-స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పాక్షిక ఎన్నికలు జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పాక్షిక పారదర్శకంగా సాధారణ ఎన్నికలు జరిగేందుకు, ఓటర్లు ప్రశాంతంగా స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని మరియు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నడుచుకోవాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ కోరారు. శనివారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో, అభ్యర్థులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు 2024 కొరకు మే13 న పోలింగ్ నేపథ్యంలో పోలింగ్ కు 72 గం.ల ముందు, 48 గం. ల ముందు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పై రాజకీయ పార్టీల ప్రతినిధులకు, అభ్యర్థులకు ఎన్నికల సాధారణ పరిశీలకులు ఉజ్వల్ కుమార్ ఘోష్ సమక్షంలో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2140 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, అందులో 696 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, మొత్తం 964 మైక్రో అబ్జర్వర్ల ఏర్పాటుతో, 1401 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్, 888 పోలింగ్ కేంద్రాలలో వీడియోగ్రఫీ ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు కేంద్ర బలగాలు, ఆర్మ్డు రిజర్వ్ బలగాలు, రాష్ట్ర పోలీసులకు అదనంగా చేపట్టడం జరుగుతోందని తెలిపారు. ఓటర్ ఇన్ఫర్మేషన్ షిప్ లను పంపిణీ చేయడం జరిగిందని, అబ్సెంటీ, షిఫ్టెడ్, డెడ్, ఏఎస్డి జాబితా తయారీ ఎలెక్ట్రల్ రోల్ తో పాటు ప్రిసైడింగ్ అధికారికి డిస్ట్రిబ్యూషన్ రోజున అందించడం జరుగుతుందని, ఎవరైనా నిజమైన ఓటర్ వచ్చి ఓటు వ వేసేకి వచ్చినప్పుడు వారి ఎపిక్ కార్డు లేదా ప్రత్యామ్నాయ ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి ఛాలెంజ్ ఓట్ కొరకు ప్రిసైడింగ్ ఆఫీసర్ తగు చర్యలు తీసుకుంటారని తెలిపారు. సుమారు 85741 మంది ఎఎస్డి జాబితాగా ఉందని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో ఎక్కడైతే స్థలాభావం వలన తక్కువ స్థలం ఉండి, ఎక్కువమంది అభ్యర్థులు పోటీల్లో ఉన్నారో అక్కడ ప్రాధాన్యతా క్రమంలో ఎవరిని లోపల అనుమతి అనేది సంబంధిత ప్రిసైడింగ్ అధికారి అబ్జర్వర్ సూచనల మేరకు, రిటర్నింగ్ అధికారి, సెక్టార్ అధికారి సూచనల మేరకు సీటింగ్ కొరకు చర్యలు తీసుకుంటారని తెలిపారు. తాజా ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు గుర్తింపు పొందిన జాతీయ పార్టీల అభ్యర్థులు, గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల అభ్యర్థులు, గుర్తింపు పొందిన ఇతర రాష్ట్ర పార్టీలు ఎవరైతే వారి పార్టీ సింబల్ కేటాయించబడిన అభ్యర్థులు, రిజిస్టర్డ్ మరియు గుర్తింపు పొందని పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇలా పోలింగ్ కేంద్రంలో స్థలం అందుబాటులో ఉన్న మేరకు అనుమతి ఉంటుందని, మిగిలిన వారు పోలింగ్ కేంద్రం బయట కూచుని అవసరం మేరకు పోలింగ్ కేంద్రం లోపలికి వెల్లి పరిశీలించవచ్చని తెలిపారు. ఇది అర్థం చేసుకుని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.
