– బ్యాంకు ఖాతాల ద్వారా లేదా ఇంటి వద్దకే పెన్షన్ సొమ్ము
– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ఎన్నికల సంఘం ఆదేశాలను పాటిస్తూ ప్రభుత్వ ఉన్నతాధికారుల మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకొని రానున్న 1వ తేదీ నుండి వికలాంగులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు, మంచానికే పరిమితమైన వారు, నడవలేని స్థితిలో ఉన్న వారికి, యుద్ధవీరుల వృద్ధ వితంతువులకు ఇంటి వద్ద నగదు రూపంలో, మిగిలిన వారికి బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ మొత్తం జమ చేయడం జరుతుందని పింఛన్ల కోసం ఎవరూ ఏ గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లనవసరం లేదని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తీసుకునే చర్యలపై జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు ఆదివారం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్, గ్రామ వార్డు సచివాలయాల జిల్లా అధికారితో కలిసి ఆదివారం క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా ప్రతినిధులతో కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో 2 లక్షల 36 వేల మందికి పైగా సామాజిక భద్రతా పించన్లను పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ఇందులో వృద్ధాప్య, వితంతువు, మత్స్యకారులు, డప్పు వాయిద్య, ఇతర కళాకారులు, విభిన్న ప్రతిభావంతులు, సైనిక వైల్ఫేర్, ఒంటరి మహిళ, కల్లుగీతకార్మికులు, చర్మకార వృత్తికారులు, నేతకార్మికులు, ట్రాన్‌జెండర్స్, అభయ హస్తం, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తదితరులకు పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. మే1వ తేదీ నుండి డోర్ టు డోర్, బ్యాంకు ఖాతాల ద్వారా డీబీటీ విధానంలో పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. పెన్షన్ పంపిణీపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు మార్గదర్శకాలను జారీ చేయడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి మార్గదర్శకాలకు అనుగుణంగా పింఛన్లు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వికలాంగులు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ లేవలేని స్థితిలో ఉన్నవారికి , మంచం పట్టి వీల్‌చైర్‌కు పరిమితమైన వారికి, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న యుద్ధవీరుల వృద్ధ వితంతువులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఇంటి వద్దనే పెన్షన్లు నగదు రూపంలో అందజేయడం జరుగుతుందన్నారు. మిగిలిన పెన్షన్‌దారులకు ఆధార్ కార్డుతో అనుసంధానమైన బ్యాంక్ ఖాతా ద్వారా పెన్షన్ నగదును మే 1న ఉదయం 8.30 గంటల నుంచి జమ చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. బ్యాంకు ఖాతాల ద్వారా పెన్షన్లు చెల్లించే జాబితా, ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ మొత్తం అందించాల్సిన పెన్షనర్ల జాబితాల ప్రకారం పెన్షన్ల పంపిణీపై సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. డోర్ టు డోర్ పంపిణీ చేయవలసిన పెన్షన్‌దారుల జాబితా, బ్యాంక్ ఖాతాల ద్వారా పంపిణీ చేయాల్సిన పెన్షనర్ల జాబితా ప్రతి సచివాలయానికి అందుతుందని వివరించారు. డోర్ టు డోర్ ద్వారా పెన్షన్ పంపిణీని 1వ తేదీ ఉదయమే ప్రారంభించాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన నగదును ముందుగానే సిద్ధం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు వెల్లడించారు. బ్యాంకు ఖాతాల ద్వారా నగదు చెల్లించడంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని లీడ్ బ్యాంకు అధికారులను కోరడం జరిగిందన్నారు. బ్యాంకు ఖాతా ద్వారా ఏ కారణం చేతనైనా బదిలీ కాకుంటే అటువంటి వారి జాబితాను సిద్ధం చేసుకొని మే 3వ తేదీన వారికి నగదు రూపంలో ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. మీడియా సమావేశానికి ముందు సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీకి తీసుకోవాల్సిన చర్యలపై డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, గ్రామ వార్డు సచివాలయ జిల్లా అధికారి కె.అనురాధ, జిల్లాకు చెందిన ఎంపీడీవోలతో కలెక్టర్ ఎస్.డిల్లీరావు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
Prajavartha Online Telugu News