Breaking News

జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నాం

-మే 13 న జరగనున్న ప్రజాస్వామ్య పండుగ పోలింగ్ నందు అందరు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
-ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట బందోస్తు ఏర్పాటు : జిల్లా ఎస్.పి. కృష్ణ కాంత్ పటేల్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలు- 2024 లో భాగంగా ఈ నెల 13 న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని, ప్రతి ఒక ఓటరు తమ ఓటు హక్కును నిర్భయంగా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని వీసీ హాల్ నందు సార్వత్రిక ఎన్నికలు- 2024 సందర్భంగా ఈ నెల13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సన్నద్ధత అప్డేట్ వివరాలపై కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా ఎస్.పి.కృష్ణ కాంత్ పటేల్ తో కలసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు – 2024 లో భాగంగా తిరుపతి జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజక వర్గాలు మరియు ఒక పార్లమెంట్ స్థానానికి మే 13 న పోలింగ్ జరగనున్నదని అందుకు గాను పూర్తి స్థాయిలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. జిల్లాలో మొత్తం 2140 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని అన్ని పోలింగ్ స్టేషన్లో అన్ని ఏర్పాట్లతో పాటు బందోబస్తు ఏర్పాటు చేశామని, అలాగే అన్ని స్ట్రాంగ్ రూములలో కూడా పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రేపు ఆదివారం సాయంత్రం కల్లా అన్ని పోలింగ్ స్టేషన్ల నందు త్రాగు నీరు, షేడ్ ఏర్పాటు, ప్రథమ చికిత్స, ఓ.ఆర్.ఎస్, ఫ్లూయిడ్స్ వంటివి ఏర్పాటు కల్పించేలా మెడికల్ క్యాంపుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించడం జరిగిందన్నారు. జిల్లాలో 1401 పోలింగ్ స్టేషన్ల నందు వెబ్ క్యాస్టింగ్, 888 వీడియో గ్రాఫర్లు, 964 మంది మైక్రో అబ్జర్వర్ల ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పోలింగ్ జరుగు తీరును పొలిటికల్ పార్టీ సంబంధించిన వారు, పోటీలో నిలబడిన అభ్యర్థులు, ఏజెంట్లు పరిశీలించవచ్చునని తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నేటి శనివారం సాయంత్రం 6 గంటల నుండి పోలింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ప్రచారాలు, సభలకు, రాజకీయ ప్రచారాలకు అనుమతి లేదని, కేవలం ప్రింట్ మీడియాలో ప్రీ సర్టిఫికేషన్ పొందిన ప్రకటనలకు మాత్రమే వార్తా పత్రికలనందు మాత్రమే ప్రచురించవచ్చునని, అలాగే 144 సెక్షన్ అమలు లో ఉంటుందని తెలిపారు.

