మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పొరపాట్లకు అవకాశం లేకుండా ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సక్రమంగా చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఎన్నికల అధికారులు, సిబ్బందికి సూచించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లోని స్పందన సమావేశపు మందిరంలో ఎన్నికల అధికారులు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియపై ఆచరణాత్మకంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ కృష్ణా యూనివర్సిటీలో జూన్ 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో భాగంగా మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కార్యక్రమం జరుగుతుందని అనంతరం 7 నియోజకవర్గాల కౌంటింగ్ హాళ్లలో ఈవీఎంల ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతుందన్నారు. పార్లమెంటు నియోజకవర్గం కౌంటింగ్ హాలు వద్ద ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, ఇందుకోసం 14 టేబుళ్ళు ఏర్పాటు చేస్తున్నామని, ఒక్కో టేబుల్ కు 500 చొప్పున పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి టేబుల్ కు పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున కౌంటింగ్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఆయన వివరిస్తూ ఇందులో రెండు కవర్లు ఉంటాయని, బయటి కవర్ను ఫారం 13-సి గా పిలుస్తారని, దానిని తెరిచిన తర్వాత రెండు డాక్యుమెంట్లు ఉంటాయని, అందులో ఒకటి డిక్లరేషన్ 13-ఏ, ఇంకొకటి 13-బి కవరులో వాస్తవ పోస్టల్ బ్యాలెట్ ఉంటుందన్నారు. డిక్లరేషన్ 13-ఏ లో తప్పనిసరిగా ఓటరు సంతకం చేసి ఉండాలని, దానితోపాటు గెజిటెడ్ అధికారి ధృవీకరించి సంతకం చేసి స్టాంపు వేయడం లేదా హోదాని రాసి ఉండాలని, అలా ఉంటేనే అది చెల్లుబాటు బ్యాలెట్ ఓటుగా పరిగణించాలన్నారు. చెల్లుబాటుకాని ఓట్లు ఏవైనా ఉంటే 13-సి కవర్లో ఉంచి తిరస్కరిస్తూ వేరుగా పెట్టెలో ఉంచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి షాహిద్ బాబు, శిక్షణ నోడల్ అధికారి మురళీ కిషోర్, ఏఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News