న నాసర్‌వలి మనువాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడి జైలు శిక్ష అనుభవించారని గుర్తు చేశారు. సీపీఐ 17, 18 డివిజన్ శాఖల ఆధ్వర్యంలో విజయవాడ నగర కార్యవర్గ సభ్యులు సంగుల పేరయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాసర్‌వలి విగ్రహానికి సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రక్కనే ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి రామకృష్ణ, జల్లి విల్సన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర సహాయ కార్యదర్శులు లంక దుర్గారావు, నక్కా వీరభద్రరావు, 17వ డివిజన్ కార్యదర్శి అంబటిపూడి మోహన్‌కుమార్, 18వ డివిజన్ కార్యదర్శి సయ్యద్ సుభాని, స్థానిక నాయకులు కూరాకుల స్టాలిన్, పాశం ఆంజనేయులు, గంగవరపు కొండారెడ్డి, జల్ది చిన్నారావు, మాజీ కార్పోరేటర్ తంగిరాల రామిరెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యంతో సీపీఐ నగర కార్యదర్శివర్గ సభ్యులు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తొలుత రామకృష్ణ కేక్‌కట్ చేసి సీపీఐ 99వ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు పి.చంద్రనాయక్ బృందం విప్లవ గీతాలు ఆలపించారు.
రామకృష్ణకు ఘనస్వాగతం : మాజీ ఎమ్మెల్యే షేక్ నాసర్‌వలి విగ్రహావిష్కరణకు విచ్చేస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణకు స్థానిక నాయకత్వం ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాన రహదారి నుంచి వేదిక వరకు పూలవర్షం కురిపించారు. బాలికలు కోలాట నృత్యం చేస్తూ ముందుకు సాగుతూ నాయకులను వేదికవరకు తీసుకువచ్చారు. పార్టీ నినాదాలు, ప్రజానాట్యమండలి అభ్యుదయ గీతాలతో చలసానినగర్‌లో పండుగ వాతావరణం నెలకొంది.
Prajavartha Online Telugu News