తిరుపతి యాత్రా ప్రదేశం అయినందున అనేక మంది ఇతర ప్రాంతాల, రాష్ట్రాల నుండి వస్తుంటారని అట్టి వారు తమ రాకకు గల కారణాలను రుజువు చేసుకోవడానికి వారి వద్ద రుజువులు చూపి సహకరించాలని, లేనిచో బోగస్ ఓట్లు వేయడానికి వచ్చారని తేలితే అట్టి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదనంగా 18 శాతం ఈవిఏంలను రిజర్వులో ఉంచడం జరిగిందని పోలింగ్ సమయంలో ఈ.వి.ఏం లలో ఏవైనా సమస్యలు వస్తే వీటిని ఉపయోగించడం జరుగుతుందని వీటి కోసం ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు వంతున బెల్ ఇంజనీర్లను కేటాయించామని తెలిపారు. ఓటింగ్ వేయడానికి పోలింగ్ ముగిసే సాయంత్రం 6 గం. నిర్ణీత సమయంలోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని క్యూ లైన్ లో ఉన్న ఓటర్లకు స్లిప్పులు ఆఖరు వ్యక్తి నుండి పంపిణీ చేసి పోలింగ్ సమయం దాటినా కూడా వారికి ఓటింగ్ పూర్తి అయ్యేవరకు ఓటింగ్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని అన్నారు. పోల్ రోజున ఎప్పటికప్పుడు పోలింగ్ సంబందిత సమాచారాన్ని పోల్ డే మానిటరింగ్ సిస్టమ్ యాప్ (పిడిఎంఎస్) ద్వారా ప్రతి రెండు గంటలకు పోలింగ్ శాతం సమాచారం అందించడం జరుగుతుందని తెలిపారు. అలాగే పోల్ ఏర్పాట్లు, మాక్ పోల్ నిర్వహణ తదితర పోల్ కి సంబంధించిన అంశాలు ఎప్పటికప్పుడు రియల్ టైమ్ లో సమాచారం అందుతుందని తెలిపారు. ఇప్పటికే ఓటర్లకు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ల పంపిణీ బిఎల్ఓ ల ద్వారా చేపట్టడం జరిగిందని తెలిపారు. రాజకీయ పార్టీల వారు 200 మీటర్ల దూరంలో ఒక బూత్ ఏర్పాటు చేసుకుని ఓటర్లకు వారి ఓటర్ వివరాలు మాత్రమే తెల్ల కాగితంపై రాసి ఇవ్వవచ్చని, పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రచారాలు చేయరాదని తెలిపారు. ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లు తమ ఎపిక్ కార్డుతో లేదా ఎన్నికల కమిషన్ సూచించిన ఇతర ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులైన ఆదార్, రేషన్ కార్డు, పాస్ పోర్ట్ , బ్యాంక్ అక్కౌంట్ తదితర వాటిలో ఏదేని వాటిని తమతో తీసుకుని రావాలని తెలిపారు. ఓటర్ వద్ద అన్ని వివరాలు పక్కాగా ఉండి ఓటింగ్ కేంద్రం నందు ఓటరు లిస్ట్ నందు ఓటర్ వివరాలు లేకపోయినా, ఎఎస్డి లిస్ట్ నందు ఉండి పోలింగ్ రోజు వచ్చినా ప్రిసైడింగ్ అధికారి పరిశీలించి సదరు ఓటర్ కు ఛాలెంజ్ ఓటింగ్ ద్వారా తమ ఓటు వేసే అవకాశం ఉందని తెలిపారు. ఫోటో మార్ఫింగ్ వంటి అక్రమాలకు పాల్పడితే, సదరు ఓటర్ వివరాలు అధికారుల పరిశీలనలో నకిలీ ఓటరుగా తేలితే అటువంటి వారిపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

