– ఫారం-12 దరఖాస్తు చేసిన ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాం
– ఓపీవోలు, ఇతర ఎన్నికల సిబ్బంది ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం కేంద్రీకృత ఫెసిలిటేషన్ సెంటర్‌కు రానవసరం లేదు
– ఓపీవోలు, ఇతర ఎన్నికల సిబ్బంది వారి నివాస నియోజకవర్గం ఫెసిలిటేషన్ సెంటర్‌లోనే ఓటు హక్కు వినియోగించుకోవచ్చు
– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు కేటాయించబడిన అధికారులు, ఉద్యోగుల్లో ఫారం-12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు చేసిన అధికారులు, ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించడం జరిగిందని.. పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో సజావుగా ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. ఎన్నికల విధులు కేటాయించబడిన సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేందుకు నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కేంద్రీకృత ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను శనివారం కలెక్టర్ డిల్లీరావు పరిశీలించి ఎన్నికల అధికారులు, సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల విధులు నిర్వర్తిస్తూ పోస్టల్ బ్యాలెట్ కొరకు ఫారం-12 దరఖాస్తు సమర్పించిన సుమారు 23 వేల మందికి పైగా అధికారులు, సిబ్బందికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఎన్‌టీఆర్ జిల్లాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఎన్నికల విధులు కేటాయించబడిన సిబ్బందికి వారికి ఓటు హక్కు ఉన్న నియోజకర్గానికి సంబంధించిన రిటర్నింగ్ అధికారి వద్ద ఫెసిలిటేషన్ సెంటర్‌లో ఈ నెల 4, 5, 6 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్‌టీఆర్ జిల్లాలో విధులు నిర్వర్తిస్తూ వారికి ఇతర జిల్లాలో ఓటు హక్కు ఉన్నట్లయితే అలాంటి వారి నుంచి ఫారం-12 తీసుకొని సంబంధిత జిల్లా ఎన్నికల అధికారుల ద్వారా పోస్టల్ బ్యాలెట్‌ను సమీకరించి.. ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఏర్పాటుచేసిన కేంద్రీకృత ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్‌లో ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు వారు ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు కేటాయించబడిన నియోజకవర్గంలో ఎన్నికల విధులపై 4, 6 తేదీల్లో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని.. శిక్షణ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్‌లో ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఓపీవోలు, ఇతర ఎన్నికల సిబ్బంది ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం కేంద్రీకృత ఫెసిలిటేషన్ సెంటర్‌కు రానవసరం లేదని.. ఈ సిబ్బంది వారి నివాస నియోజకవర్గం ఫెసిలిటేషన్ సెంటర్‌లోనే ఓటు హక్కు వినియోగించుకోవచ్చని సూచించారు. ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉద్యోగులకు అవసరమైన సూచనలు, సలహాలు అందించేందుకు సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉద్యోగులు వారి ఎపిక్ కార్డు, గుర్తింపు కార్డులను ఎన్నికల అధికారులు పరిశీలించిన అనంతరం వారికి సంబంధించిన నియోజకవర్గం ఓటర్ బ్యాలెట్ పేపర్‌ను అందజేయడం జరుగుతుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ పేపర్, ఫారం-13ఏ, ఫారం-13బీ, ఫారం-13సీ, ఫారం-13డీలను వినియోగించుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తారన్నారు. తొలిరోజు ప్రశాంత వాతావరణంలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. కేంద్రీకృత ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాట్ల పరిశీలనలో కలెక్టర్ వెంట డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, ఐసీడీఎస్ పీడీ జి.ఉమాదేవి, గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా సమన్వయ అధికారి అనూరాధ, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఈ డి.వెంకటరమణ, డీఈవో యూవీ సుబ్బారావు కలెక్టరేట్ పరిపాలనా అధికారి సీ హెచ్. నాగలక్ష్మి దితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News