పోలింగ్ కు 48 గంటల ముందు నుండి అనగా ఈరోజు శనివారం సాయంత్రం 6 తర్వాత ఎలాంటి ఎన్నికల ప్రచారం చేయరాదని, లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదని, నియోజకవర్గ ఓటరు కాని వారు అక్కడ ఉండరాదని, మద్యం అమ్మకాలు పోలింగ్ ప్రక్రియ ముగింపు సమయం వరకు నిషేధం అని తెలిపారు. కౌంటింగ్ రోజు జూన్ 4న సాయంత్రం 6 గం. వరకు మద్యం అమ్మకాలు నిషేధం అని డ్రై డే పాటించాలని ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. ప్రింట్ మీడియాలో అడ్వర్టైజ్ మెంట్ల కొరకు ఎంసిఎంసీ ముందస్తు అనుమతి తప్పనిసరి అని తెలిపారు.కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్, లాడ్జిలు, గెస్ట్ హౌస్ లు తదితరాలు చెకింగ్ ఉంటాయని తెలిపారు. పోలింగ్ రోజున ఓటర్లకు ఎలాంటి ప్రలోభాలకు గురి చేయరాదని, ఓటింగ్ కొరకు వచ్చేవారిని అడ్డగించరాదని పోలింగ్ కేంద్రమునకు 200 మీటర్ల పరిధి వరకు ఎలాంటి ప్రచారం ఉండరాదని అభ్యర్థికి వాహనం పర్మిషన్ మంజూరు నిబంధనల మేరకు చేయబడుతుందని అందులో ఎలక్షన్ ఏజెంట్, అభ్యర్థి లేదా పార్టీకి సంబంధించిన వారు మాత్రమే ఉండాలని అది కూడా డ్రైవర్ తో కలిపి ఐదు మంది కన్నా ఎక్కువ అనుమతి లేదని, జిల్లా ఎన్నికల అధికారి వారిచే మంజూరు చేయబడిన పాస్ వాహనం ముందు భాగాన ఉండాలని, ఓటర్లను వాహనాలలో తరలిస్తే అండర్ సెక్షన్ 133 మరియు పీనల్ యాక్షన్ అండర్ సెక్షన్ 123 (5) ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 మేరకు చర్యలు ఉంటాయని, సెల్ ఫోన్లు, కార్డ్ లెస్ ఫోనులు పోలింగ్ కేంద్రం 100 మీటర్ల పరిధిలో అనుమతి లేదని తెలిపారు. పోలింగ్ కేంద్రమునకు 200 మీటర్ల వెలుపల మాత్రమే పోలింగ్ ఏజెంట్లు ఒక టేబుల్ కుర్చీ ఏర్పాటు చేసుకోవచ్చని, తెల్ల కాగితంపై ఓటర్ వివరాల స్లిప్ వ్రాసి ఓటరుకు ఇచ్చుకోవచ్చని అందులో ఎలాంటి అభ్యర్థి, పార్టీ వివరాలు సింబల్ లు ఉండరాదని తెలిపారు. పోలింగ్ ముగిసిన తర్వాత 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పోల్డ్ ఈవీఎంలు మే 13న లేదా మే 14న శ్రీ పద్మావతి మహిళ యూనివర్సిటీ నందు ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్ నందు సాధారణ పరిశీలకుల, రిటర్నింగ్ అధికారుల, రాజకీయ పార్టీల, అభ్యర్థుల సమక్షంలో భద్రపరచడం జరుగుతుందని వీడియో రికార్డింగ్ చేయబడుతుందని, వెబ్ కాస్టింగ్ ద్వారా ఈవిఎం ల భద్రత పర్యవేక్షణ చేయడం జరుగుతుందని పోటీ చేస్తున్న అభ్యర్థులు లేదా ఏజెంట్లు ప్రతిరోజు సీసీటీవీలో శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయంలో పరిశీలించవచ్చని, త్రీ లేయర్ సెక్యూరిటీ ఏర్పాటుతో సిఎపిఎఫ్ కేంద్ర బలగాలు, రాష్ట్ర సాయుధ బలగాలు, రాష్ట్ర పోలీసులు భద్రత కల్పిస్తారని తెలిపారు. ప్రతిరోజు జిల్లా ఎన్నికల అధికారి లేదా ఏఆర్ఓ పరిశీలించడం జరుగుతుందని సంబంధిత రిజిస్టర్లలో సందర్శన వివరాలు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు
జిల్లాలో మే 13న జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులు సహకారం అందించాలని, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును నిర్భయంగా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు, డిఆర్ఓ పెంచల కిషోర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News