తిరుపతి నియోజకవర్గంలో అధికంగా 46 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున ప్రతి పోలింగ్ కేంద్రాలలో అందరు పార్టీల ఏజెంట్లకు సిటింగ్ సామర్థ్యం లేనందున ఎన్నికల కమీషన్ సూచనల మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలలో ఎక్కడైతే స్థలాభావం వలన తక్కువ స్థలం ఉండి, ఎక్కువమంది అభ్యర్థులు పోటీల్లో ఉన్నారో అక్కడ ప్రాధాన్యతా క్రమంలో ఎవరిని లోపల అనుమతి అనేది సంబంధిత ప్రిసైడింగ్ అధికారి అబ్జర్వర్ గారి సూచనల మేరకు, రిటర్నింగ్ అధికారి, సెక్టార్ అధికారి సూచనల మేరకు సీటింగ్ కొరకు చర్యలు తీసుకుంటారని తెలిపారు. తాజా ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు గుర్తింపు పొందిన జాతీయ పార్టీల అభ్యర్థులు, గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల అభ్యర్థులు, గుర్తింపు పొందిన ఇతర రాష్ట్ర పార్టీలు ఎవరైతే వారి పార్టీ సింబల్ కేటాయించబడిన అభ్యర్థులు, రిజిస్టర్డ్ మరియు గుర్తింపు పొందని పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇలా పోలింగ్ కేంద్రంలో స్థలం అందుబాటులో ఉన్న మేరకు అనుమతి ఉంటుందని, మిగిలిన వారు పోలింగ్ కేంద్రం బయట కూచుని అవసరం మేరకు పోలింగ్ కేంద్రం లోపలికి వెల్లి పరిశీలించవచ్చని తెలిపారు. ఇది అర్థం చేసుకుని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. పోలింగ్ ముగిసిన తర్వాత 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పోల్డ్ ఈవీఎంలు భద్రత నడుమ మే 13న లేదా మే 14న శ్రీ పద్మావతి మహిళ యూనివర్సిటీ నందు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ నందు సాధారణ పరిశీలకుల, రిటర్నింగ్ అధికారుల, రాజకీయ పార్టీల, అభ్యర్థుల సమక్షంలో భద్రపరచడం జరుగుతుందని వీడియో రికార్డింగ్ చేయబడుతుందని, వెబ్ కాస్టింగ్ ద్వారా ఈవిఎం ల భద్రత పర్యవేక్షణ చేయడం జరుగుతుందని పోటీ చేస్తున్న అభ్యర్థులు లేదా ఏజెంట్లు ప్రతిరోజు సీసీటీవీలో శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయంలో పరిశీలించవచ్చని, త్రీ లేయర్ సెక్యూరిటీ ఏర్పాటుతో సిఎపిఎఫ్ కేంద్ర బలగాలు, రాష్ట్ర సాయుధ బలగాలు, రాష్ట్ర పోలీసులు భద్రత కల్పిస్తారని తెలిపారు. ప్రతి రోజు జిల్లా ఎన్నికల అధికారి లేదా ఏఆర్ఓ పరిశీలించడం జరుగుతుందని సంబంధిత రిజిస్టర్లలో సందర్శన వివరాలు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. మీడియా ప్రతినిధులు క్యూ లైన్లు, పోలింగ్ కేంద్రాల బయటి నుండి మాత్రమే కవరేజ్ చేసుకోవాలని నిబంధనల మేరకు ఉండాలని అన్నారు. పోలింగ్ కు 48 గం. ల ముందు నుండి పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు సైలెన్స్ పీరియడ్ నందు ఎగ్జిట్ పోల్స్ ఎలక్ట్రానిక్ మీడియా, సినిమాటోగ్రఫీ, సోషియల్ మీడియా నందు ప్రదర్శించ రాదని, అనుమతి లేదని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు మాత్రమే అభ్యర్థుల వాహనానికి అనుమతి ఉంటుందని తెలిపారు. అభ్యర్థికి వాహనం పర్మిషన్ మంజూరు నిబంధనల మేరకు చేయబడుతుందని అందులో ఎలక్షన్ ఏజెంట్, అభ్యర్థి లేదా పార్టీకి సంబంధించిన వారు మాత్రమే ఉండాలని అది కూడా డ్రైవర్ తో కలిపి ఐదు మంది కన్నా ఎక్కువ అనుమతి లేదని, జిల్లా ఎన్నికల అధికారి వారిచే మంజూరు చేయబడిన పాస్ వాహనం ముందు భాగాన ఉండాలని, ఓటర్లను వాహనాలలో తరలిస్తే ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ సి ఐ ఆదేశాల మేరకు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే నిజమైన యాత్రికులకు వారికి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలింగ్ సమయంలో ఏదైనా ఫిర్యాదులు ఉంటే 1950 టోల్ ఫ్రీ నంబర్ కి కాల చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

జిల్లాలో మే 13న జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల పండుగ వాతావరణంలో నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులు సహకారం అందించాలని, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును నిర్భయంగా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు.

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో మార్చి 16 నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉందని, ఎన్నికలు సజావుగా జరిపెందుకు 5000 మందితో కూడిన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి వారు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా తమ వంతు సహకారం అందిస్తున్నారని తెలిపారు. ఈ రోజున సాయంత్రం 6 గంటల నుంచి మే 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ప్రచారాలపై బ్యాన్ ఉంటుందని ఎవరైనా దానిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నిస్తే అట్టివారిపై కేసులు నమోదు చేసి ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు తప్పవని అన్నారు. తిరుపతికి దగ్గరలో తమిళనాడు బార్డర్ ఉన్నందున ఎవరైనా అక్రమంగా తమిళనాడు నుంచి మద్యం తరలించే వీలు ఉండడం వల్ల చెక్పోస్టుల వద్ద నిఘా ఉంచామని తెలిపారు. ఓటు వేయడానికి వచ్చేవారు తమ వెంట సెల్ ఫోన్ ను పోలింగ్ కేంద్రంలోకి తీసుకు వెళ్ళరాదని తెలిపారు. బయటి ప్రాంతాల నుండి, రాష్ట్రాల నుండి వచ్చి వివిద ప్రాంతాలు, హోటల్స్ నందు బస చేస్తున్న వారు అనుమానాస్పద వ్యక్తులుగా ఉంటే వారి గురించి పోలీసులకు సమాచారం అందించాలని, హోటల్ ల యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరుగుటకు అన్ని ఏర్పాట్లు , బందోబస్తు చేపడుతున్నామని ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు ను వినియోగించుకోవాలని తెలిపారు.

ఈ మీడియా సమావేశంలో డి.ఆర్.ఓ. పెంచల కిషోర్, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి బాలకొండయ్య, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *