– 3 ఏళ్ల చిన్నారికి క్యాన్సర్
– విషయం తెలుసుకుని చలించిపోయిన మంత్రి వనిత
– నేనున్నానని బాధిత కుటుంబానికి భరోసా కల్పించిన వైనం
ద్వారకాతిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
రెక్కాడితేగాని డొక్కాడని ఆ కుటుంబానికి పెద్ద కష్టమే ఎదురైంది. బుడిబుడి అడుగులు వేస్తూ అల్లారుముద్దుగా కళ్ల ముందు తిరగాల్సిన చిన్నారికి క్యాన్సర్ మహమ్మారి సోకింది. వైద్యం చేయించే స్తోమత లేని ఆ చిన్నారి కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత చలించిపోయి వెంటనే ఆ పాప కుటుంబాన్ని పిలిపించి, నేనున్నానని ధైర్యం చెప్పి, పాప వైద్యానికి చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. వివరాల్లోకి వెళితే. మండలంలోని గుణ్ణంపల్లి పంచాయితీ, మహదేవపురం గ్రామానికి చెందిన కన్నూరి రాజు, భవానీ దంపతులు కూలీనాలి చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. పాప వినూజ్ఞకు 3 ఏళ్ల వయస్సు కాగా, బాబు వియాన్కు ఏడాదిన్నర వయస్సు. ఇదిలా ఉంటే 3 రోజుల క్రితం పాప వినూజకు కంటి సమస్య ఏర్పడటంతో తల్లిదండ్రులు ఏలూరులోని ఒక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు పాపకు రెటినో బ్లాస్టిమా క్యాన్సర్ అని తేల్చి చెప్పారు. వైద్యానికి ఎక్కువ ఖర్చు అవుతుందన్నారు. అలాగే బాబు వియాన్కు కూడా వైద్య పరీక్షలు చేయాలన్నారు. దాంతో బాధిత కుటుంబం ఏం చేయాలో పాలుపోక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఆనోటా ఈనోటా విషయం తెలుసుకున్న స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు పాప పరిస్థితిని మంత్రి వనితకు తెలిపారు. దాంతో చలించిపోయిన ఆమె బుధవారం వెంకటకృష్ణాపురంలో పర్యటించిన సమయంలో బాధిత కుటుంబాన్ని పిలిపించి, మాట్లాడారు. అలాగే పాప ఆరోగ్య పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. వెంటనే వైద్యానికి చర్యలు చేపట్టాలని సీఎంవో కార్యాలయ అధికారులను ఫోన్లో ఆదేశించారు. ఆలస్యం జరగకుండా సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేలా చూడాలన్నారు. అనంతరం బాదిత కుటుంబానికి నేనున్నానని ధైర్యం చెప్పారు.
Prajavartha Online Telugu News