మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వచ్చే నెల 4 వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను న్యూ ఢిల్లీ నిర్వచన్ సదన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి, త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాల ప్రకటనకు, శాంతి భద్రతల పరిరక్షణకు నియోజకవర్గాల వారీగా ఇప్పటివరకు చేసిన ఏర్పాట్లను, తీసుకుంట్టున్న చర్యలను ఈ సమావేశంలో ఆయన సమీక్షించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్, అడిషనల్ డీజీ ఎస్. బాగ్చీ , అదనపు సీఈఓ ఎమ్ ఎన్ హరేంధిర ప్రసాద్ తోపాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు వారి నియోజకవర్గాల నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి నగరంలోని కలెక్టరేట్ విసీ హాల్ నుండి జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ప్రకారం ఓట్ల లెక్కింపు కోసం అన్ని సిద్ధం చేశామన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రమైన కృష్ణా విశ్వవిద్యాలయం వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. కేంద్రంలో మీడియా సెంటర్, కమ్యూనికేషన్ రూము, పబ్లిక్ కమ్యూనికేషన్ రూము, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. రౌండ్ వారీగా ఎన్నికల ఫలితాల ప్రకటనకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అగ్నిప్రమాదాలు నివారించడానికి అన్ని భద్రత చర్యలు చేపట్టామన్నారు. ఓట్ల లెక్కింపు సిబ్బందికి మొదటి రాండమెంజేషన్ ద్వారా తొలి విడతగా శిక్షణ తరగతులు నిర్వహించామన్నారు. అలాగే వచ్చే జూన్ నెల 2వ తేదీన రెండవ సారి రాండమైజేషన్ చేసి రెండవ విడత శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. జిల్లాలో లూజు పెట్రోలు విక్రయాలు, బాణాసంచా విక్రయాలు, వాడకము లౌడ్ స్పీకర్లు, డ్రోన్లు వినియోగం నిషేధించామన్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థులతో సమావేశం నిర్వహించి ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఎన్ని టేబుళ్ళు ఉంటాయి, ఎంతమంది కౌంటింగ్ ఏజెంట్లు అవసరము, అక్కడ ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుంది, అనే విషయాలపైన అవగాహన కలిగించడంతోపాటు పాటించవలసిన నియమాలను వివరించామన్నారు. అన్ని నియోజకవర్గాల ఈవీఎంల ఓట్ల లెక్కింపు కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు పూర్తవుతుందన్నారు. అలాగే అన్ని శాసనసభ నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ ల ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 3 గంటలకు పూర్తి అవుతుందన్నారు. పార్లమెంటు నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపు కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు పూర్తవుతుందన్నారు. జిల్లా పోలీసు అధికారి అద్నాన్ నయీమ్ అస్మి మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షించేందుకు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. ఎక్కడైనా గొడవలు అల్లర్లు జరిగితే తక్షణమే స్పందించి నియంత్రించేందుకు
డ్రోన్లు, స్ట్రైకింగ్ ఫోర్సులు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సంయుక్త కలెక్టర్ గన్నవరం నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి గీతాంజలి శర్మ, డిఆర్ఓ కే చంద్రశేఖర రావు పెడన, అవనిగడ్డ, పెనమలూరు, పామర్రు, గుడివాడ, మచిలీపట్నం రిటర్నింగ్ అధికారులు పి వెంకటరమణ, జి బాలసుబ్రమణ్యం, శ్రీదేవి, పి పద్మావతి,ఎం వాణి తదితర ఎన్నికల అధికారులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News